తిలక ధారణ ప్రాధాన్యము - గుమ్మా రామలింగ స్వామి

importance of tilaka dharana

హిందువులందరునూ, మరియూ వివాహమయిన స్త్రీలు  కుంకుమ బొట్టు నుదుటను ధరించుట సర్వ సాధారణము. అది నిత్యమూ ఉండవలెను. పురుషులు ఇతరులు శుభసయములందు, దేవాలయములకు వెళ్ళునపుడు, ఆనవాయితీగా ఈ తిలక ధారణ చేయుట, మన ఇంటికి అతిధులు మిత్రులు వచ్చి మరల వెనుదిరిగి వెళ్ళునప్పుడు పుణ్యస్త్రీ లకు ఈ కుంకుమ తిలకము దిద్దుట తెలిసినదే. ఈ తిలకము గృహమున గల దేవతా మూర్తులకు, పటములకు కూడా నిత్యము పూజా సమయమున పెట్టుట మనమెరిగినదే. ఈ సాంప్రదాయము వేదకాలముననున్ననూ పురాణ కాలమునుండి బహుళ ప్రాచుర్యము పొందినదని ఒక వాదన కలదు. ఆవిషయము ఇచ్చట చర్చించను.

ఈ బొట్టు/తిలకము ఎందుకు పెట్టుకోవాలి, దాని ప్రాధాన్యమేమి? నుదుటనే ఎందుకు పెట్టుకోవాలి? యోగ శాస్త్రమున శరీరమందలి చక్రములను గురించి ఉన్నది.  రెండు కనుబొమ్మల మద్యనున్నది ఆజ్ఞాచక్రము. ఇది విద్య, శక్తి ,అలోచనలకు ఆలవాలము.  ఇవియే మనమనుగడకు మూలాధారము ఆచక్రమును పూజించుటకు బొట్టు అక్కడ పెట్టుకోవాలి.

ప్రాచీన కాలమునుండి దీనిని మతపరమయిన గుర్తుగా  భావించి చాతుర్వర్ణముల వారికీ వేరువేరు రంగులలో తిలకముదిద్దుకొను సాంప్రదాయ ముండెడిది.  బ్రాహ్మణులకు తెల్ల చందనముతోనూ క్షత్రియులకు ఎర్రని రంగు తిలకము గాను, వైశ్యులకు పసుపు రంగు తోనూ,  ఇతరులకు నల్లని భస్మముతోనూ,  వారి వారి స్వచ్చతను, వృత్తులనూ తెలియ జేయునటుల ఉండెడివి. అవి వారి వృత్తులనూ విధులనూ నిర్దేశించునవిగా భావించెడి వారు. బ్రాహ్మణులలో కొందరు కుంకుమతో, నిలువుగనూ కొందరు విభుదితో అడ్డముగనూ తిలకముదిద్దుకొనుట నేటికినీ చూడవచ్చును. అది వారి మత సాంప్రదాయము.

ప్రస్తుత కాలమున ఈ బేధములు అంతగా కనుపించకపోయిననూ అందరు హిందువులు బొట్టు పెట్టుకొను ఆచారము మాత్రము ఉన్నది. మనమందరమూ భగవదాజ్ఞకు బద్దులమనియూ మతమందు అనురాగము నమ్మకము కలవనియూ మనధర్మములను మనము పాటించుచూ దైవానుజ్ఞకు  కట్టుబడి ఉండుమను సంకేతము ఇచ్చుట ఈ బొట్టుయొక్క ప్రాధాన్యము.

మనశరీరము నందు వివిధ నాడులు విస్తారముగా వ్యాపించి సర్వావయములను సక్రమముగా పనిచేయుటకు కావలసిన శక్తి మన శిరస్సు నుండి అజ్ఞా చక్రమునుండి రావలెను.  అందుకు అవన్నియూ కేంద్రీకృతమయిన స్థానము శిరస్సు రెండు కను బొమ్మల మద్యప్రదేశము దానిని  నిత్యమూ దైవముగా భావించి పూజించుటయే ఈ తిలకము/బొట్టు అక్కడ పెట్టుకొను సాంప్రదాయము. ఇది అందరూ పాటించవలసిందే.

కానీ స్త్రీలు మాత్రము ఈ బొట్టును అయిదు ప్రదేశములందు పెట్టుకొనవలెనని శాస్త్రమున చెప్పిరి. అవి శిరస్సున పాపిట మద్యనూ, ఆజ్ఞా చక్రమున, కంఠమున, వక్షస్తలమున నాభియందు కూడా ధరించవలెని యున్నది. దీని పాటించువారు తక్కువే. ఈ బొట్టు అయిదవ తనమునకు సంకేతముగా చెప్పిననూ పుణ్యస్త్రీలు ముఖ్యమయిననూ, వితంతువులు విభూది, భస్మము ధరించు అచారము కలదు. అదియునూ శాస్త్ర సమ్మతమే.


శుభం భూయాత్

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు