నేను చిన్నతనం నుండీ శ్రీశ్రీ గారి రచనలు ఎక్కువగా చదివే వాడిని.ఆ రోజుల్లో నేను రోజుకొక Quotation--కన్యాశుల్కం నుండి గాని, శ్రీశ్రీ గారివి గాని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవాడిని. శ్రీశ్రీ గారి ఉపన్యాసాలు దగ్గరలో ఉంటే వినటానికి తప్పకుండా వెళ్ళేవాడిని. నాకు తెలుగు సాహిత్యమన్న, అందులో నూతనత్వం కోసం ప్రయోగాలు చేసే కవులన్న అమిత ఇష్టం.
నేను శ్రీ కాళహస్తిలో పనిచేసేటప్పుడు, మద్రాస్ చాలా సార్లు ప్రత్యేకంగా శ్రీశ్రీ గారిని కలుసు కోవటానికే వెళ్ళేవాడిని. అంత మహాకవి దగ్గరకు వెళ్ళుతున్నాం కదా ఒట్టి చేతులతో పోతే ఏమి బాగుంటుందని--బాగా ఆలోచించి, సిజర్స్ సిగరెట్లు, పార్కర్ కలము తీసుకొని ఒకసారి వెళ్లాను. సిగరెట్లు మాత్రం తీసుకొని, పార్కర్ కలాన్ని తిరిగి ఇచ్చేసారు --పెన్సిల్ తో కూడా గొప్ప కావ్యాలు వ్రాయవచ్చని చెబుతూ! వారి ఉపన్యాసాలు అంత ఆకర్షించే విధంగా ఉండవు, అయితే అర్ధవంతంగా ఉంటాయి.ఒక సందర్భంలో ఆయన 'తెలుగువాడి గొప్పతనం' గురించి ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో, నాకు గుర్తుకొచ్చినవి మీకు చెబుతాను. వారి ఉపన్యాస ధోరణి ఈ క్రింది విధంగా సాగింది. ఆయనతో నా భావాలను, ఆవేదనను కూడా పంచుకున్నాను.
*******************************
తెలుగు వాడు ఎప్పుడూ నిద్రపోతుంటాడు. అందుకే ప్రబోధగీతాలన్నీ--'లే లేవోయి తెలుగోడా!' అనో, 'లేవండీ నిదుర లేవండీ!' అనో ఉంటాయి. (అయితే వారు కూడా 'తెలుగు వీర లేవరా!దీక్షబూని సాగరా!' అనే సినీ గేయం వ్రాసి దానికి ఉత్తమ గీతంగా కేంద్ర ప్రభుత్వం నుండి బహుమతి కూడా పొందారు.ఇదే విషయం వారితో నేను ప్రస్తావిస్తే నవ్వి ఊరుకున్నారు.) తెలుగువాడి గొప్పతనం ఏమిటంటే మరో తెలుగువాడిని చచ్చినా మెచ్చుకోడు. పైగా, అవకాశం కల్పించుకొని విమర్శ చేస్తాడు. కొంతమందైతే, వాడు ఏమి వ్రాస్తాడా, ఎప్పుడు విమర్శించుదామా అని కళ్ళు కాయలు చేసుకొని చూస్తుంటారు. వాడికి చేతకాదు, చేసేవాడిని కాలు పట్టుకొని లాగుతాడు. ఇదేనేమో మన గొప్పతనం! 'A critic is a one ,who has failed in original work' అని ఎక్కడో చదివినట్లు గుర్తు.
