సోషల్ మీడియాలో ఏది రాసినా చెల్లిపోతుందని కొందరు అనుకుంటుంటారు. భావ ప్రకటనా స్వేచ్ఛని కొందరు ఉదాహరణగా చూపి, ఇతరుల వ్యక్తిగత జీవితాల్ని కించపర్చేలా వ్యవహరించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా ఈ 'సోషల్' దాడికి గురవుతున్నారు. చాలా వరకు 'సోషల్ మీడియాతో మనకెందుకులే' అని అనుకోవడంతో ఆయా ప్రముఖుల పట్ల 'బూతు పురాణం' సోషల్ మీడియాలో ఇంకా ఇంకా ఎక్కువైపోతుందని చెప్పవచ్చు. అయితే సహనానికీ ఓ హద్దు ఉంటుంది. ప్రముఖులు పోలీసులను ఆశ్రయిస్తే, ఆ తర్వాతి పరిణామాలు తీవ్రంగా మారిపోతాయి. సోషల్ మీడియాలో 'చెడు' రాతల కారణంగా నెటిజన్లను అరెస్ట్ చేసిన సంఘటనలు చాలానే కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా నెటిజన్లలో మార్పు రావడంలేదు. కొందరు సోషల్ మీడియాలో కనిపించేది ఎవర్నో విమర్శించడానికి మాత్రమే. ఇలాంటి వారితోనే సమస్య వస్తోంది. పద్ధతిగా వ్యక్తుల్ని లేదా సమాజాన్ని లేదా ప్రభుత్వాల్ని లేదా పార్టీల్ని ప్రశ్నించేవారిని తప్పు పట్టలేం. అయితే ఆ ప్రశ్నలోనే స్పష్టత ఉండాలి. అందులోనూ పద్ధతి తప్పనిసరి. పద్ధతి తప్పిందంటే మూల్యం చెల్లించుకోక తప్పదు.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరిపై ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పిచ్చి రాతలు ఎక్కువైపోయాయి. యూ ట్యూబ్ ఛానల్ అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో ఈ పైత్యం హద్దులు దాటేసింది. ఫలానా హీరోయిన్ ఫలానా దర్శకుడితో '..' అని అసభ్యకరమైన రాతలు రాస్తున్నారు. ఇలా రాసేవారికి పెద్దగా అనుభవం అవసరం లేదు. వాటిని వీడియోల రూపంలోకి మలచేసి, మార్ఫింగ్ ద్వారా దాన్నొక అద్భుతమైన వీడియోగా రూపొందించేస్తున్నారు. ఇవి ఆయా సెలబ్రిటీల సున్నిత మనసుల్ని దారుణంగా హింసించేస్తున్నాయి. సహనం నశించడంతో సినీ పరిశ్రమ తరఫున 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' పోలీసుల్ని ఆశ్రయించింది. ఇప్పుడు పోలీసులు, నిందితుల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. యూ ట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్ల నిర్వాహకులు ఇలా ఎవరు 'అదుపు తప్పితే' వారిని అదుపులో పెట్టి తీరతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల్లో ఉండేవారిని కూడా వదలబోమని పోలీసులు హెచ్చరిస్తుండడంతో సోకాల్డ్ నెటిజన్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది.
ప్రధానంగా ఇలాంటి వివాదాల్లో యువతదే కీలక పాత్ర. టైమ్ పాస్ కోసం కావొచ్చు, ఈజీ మనీ కోసం కావొచ్చు విలువల వలువలూడ్చేస్తున్నారు కొందరు. పోర్న్‌కి ఏమాత్రం తక్కువ కాని కంటెంట్‌తో సమాజానికి చేటు కలిగిస్తున్నామని వారు గుర్తించలేకపోతుండడం శోచనీయం. అయితే ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న 'పోర్న్ సినిమాలు' ఈ తరహా వైపరీత్యాలకు కారణమనే విమర్శ ఉంది. వాటిని అదుపులో పెట్టగలిగితే అన్ని పైత్యాలూ అదుపులో ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.