ఈ రోజుల్లో చదువు ముఖ్యమే. గ్రాడ్యుయేషన్ చాలా చిన్న విషయమైపోయింది. ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకో ధ్యా స లేకుండా తయారయ్యింది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచనా సరళి. విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలెప్పుడో చెప్పేశారు. విద్య ఆవశ్యకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఇక్కడో చిన్న 'లాజిక్'ని ప్రతి ఒక్కరూ మిస్ అవుతున్నారు. అదేమిటంటే, చదువు అనేది ఇష్టంతో కూడుకున్న వ్యవహారం. కంటి మీద కునుకు లేకుండా, ఇరవై నాలుగ్గంటలూ పుస్తకం పట్టుకుని కూర్చుంటే చదువు బాగా అబ్బేస్తుందని కొందరు అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. పుస్తకం పట్టుకునేది కాస్సేపే అయినా, ఆ కాస్సేపట్లో ఎంత ధ్యాస ఆ పుస్తకమ్మీదా, అందులోని సబ్జెక్ట్ మీదా విద్యార్థి పెడుతున్నాడన్నదే ముఖ్యం. ఈ కనీసపాటి విజ్ఞత ప్రతి ఒక్కరిలోనూ కొరవడుతోంది. ఆఖరికి పాఠాలు చెప్పే వారిలోనూ ఈ ఇంగితం లేకపోవడం శోచనీయం.
అన్ని దానాల్లోకీ విద్యాదానం గొప్పదంటారు పెద్దలు. ఇప్పుడు 'దానం' అన్న మాటకే అర్థం లేదు విద్యా రంగంలో. ఇప్పుడంతా 'అమ్మకం' మాత్రమే కనిపిస్తుంది. విద్యను ఎంత గొప్పగా అమ్మేసుకోవాలన్న కోణంలోనే 'వ్యాపారుల' ఆలోచనలు సాగుతున్నాయి. విద్యాబోధన అనేది ఓ దైవకార్యంగా భావించే రోజులెప్పుడో పోయాయి. విద్యను ఎంత గొప్పగా అమ్ముకోగలం? అనే ఆలోచిస్తున్నారు చాలామంది. అంటే, నూటికి 90 శాతం మంది అన్నమాట. ఓ విద్యార్థికి ఎంత బాగా చదువు చెప్పగలమన్న విషయం పక్కన పెట్టేసి, ఓ విద్యార్థి నుంచి మేగ్జిమమ్ ఎంత సొమ్ములు గుంజేసుకోగలమన్నదే విద్యా వ్యాపారుల లక్ష్యంగా మారిపోయింది. ఎల్‌కేజీ విద్యార్థి విషయంలో అయినా వేల రూపాయలు చిన్న విషయం. లక్ష రూపాయలు పెద్ద మేటరే కాకుండా పోతోంది. ఎల్‌కేజీకే పరిస్థితి ఇలా ఉంటే, గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ 'సెట్', ఈ 'సెట్' పేరుతో విద్యా సంస్థలు విద్యార్థుల్నీ, వారి తల్లిదండ్రుల్నీ పీల్చి పిప్పి చేసేస్తున్నాయి. 365 రోజులూ విద్యార్థులకు చదువు తప్ప ఇంకో ధ్యాస లేదు. ఇరవై నాలుగ్గంటలూ అదే పని. ఇంత బాగా చదివేస్తే, ఆ చదువు ఇంకెంత గొప్పగా ఉండాలి? కానీ మన దేశంలో చదువు, విద్యార్థుల్లో పెంచుతున్న జ్ఞానం శూన్యమని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
|
కూర్చోబెట్టి, బండకేసి రుద్దినట్లుగా ఇరవై నాలుగ్గంటలూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించేయడం అనేది కేవలం మార్కులకే పరిమితం. ఇక్కడ జ్ఞానం, లౌక్యం, లోక జ్ఞానం ఇలాంటివేవీ కన్పించవు. రోబోలకీ విద్యార్థులకీ తేడాల్లేకపోవడం శోచనీయం. మనుషుల్ని మరబొమ్మలుగా మార్చేస్తున్న సోకాల్డ్ కార్పొరేట్ విద్యాసంస్థలు దురదృష్టవశాత్తూ జైళ్ళలా మారిపోతున్నాయి. అక్కడ జీవిత ఖైదు శిక్షలే కాదు, మరణ శిక్షలూ పడుతున్నాయి విద్యార్థి లోకానికి. అందుకే ఈ దుర్భర పరిస్థితుల్లోంచి విద్యావ్యవస్థలో సమూల మార్పుల్ని నేటి యువతరం కోరుకుంటోంది. ఆ మార్పు తీసుకురావాల్సింది ప్రభుత్వాలే. ఈ ప్రయత్నంలో విద్యార్థుల తల్లిదండ్రులదీ కీలక పాత్ర అని చెప్పక తప్పదు.