ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

ముక్తేశ్వర్ , భీమ్ తాల్

నైనితాల్ కి సుమారు 52 కిలోమీటర్ల దూరంలో , ఢిల్లీ నుంచి సుమారు 343 కిలో మీటర్ల దూరం లో వున్న చిన్న కొత్త వేసవి విడిది యీ ముక్తేశ్వర్ . నైనితాల్ నుంచి అంతా ఘాట్ రోడ్డు కావడం తో యెత్తైన చెట్లతో కూడిన పర్వతాలు ఒకవైపు లోతైన లోయ మరో వైపు సన్నని తారు రోడ్డు  , నైనితాల్ దాటిన తరువాత పెద్దగా జనసంచారం వుండదు . ఈ ప్రాంతం యింకా పర్యాటకుల దృష్టిలోకి రాకపోవడం వల్ల రాకపోకలు అస్సలు లేవనే చెప్పాలి . లోయలోకి చూస్తే మబ్బు తునకలు అక్కడక్కడ కిందన కనిపిస్తూ మనం వెళ్లే దారిలో మన కారును తాకుతూ వెళుతూ వుంటాయి . అలా వెళ్లినప్పుడు యెంతో చల్లగా అప్పుడప్పుడు సన్నని వాన కురుస్తూ సాగిపోతూ వుంటాయి . మాకు ముందుగా టూరు ఆపరేటరు చెప్పిన హొటలు ముక్తేశ్వర్ గ్రామానికి మొదటి మలుపులో వుంది , అయినా వూరు చూడాలనే కుతూహలంతో గ్రామానికి వెళ్లేం చాలాచిన్న గ్రామం . అయితే కొండ చరియలలో నివాసాలు వున్నాయట , ఓ చిన్న పోస్ట్ ఆఫీసుకూడావుంది . కాని యెక్కడా హోటల్స్ లేవు . వెనుకకి తిరిగి ఆ హోటల్ కే వెళ్లేం .

కొండవాలులో కట్టిన హోటలు , యే వైపునుంచి చూసినా పచ్చని సౌదంర్యమే , హోటలు సదుపాయంగానే వుంది భోజనం మాత్రం యేమీ బాగులేదు . నైనితాల్ కన్నా చాలా చల్లగా వుంది , మాలాంటి పర్యాటకులు కొంతమంది అక్కడ బసచేసేరు . వారు అక్కడకి దగ్గరగా వున్న ముక్తేశ్వర్ బాబా సమాధిని దర్శించుకొని వచ్చేరు . మేము పెద్దగా బాబాల భక్తులం కాకపోవడంతో పెద్దగా కుతూహలం చూపించలేదు . 

మేమున్న చోటుకు కాస్త దూరంలో అతి పురాతనమైన ముక్తేశ్వర మందిరం వుంది దానిని దర్శించుకునేందుకు మరునాడు పది పదకొండు గంటలకు బయలుదేరేం . ముక్తేశ్వర మందిరం ఓ గుట్ట మీద వుంది . ఓ కిలోమీటర్లు ముక్తేశ్వర్ గ్రామం వైపుగా నడవాలి . అంతా తారు రోడ్డే అయినా ఓ పక్క యెత్తైన కొండలు వంపులు తిరిగిన రోడ్డు మేఘాలు మనని తాకుతూ ప్రయాణించడం అవన్నీ ఉద్వేగానికి గురిచేసేయో లేక ఆ యెత్తులో అన్ని చెట్లున్నా ఆక్సిజన్ కావలసినంత అందలేదోగాని మాకు ఆయాసం రాసాగింది . గుట్ట పైకి చేరుకున్న తరువాత మందిరం మాకు అసంతృప్తిని కలుగ జేసినా పరిసరాల పచ్చదనం . ఆ గుట్టపైనుంచి కన్పించిన లోయల అందాలు కనువిందుజేసి అంతదూరం ఆయాసపడుతూ నడవడం వృధా కాలేదనే తృప్తి కలిగింది .

ఆ మందిరం కనీసం వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మింపబడిందని హోటల్ యజమాని చెప్పేరు .

ఇక్కడ స్థలపురాణం ప్రకారం హిమవంతుని కుమార్తె హైమవతి వివాహాం పరమేశ్వరునితో నిశ్చయించి , వివాహ వేదికగా ' త్రియుగి నారాయణ్ ' ను యెన్నుకుని హిమవంతుని పరివారం ( ఆడపెళ్లి వారు ) బయలు దేరిన ప్రదేశం యిదిట .

