మారుతున్న టెక్నాలజీ, మనిషి నుంచి నిద్రని దూరం చేస్తోంది. ఆ నిద్ర లేకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ఏం చేయాలి? నిద్ర కోసం కూడా ఓ యాప్ ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని మనిషి వ్యాయామం మర్చిపోయాడు. దానికీ ఓ మందు ఉంది, అదే 'యాప్'. ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయ్ - ఇక్కడా యాప్ మనకి సహాయం చేస్తుంది. అది కాదు, ఇది కాదు, అన్నిటికీ ఓ యాప్ మీ కోసం సిద్ధంగా ఉంది. స్మార్ట్ టెక్నాలజీ మనిషికి అన్ని విషయాల్లోనూ చాలా చాలా చాలా ఉపకరిస్తోంది. దీన్ని ఉపకారం చేస్తోందని అనాలా? లేదంటే మనం మనమీద ఆధారపడ్డం మానేసి, యాప్‌ల మీద ఆధారపడేలా మారిపోతున్నామని అనుకోవాలా? ఏదన్నా అనుకోండి, అన్నిటికీ ఓ యాప్ మీకు సమాధానమిస్తుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో కొత్త కొత్త యాప్స్ పుట్టుకొచ్చేస్తున్నాయి. వీటిని సరిగ్గా వినియోగించుకుంటే మాత్రం మనల్ని మనం మైమర్చిపోవచ్చు. మన ఆరోగ్యం దానికి అప్పగించేయొచ్చు, మన నిద్రనీ, మన ఆకలిని కూడా యాప్‌కి నిర్భ్యంతరంగా అప్పగించేయవచ్చు.
ఓ యాప్ ఉంది. అందులో మీ అభిరుచికి తగ్గట్టుగా పాటల్ని పెట్టుకోవచ్చు, పక్షుల కిలకిలారావాలు సహా చాలా ప్రకృతి అందాల్ని పొందుపర్చుకోవచ్చు. ఇవన్నీ మీకు నిద్రలో సహాయం చేస్తాయి. నిద్రపోయే ముందు ఆ యాప్‌ని మీ స్మార్ట్ ఫోన్‌కీ వీఆర్ ఇన్‌స్ట్రుమెంట్‌కీ అనుసంధానం చేసేస్తే సరి. హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. ఎంత హాయిగా నిద్రపోతే అంత ఆరోగ్యం మీ సొంతం. ఇది బెడ్రూమ్‌లో మనకి ఉపయోగపడే యాప్. తిండిలోనూ అంతే. మీ అభిరుచులేంటో ఆ యాప్‌లో ఫీడ్ చేసేస్తే చాలు, మీ ఇష్టానికి తగ్గట్టుగా అది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంటుంది, మీ వారికీ సంకేతాలు పంపుతుంది. మీకు నచ్చిన భోజనం మీ కుటుంబ సభ్యులు మీకు సర్‌ప్రైజ్ ఇచ్చేలా మీ ముందుకు తీసుకురావొచ్చు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేసి, మీకు ఆనందాన్నిచ్చేందుకూ చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయి.
ఓ యాప్ మీ ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అదెలాగంటే, మీరు వ్యాయామం చేయాల్సిందిగా అది మిమ్మల్ని హెచ్చరించడమే కాదు, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలా మీరు వ్యాయామం చేస్తే బాగుంటుందో కూడా సూచించేస్తుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ రక్తపోటు, హార్ట్ బీట్ వంటివాటిని మీకు తెలియజేస్తుంది. మీ శరీరంలో వచ్చే మార్పుల్ని తెలియజేయడానికీ రకరకాల యాప్‌లున్నాయి. అవి మీ డాక్టర్‌తో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాయి కూడా. సో, యాప్ మీద మనం పూర్తిగా ఆధారపడిపోవచ్చన్నమాట. ఆగండాగండీ, అతి సర్వత్ర వర్జయేత్. మీ ప్రెండ్ మొబైల్ నెంబర్ ఎంతో మీరు మీ ఫోన్ చూడకుండా చెప్పండి? ఛాన్సే లేదు, చెప్పలేరు. ఎందుకంటే మీరు మొబైల్ ఫోన్ మీద ఆధారపడిపోయారు. అంటే మీ బ్రెయిన్‌కి పని తగ్గించేశారన్నమాట. అది మొద్దుబారిపోయిందన్నమాట. అందుకే స్మార్ట్‌గా ఆలోచించాలి. ఎంతమేర మనకి టెక్నాలజీ ఉపయోగపడ్తుందో అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే 'యాప్'లతో మీ జీవితంలో పండగే పండగ.