సాహితీ ద్రష్టలంతా సాహితీ స్రష్టలు కాలేరు! కానవసరం లేదు కూడానేమో! 'పప్పు బాగాలేదని చెప్పాలంటే' కనీసం పప్పులో ఉప్పు వేస్తారనైనా తెలియాలని నా అభిప్రాయం. సరే అది అలా ఉంచుదాం, ఎవరికి చేతనైన పనులు వారు చేస్తుంటారు, ఒక విధంగా చెప్పాలంటే, విమర్శకులు లేకపోతే నాలాంటి వారికి ఈమాత్రమైన గుర్తింపు వచ్చేది కాదేమో! మన వాళ్లకు తిట్టటంలో ఉన్న ప్రజ్ఞ, మెచ్చుకోవటంలో కనపడదు.మెచ్చుకుంటే, మన ప్రతిభ తగ్గుతుందని--వారి నమ్మకం. వేలెడు అంతటి వాడు జానెడు అంత వాడిని చూసి మూరెడు అంతడి వాళ్ళు చాలామంది ఉన్నారు లేవోయ్! అంటాడు. తెలుగు వాడన్న ప్రతి వాడిలోని గుణమే ఇది! అయితే దురదృష్టమేమంటే, ఏ విమర్శ చేయటానికి అవకాశం లేకపోయినా, కోడి గుడ్డు మీద వెంట్రుకలను లెక్కపెట్టే మనస్తత్వం మన ఒక్కరి సొత్తు. కధ చదివితే, ఏముంది అందులో-- కాశీ మజిలీ కథలలో అంత కన్నా గొప్ప కథలు లేవా? అంటాడు.
పోనీ, మంచి సంగీత కచేరికి వెళ్ళుతాడా--ఏముంది అందులో గొప్పతనం, లాగి, పీకి పాడిందే పదిసార్లు పది రకాలుగా పాడాడు ఆ గాయకుడు, అంటాడు. 'వీళ్ళను గురించే నేను 'కళలన్నా , రసమన్నావీళ్ళకు చుక్కెదురు, గోలచేసి అరవటమే వీళ్ళు ఎరుగుదురు' అని వ్రాసాను. వాళ్లు అలా విమర్శ చేస్తేనే, మనం అభివృద్ధిలోకి వస్తామనిపిస్తుంది. వాళ్ళ విమర్శలలో, నిజమైన సారముంటే, నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని, తెలుగు వాళ్ళు చాలామంది మరచిపోయేవారు. అన్నీ మన మంచికే!. అన్న భావంతో ముందుకు సాగుదాం. గురజాడ వారి కన్యాశుల్కంలో మహారాజశ్రీ గిరీశం గారు ఎప్పుడూ మన వాళ్ళను తిట్టిపోస్తుంటాడు-- మనవాళ్ళు ఒట్టి వెధవాయలోయ్!-- ఇదే బెంగాలీ వాడైతే తాతైనా తండ్రైన లెక్క చేయక చెమ్డాలు తీస్తాడు- ఇలా వ్యంగ్య పూర్వక వ్యాఖ్యానాలు చాలా చేస్తాడు. ఒక కథ గాని, కావ్యం గాని వ్రాయాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి, మంచి కథా వస్తువు, కథనం, ఇలా! మరి విమర్శకులకు అలాంటి ప్రమాణాలు ఏమీ ఉండవు.
మీరు చూసే ఉంటారు, సినిమాల రివ్యూలను! ఇంత గొప్ప సినిమా మునుపెన్నడూ తెలుగు సినిమా చరిత్రలో రాలేదని వ్రాస్తారు. ఆ రివ్యూలను చూసి సినిమాలకు వెళితే , మన కాలం వృధా, డబ్బులు వృధా, పైగా అత్యంత ప్రమాదకరమైన 'Thought pollution' వ్యాప్తి చెందుతుంది. అయితే తెలుగువాడిలో ఒక దుర్మార్గం మాత్రం లేదు. ఏదో ఒక కసి మనసులో పెట్టుకొని ఎవరినీ తిట్టడు. కేవలం ఈ పనిని నిష్కామకర్మగానే నిర్వహిస్తాడు. దుమ్మెత్తి పోయటం తెలుగువాడికి Second nature. ఫలానా కవి, మంచి పద్యాలు వ్రాస్తాడు అని నువ్వంటే, వెంటనే మన తెలుగువాడు, వాడూ ఒక కవేనా అంటాడు. జాగ్రత్తగా గమనించాలి.
ఈ మన తెలుగువాడు ఏదో ఒక ఆఫీసులో పనిచేసుకుంటూ ఉంటాడు. కవిత్వం జోలికి పాపాన కూడా పోయి ఉండడు. కాని తన 'అమూల్యమైన' అభిప్రాయాన్ని వెల్లడించకుండా ఉండడు. నాకు తీరుబాటు లేదు కాని, వాడి బాబులాంటి కవిత్వం వ్రాయగలనని మనసులో అనుకుంటాడు. బయటకి చెప్పడు. తెలుగువాడు తానే అన్ని ఉద్యమాలు ప్రారంభించానని చాటుకుంటాడు. ప్రారంభం తనదైతే చాలు! అది తక్షణమే ఆగిపోయినా పరవాలేదు. మొదటి చలన చిత్రం మనదే, మొట్టమొదటి ప్రతేక రాష్ట్ర ఆందోళన మనదే, ప్రజల భాషకోసం మొదట ఘోష పెట్టింది మనమే, మొదట సూటు తొడిగింది మనమే ---ఇలా అన్నిట్లో మనమే ప్రధములమని ఏకరువు పెడతాడు. మున్ముందు, ఆటంబాబును కూడా మేమే కనిపెట్టామని చెప్పినా ఆశ్చర్య పడనవసరం లేదు. ఈవిషయంలో గిరీశంగారే మనకు ఆదర్శమేమో! వారి మాటల్లోనే 'Shakespeare ఎవరు? శేషప్పఅయ్యర్ అనే మన తమిళుడు. పైథాగరస్ ఎవరు? కాకినాడలోని మన 'పైథా' వారి అబ్బాయి'. ఇలా అనవసరంగా గొప్పలు చెప్పుకోవటమే, మనకు అలవాటైంది. వారికి నా అభిప్రాయాలను కూడా కొన్ని వెల్లడించాను. వాటిలో కొన్ని-- కొంతమంది ఉంటారు-చక్కని రచనలు చేసిన వారిని అభినందించటానికి వారికి 'అహం' అడ్డు వస్తుంది, మరి కొందరిలో హోదా అడ్డం వస్తుంది--మనకన్నా ఒక చిన్నఉద్యోగం చేసినవాడికి ఇవన్నీతెలుసని అభినందిస్తే, తమకు అవన్నీ తెలియవనే భావన ఉంటుందేమో! వీరికున్న inferior కాంప్లెక్స్ అది. ఇంకొంతమంది ఉంటారు, వాడిని అభినందిస్తే 'మనకేమి లాభం?' అని ఆలోచిస్తారు.
మరికొంతమంది, 'స్పందించటానికి మాకు కాలం సరిపోవటం లేదు, కానీ మీ రచనలు మాకూ పంపించండి, వీలుచేసుకొని చదువుతాం!' అని చెబుతారు. ఒక ప్రముఖుడి దగ్గరనుండి నేను కనీసం ఒక్క స్పందన కూడా రాబట్టలేకపోయాను. వాళ్ళ అభిరుచికి, స్థాయికి తగ్గ రచనలు చేయలేకపోయానాని, నన్ను నేనే సముదాయించుకున్నాను. రచయిత గానీ, మరే ఇతర కళాకారుడు గానీ కోరుకునేది ప్రజలనుండి వచ్చే సుస్పందన. నిజానికి రచయిత కన్నా ఒక తాపీమేస్త్రీ ఎక్కువుగా సంపాదిస్తున్నాడు. కానీ రచయిత సంపాదనకోసం వ్రాయడు, కేవలం తన తృప్తి కోసం మాత్రమే వ్రాస్తాడు.
నిజానికి నేను చెప్పిన వారికి చాలా విషయాలు తెలియకపోటంతో పాటు, కనీస సంస్కారం కూడా ఉండదేమోననిపిస్తుంది. అటువంటి కాలాతీత వ్యక్తులకు నా రచనలను పంపటం పూర్తిగా మానేసాను. నా బాధ, ఆవేదన మీకు విన్నవించుకున్న తరువాత నాకు కొంత మనోవేదన తగ్గింది. చివరిగా శ్రీశ్రీ గారు చెప్పినట్లు 'స్పర్ధకు బదులు సహకారం, అహంకారానికి బదులు ఆత్మనిగ్రహం, వైముఖ్యానికి బదులు సౌముఖ్యం---ఇవీ మనకు కావలసినవి. కనీసం ఈ తరంలోనైనా ఇవి సమృద్ధిగా వికసిస్తే ఆంధ్రదేశంలో ప్రజాజీవితం ఫలిస్తుంది!' ఆ మహాకవి చెప్పిన విషయాలను ఆచరించటమే ఆయనకు మనమిచ్చుకునే ఘనమైన నివాళి!
మహాకవి శ్రీశ్రీకి స్మృత్యంజలితో...