వరి గోధుమ పంటలకు అనువుగా లేని కొండలను వీరు యాపిల్ , నాష్పత్తి పండ్ల తోటల పెంపకానికి చక్కగా వుపయోగించుకుంటున్నారు . బంగాళా దుంపలను పండిస్తున్నారు . నైనితాల్ జిల్లా బంగాళాదుంపలకు ప్రసిధ్ది .

టూరు గైడ్స్ అక్కడకి తీసుకువెళతాం యిక్కడకి తీసుకువెళతాం , సూర్యోదయ ప్రదేశం , సూర్యాస్తమయ ప్రదేశం లాంటివి యేమీ లేవు మనకు తోచినంత సేపు హాయిగా నడవడం , కళ్లనిండా నిద్రపోవడం తప్ప వేరే యే గొడవ వుండదు .

అలా ఓ రెండురోజులకన్నా గడపడం కూడా కష్టమే .

తర్వాత మళ్లా నైనితాల్ వెళదామనుకున్నప్పుడు మేం నైనితాల్ లో వుండదలుచుకోలేదు . అందుకే మేము భీమతాల్ లో హోటల్ బుక్ చేసుకున్నాం .

నైనితాల్ గ్రామం యూరోపియన్ల వల్ల నిర్మింబడినది కాని భీమతాల్  గ్రామం చాలా పురాతనమైనది . టిబెట్ , నేపాలు నుంచి వచ్చే పాదచారులు , వర్తకులు భీమతాల్ గ్రామంమీదుగా ప్రయాణించి మైదాన ప్రాంతాలు చేరుకునే వారుట , ఒకప్పుడు మనదేశానికి చైనాకి గల వాణిజ్య పరమైన ' సిల్క్ రూట్ ' లో  భాగమేమో ? . యిప్పటికీ గ్రామీణులు ఆ నడకదారిని వుపయోగించి కాఠ్ గోదాం చేరుతూ వుంటారు .

మహాభారతకాలం నుంచి భీమ తాల్ సరస్సు వుందని అంటారు . మహాభారత కాలంలో పాండవుల వనవాస సమయంలో ఓ రోజు భీముడు యీవనంలో సంచరిస్తూ  వుండగా అశరీరవాణి శివలింగ ప్రతిష్ట చేసుకొని పూజించుకోమని చెప్పగా భీముడు అక్కడ శివలింగ ప్రతిష్ట చేసి తన గదతో నేలను మోదగా అక్కడ జలవూరి సరస్సుగా మారిందట , భీముని చే ప్రతిష్టించ బడ్డ లింగం కాబట్టి భీమేశ్వర మహదేవ్ గా పిలువబడసాగింది . అలాగే సరస్సు కూడా భీముడి పేరుమీదుగా పిలువబడసాగింది .

భీమతాల్ సరస్సు చుట్టూ హోటల్స్ వున్నాయి , అన్ని వర్గాలవారికి అందుబాటులో వుండే రకరకాల హోటల్స్ వున్నాయి . భీమ తాల్ చుట్టూరా యెత్తైన కొండలు ఆ కొండలు నీటిలో ప్రతిఫలిస్తూ వుంటే ఆ ప్రతిబింబాలు చూస్తూ బీమతాల్ కి యెదురుగా కూర్చోడం ఓ అనుభవం . భీమతాల్ వొడ్డున వున్న ఘరెవాల్ వికాస మండలి వారి గెస్ట్ హౌసులో వున్నాం .

పదిహేడు శతాబ్దంలో కుమావు ప్రాంతాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజా బాజ్ బహదూర్ యీ మందిరాన్ని నిర్మించేడు . కొండలలో వుండే మందిరాలకు యిక్కడ కురిసే హిమపాతం వల్ల వానలవల్ల కొండచరియలు విరిగి పడడం వల్ల క్షతి కలుగుతూనే వుంటుంది .

భీమతాల్ లో చూడదగ్గవి

' వనకాంది ఆశ్రమం ' , వనకాంది అనే బాబా  ఆశ్రమం నిర్మించుకున్న ప్రదేశం అతని పేరుమీదుగా పిలువబడుతోంది . చాలా ప్రశాంతంగా వుంటుంది . ఈ అడవిలో వున్న వన్యప్రాణుల సంరక్షణార్దం పాటుపడపతున్న వ్యక్తి , అతని చొరవతో యిక్కడ సాంచ్యురి నడపబడుతోంది . కాలుష్యరహిత ప్రకృతి మనను సేదతీరుస్తుంది అనడం లో యెటువంటి సందేహం లేదు .

