మనమంతా వృత్తి రీత్యా లేక ఉన్నత చదువుల రీత్యా వేరే ప్రాంతానికి (వేరే రాష్ట్రం కానీ, దేశం కాని...) వెళ్తున్నాం. కానీ మన ప్రాంతానికి తిరిగొచ్చినప్పుడు లేదా 2 రోజులు గడపడానికొచ్చినప్పుడు 'గుర్తుకొస్తున్నాయి...' అనే పాట గుర్తొస్తుంది. నేను చెప్పేది కేవలం పుట్టిన ఊరు గురించి మాత్రమే కాదు - నేను నాగపూర్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇప్పటికీ ఆరోజులు గుర్తుకొస్తూనే ఉంటాయి. 'నాగపూర్ ఎలావుందో... మాకాలేజెలా వుందో...' అని!
నాగపూర్ లో అంతా హిందీ మాట్లాడతారు. ఒకరోజు నాకు ప్రింటు కావల్సివచ్చి 'సైబర్ కేఫ్' కెళ్ళాను. పేపర్ ప్రింటర్ లో చిక్కుకుపోయింది. ఆ అబ్బాయి పేపర్ లాగితే చిరిగిపోయింది. 'దీని ఎంకమ్మా...' అని నెమ్మదిగా అన్నాడు. 'తెలుగాండీ...' అనడిగాను. అతను ఆనందంగా 'అవునండీ' అన్నాడు. అలా 'ఎంకమ్మ' అనే పదం మమ్మల్ని కలిపింది.
వృత్తి రీత్యా 'సాన్ ఫ్రాన్సిస్కో' (అమెరికా) వెళ్ళాను. నాకు లాస్ వెగాస్ చూడాలని కోరిక. దానికి మా కంపెనీ ఖర్చు భరించదు. సొంత డబ్బులతోనే వెళ్ళాను. అంతా 'కేసినో'ల మయం. నేను కొన్ని 'చిప్స్' తీసుకుని సరదాగా 'రోలెట్' ఆడుతున్నాను. ఇంతలో ప్రక్క టేబుల్ మీద ఆడే ఇద్దరు 'దొబ్బేసాడ్రా' అనటం వినపడింది. ఠక్కున నా మెడ అటు తిరిగింది.
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనకి తెలియకుండానే మనలో బాషాభిమానం వుంటుంది.
మిత్రులు, ప్రముఖ గేయ రచయిత ఐన 'భాస్కరభట్ల' గారు మన 'గోతెలుగు.కామ్' ప్రారంభోత్సవ సభలో ఇలా అన్నారు. "కన్నతల్లి, సొంత ఊరు, మాతృభాష మీద మమకారం ఎప్పటికీ వుంటుంది... ఒక హిందీ పాటలో 'రామయ్యా... వస్తావయ్యా' లాంటి తెలుగుపదం వినబడితే వచ్చే ఆనందమే వేరు" అన్నారు. నాకాయన చెప్పిన మాటలు బాగా నచ్చాయి.
కొన్ని సంఘటనలు మనకి ఎప్పటికీ గుర్తుంటాయి - గుర్తుకొస్తుంటాయి!!