కర్కోటక పర్వతం --

ఈ పర్వతం భీమతాల్ కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వుంది . కర్కోటక పర్వతం అంటే రాతి పర్వతం అయివుంటుంది అనుకున్నాం , కాని కర్కోటకుడు అనే నాగరాజు మందిరం వున్న పర్వతం కాబట్టి యీ పర్వతాన్ని కర్కోటక పర్వతం అని పిలుస్తున్నారు . ఋషి పంచమి నాడు వేలాది భక్తులు యీ మందిరాన్ని దర్శించుకొని పూజలు చేసుకుంటారు . కర్కోటకుడు భక్తులను పాముల బారినుండి రక్షిస్తాడని నమ్ముతారు . అయితే మేము వెళ్లినపుడు ఆ ప్రాంతాలలో యెవరు లేకపోవడం తో వివరాలు గాని స్థలపురాణం గాని తెలియలేదు . చాలా పురాతనమైన చిన్న రాతి మందిరం .

చదువరులకు యిక్కడ మరో విషయం చెప్పాలి . ఉత్తర భారత యాత్రలు చేసే యాత్రీకులు మందిర విశిష్టితను చూడాలిగాని , దక్షిణ భారత దేశం లోని మందిర శిల్పకళతోను , వైశాల్యం తోను పోలుస్తామంటే నిరాశే మిగులుతుంది . ఈ మధ్యన ఓ తమిళ ఆవిడ అలాగే పోల్చి డబ్బు దండగ అయిందని బాధపడింది , ఆమె చిదంబరం లో పుట్టి పెరిగింది . ప్రతీ కోవెల ఆవిడ నటరాజ మందిరంతో పోలుస్తోంది . 

అయితే కర్కోట పర్వత పరిసరాలు వదిలి రాబుద్ది కాలేదు . అంతబాగున్నాయి . సంవత్సరంలో చాలా భాగం వర్షం పడడం వల్ల యిక్కడి మొక్కలు యెంతో బలంగా పెరుగుతున్నాయి , చాలా మటికి యెర్ర , గులాబీ రంగు గులాబీ చెట్లు ( బాగా పెరిగి మాను కట్టి వున్నాయి ) కొండంతా పూలతో నింపుతున్నాయి . డలియా , జినియా పువ్వులు రోడ్డు మీద యెక్కడపడితే అక్కడే చూడొచ్చు . ప్రకృతిలో వున్న అన్ని వర్ణాల పువ్వులను అక్కడ చూడొచ్చు .

గార్గ్ పర్వతం ----

గార్గి నది పుట్టిన ప్రదేశం .

భీమ తాల్ అక్వేరియమ్ ----

భీమతాల్ మధ్యభాగం లో వున్న చిన్న ద్వీపం మీద పర్యాటకుల సదుపాయం కోసం హోటలు ప్రారంభంచబడింది కొన్నాళ్ల  తరువాత హోటలు వారి నిర్లక్ష్యం వల్ల సరస్సులో కాలుష్యం పెరిగి సరస్సు లుప్తమయ్యే ప్రమాదం కనిపెట్టిన అధికారులు హోటలు మూసివేయించి ఆ ప్రదేశంలో అక్వేరియం నిర్మించేరు . అక్వేరియం చూడటానికి వెళ్లేవారు బోటులో వెళ్లాలి . రకరకాల చేపలను వుంచేరు . మిగతా రకరకాల పెద్దపెద్ద అక్వేరియం లు చూసిన వాళ్లకి కాస్త బోరనిపిస్తుంది . అయితే భీమ తాల్ లో చుట్టూ వున్న పర్వతాల ప్రతిబింబాలను చూస్తూ బోటింగు చెయ్యడం చాలా బాగుంటుంది .

సీతాకోకచిలుకల సంరక్షణా కేంద్రం ------

బీమ్ తాల్ కి అయిదారు కిలోమీటర్ల దూరంలో యీ సీతాకోకచిలుకల సంరక్షణా కేంద్రం వుంది . యిందులో సుమారు 1300 రకాల సీతాకోక చిలుకలు వున్నాయి వాటిలో సుమారు 240 రకాలు  యీ కొండలలో సేకరించినవేనట . ఈ ప్రాంతంలోని వాతావరణం సీతాకోకచిలుకల పెంపకానికి అనువుగా వుంటుంది , చాలా బటర్ ఫ్లై పార్కులలో స్ప్రింక్లర్స్ పెట్టి వాతావరణాన్ని తేమగా చెయ్య వలస వస్తుంది కాని యిక్కడ ఆ అవుసరం యెక్కువగా రాదు . రంగురంగుల సీతాకోక చిలుకలు వాటి ప్యూపాలను ప్రదర్శన కి వుంచేరు . అన్ని సీతీకోకచిలుకలను ఒకే చోట చూడ్డం కూడా బాగుంటుంది . ఒకమారు చూడొచ్చు .

నలదమయంతి సరస్సు -----

పేరు లో వున్నట్లే యీ కథ నలదమయంతులకు సంబంధించినది . ఈ కథ స్థానికులనుంచి విన్నది . ఏ గ్రంథాలలోనూ లేదేమో యీ కథ . నలదమయంతులు యిద్దరూ ఒకరినోడొకరు యిష్టపడతారు . దమయంతి అతిలోక సౌందర్యవతి కావడంతో ఆమెను వివాహమాడాలని దేవతలు కుతూహల పడతారు . దమయంతి స్వయంవరానికి  రాజకుమారులు , నలచక్రవర్తి , దేవతలు కూడా తరలి వస్తారు . దమయంతి స్వయంవరంలో నలుని తప్ప వేరే యెవరినీ వరించదని తెలిసిన దేవతలు నలుని రూపము ధరించి స్వయంవరానికి వస్తారు . స్వయంవర మండపాన అంతమంది నలులను చూసిన దమయంతి ధిగ్భ్రాంతి చెంది మనస్సులో యిష్టదైవాన్ని దారిచూపమని కోరగా దమయంతికి దేవతలు రెప్పలార్పరనే నిజం తడుతుంది . ఆవిధంగా నలుని పోల్చుకొని అతని కంఠాన వరమాల వేస్తుంది దమయంతి . 

నలదమయంతులు సుఖజీవనం సాగిస్తూ వుండగా దమయంతికి ప్రతీరోజూ అశరీరవాణి మమ్మల్ని తిరస్కరించినందుకు ఫలితముగా యీ భవనం నీళ్లపాలు అవుతుంది అని శపించడం వినిపించేదట , అలాగే ఓ రోజు రాజభవనం కూలి సరస్సుగా మారిపోయిందట . అప్పటినుంచి యీ సరస్సు నలదమయంతి సరస్సు గా పిలువబడసాగిందట . కొండలలో దట్టమైన అడవి మధ్యలో వున్న సరస్సు నైనితాల్ , భీమతాల్ తో పోలిస్తే చిన్నదే . చెరువు అని చెప్పుకుంటే సరిపోతుంది . చెరువుకు వున్నట్లే నాలుగు వైపులా గట్లు కట్టి వున్నాయి .  ఆ చెట్ల మధ్య అలానడుస్తూ కొంతసమయం గడపడానికి బాగానే వుంది .

హిడింబా పర్వతం -----

మహాభారత సమయంలో యీ ప్రాంతం హిడింబాసురుడి పరిపాలనలో వుండేది . భీముడు హిడింబాసురుని సంహరించి హిడింబిని వివాహ మాడడం వారికి ఘటోచ్గచుడు అనే పుతృడు జన్మించడం మనకు తెలిసిన కథే , ఈ కొండప్రాంతాలవారు హడింబిని దేవతగా పూజిస్తారు . చాలా చోట్ల హిడింబాదేవి మందిరాలు కూడా మనకు కనిపిస్తాయి . అలా లో చిన్న మందిరం యీ కొండమీద వుండడంతో యీ పర్వతాన్ని హిడింబా పర్వతంగా పిలువబడుతోంది .

హిల్ స్టేషనుకి వెళ్లి తినితొంగుంటే బాగోదుకదా యిలా యేవో కొత్త ప్రదేశాలు తిరుగుతూ కొత్త , కథలను వింటూ వుంటే సమయం హాయిగా గడిచిపోతుంది కదా ?

మళ్లావారం మరికొన్ని ప్రదేశాల గురించి తెలియ జేస్తానని మనవి చేస్తూ శలవు .

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి