ఉత్తరాఖండ్ తీర్ధయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు / విహార యాత్ర

పాతాళ భువనేశ్వర్ 

దేశ రాజధాని ఢిల్లీకి సుమారు 370 కిలో మీటర్ల దూరంలో వున్న ఆల్మోడా జిల్లా కేంద్రానికి సుమారు 130 కిలో మీటర్ల దూరంలో వుంది పాతాళ భువనేశ్వర్ . సుమారు 1350 మీటర్ల యెత్తులో వుందీ గుహాలయం . గుహాలయం అనే బదులు గుహలసముదాయం అంటే సరిపోతుంది . 

ఆల్మోడా నుంచి సుమారు ముప్పై కిలోమీటర్లు జాగేశ్వర్ రోడ్డుమీద ప్రయాణించేక ' బెరినాగ్ ' వైపు వెళ్లే రోడ్డు లోకి తిరగాలి . అదే రోడ్డుమీద ప్రయాణించి ' బెరినాగ్ ' దాటేక ' గంగోలి హాట్ ' రోడ్డు వైపుగా సాగుతుంది ప్రయాణం . చిన్నగ్రామాల గుండా సాగే దారి కావడం వల్ల చాలా సన్నగా వుంటుంది రోడ్డు కొన్ని చోట్ల రోడ్డు కనిపించదు . కంకర మీంచి ప్రయాణం సాగించాలి . 130 కిలో మీటర్ల దూరం సుమారు 5, 6 గంటలు పడుతుంది . గంగోలి హాట్ రోడ్డు మీద కారు నిలుపుకొని కాలినడకన ఓ కిలో మీటరు ప్రయాణించేక గుహ ప్రదేశం చేరుకుంటాం . సిమెంటుచేసిన కాలిబాట కావడం వల్ల నడక సునాయాసంగా సాగుతుంది . చిన్న గ్రామం పక్కగా సాగే అడవి దారి . కాలుష్యం లేని అడవిలో చల్లని వాతావరణం లో నడక హాయిగా వుంటుంది . 

చిన్న మందిరం , ఓ పక్కగా శివలింగం యింతదూరం వచ్చింది యివి చూడ్డానికా ? అనే నిరాశ కలిగింది . బయట వున్న పూజారి పక్కగా వేసివున్న బల్లపై కూర్చోమన్నారు . కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకొని బయలుదేరుదాం అని కూర్చున్నాం . కొంత సేపయేసరికి  అక్కడ వున్న చిన్న ద్వారం లోంచి పర్యాటకులు బయటకు రాసాగారు . ఓ ముప్పైమందిదాకా వచ్చేరు . పూజారి దారిచూపుతూ వుండగా కూర్చొని వ్రేలాడదీసిన యునుప గొలుసులను పట్టుకొని జారుతూ లోపలకు వెళ్లేం . ప్రవేశ ద్వారం అంత చిన్నగా వున్నా లోపల మాత్రం సుమారు యాభై మందివరకు కూర్చొనేంత విశాలంగా వుంటుంది .

ఈ గుహలు సున్నపురాయి పైన వందల సంవత్సరాలుగా నీరు పడడం వల్ల యేర్పడిన వివిధ ఆకృతులు . ఇవన్నీ మన పురాణాలలో చెప్పబడ్డ ఆకృతులను పోలి వుండడం విశేషం . హిందూ పురాణాలలో చెప్పబడ్డ 33 కోట్ల దేవీదేవతలు అక్కడవున్నాయి . ముఖ్యంగా ఆది శేషుడు , కామధేనువు , ఐరావతం , కుమారస్వామి , పార్వతీ పరమేశ్వరులు , వినాయకుడు ,  శివుని జటీఝూటం చూడదగ్గవి . ఇప్పటికీ నిరంతరంగా శివుని అభిషేకిస్తున్న నీటి జల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . అలాగే శిరస్సులేని వినాయకుని విగ్రహం పైన యివాళటికి కూడా పడుతున్న నీరు , వాటికి వెనుకనున్న కధ వింటుంటే శరీరం గగుర్పొడుస్తుంది . 

పార్వతి స్నానం చేస్తూ వినాయకుని తయారుచేసి యింటికి కాపలా వుంచి స్నానానికి వెళ్లగా శివుడు  లోనికి పోబోగా వినాయకుడు వారిస్తాడు , ఆగ్రహించిన శివుడు వినాయకుడి శిరస్సు ని ఖండిస్తాడు . జరిగింది తెలుసుకున్న పార్వతి వినాయకుని బ్రతికించవలసినదిగా వేడగా శివుడు వినాయకుడి శరీరాన్ని గజాసురుని శిరస్సును తెచ్చి వినాయకుడి శరీరమునకు అతికించేవరకు యీ గుహలో వుంచినట్లుగా చెప్తారు . 

ఈ గుహాలయంలో రాగి తాపడం చేసిన శివలింగం , దానిపైన నిరంతరంగా పడుతున్న జలధార వుంటుంది అదే భువనేశ్వర్ లింగం .

ఈ గుహాలయం లో నాలుగు ద్వారాలు వున్నాయి , అందులో రెండు కూలిపోయి మూసుకుపోగా మిగిలిన రెండూ తెరిచివున్నాయి .  ఈ ద్వారాల గుండా వెళితే ఉత్తరాఖండ్ లోని ' చార్ ధాం ' లకు , కైలాసపర్వతానికి రహస్య మార్గాలు వున్నాయని అంటారు .

శ్వాస సంభందిత  , హృదయ సంభందిత  రుగ్మతలు వున్నవారకి యీ గుహలలో శ్వాస తీసుకోడం కష్టమౌతుంది .

గుహ ద్వారం లోకి పాములా జారుతూ వెళ్లినపుడు యింత కష్టపడి లోపలికి వెళ్లేంత లోపల యేమైనా వుంటుందా ? అనే అనుమానం లోపలకి వెళ్లిన తరువాత తీరిపోయింది . ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ఆగుహ ఓ అద్భుతం . పాతాళ భువనేశ్వర్ చూడలేదు అంటే ఓ అద్భుతాన్ని మిస్సయినట్లే .

ఈ గుహల గురించి స్థలపురాణం తెలుసుకుందాం .

స్కంద పురాణం లోని మానసఖండం లో సుమారు 800 శ్లోకాలలో యీ గుహలను గురించిన వర్ణిన వుంది . దాని ఆధారంగా త్రేతాయుగంలో నలదమయంతుల కాలంలో మొదటిసారి యీ గుహలను కనుగొన్నట్లు గా వుంది . స్కందపురాణం ప్రకారం ఓ సారి నలుడు దమయంతి యేదో విషయంపై వాదులాడుకుంటారు వాదనలో ఓడిపోయినవారు రెండవవారు యిచ్చిన శిక్ష అనుభవించాలని ఒప్పందం చేసుకుంటారు . ఆ వాదనలో నలమహారాజు వోడిపోతాడు , గడువు తీరేవరకు దమయంతికి తెయకుండా తనని రహస్య ప్రదేశంలో దాచమని రుతుపర్ణ మహారాజుని కోరుతాడు . రుతుపర్ణ మహారాజు నలుని హిమాలయాలలో దాచి తిరిగి రాజ్యానికి వస్తూవుండగా  ఓ. చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటూ వుండగా చిన్న మగత లో ఓ అందమైన జింక తనను అనుసరించి రమ్మని కోరినట్లు అనిపించగా కనులు తెరిచి చూడగా యెదురుగా జింక కనిపిస్తుంది , రుతుపర్ణ మహారాజు కనులు తెరవడం చూచిన జింక అడవిలోకి పరుగు తీస్తుంది . రుతుపర్ణ మహారాజు జింకను అనుసరించగా జింక యీ గుహల వద్ద అదృశ్యమౌతుంది . గుహద్వారాన్ని కాపలా కాస్తున్న వేయిపడగల ఆది శేషుడు తన పడగలపై రుతుపర్ణుని కూర్చుండపెట్టుకొని గుహలోపలికి తీసుకు వెళుతుంది , గుహ లోపల గల ముప్పైమూడుకోట్ల దేవీదేవతలను రుతుపర్ణ మహారాజు చూసినట్లుగా , తిరిగి కలియుగంలో ఓ మహాభావుని వలన మానవులు వీటిని దర్శించుకోగలరని లిఖించబడింది . 

కలియుగం లో జన్మించిన అధ్వైతగురువైన ఆది శంకరులు స్కంధపురాణం లో వర్ణించిన ప్రకారం రామ్ గంగ , సరయు , గుప్తగంగ ల పవత్ర సంగమ ప్రదేశాన్ని కనుగొని పెద్దపెద్ద వృక్షాలచే మరుగున పడ్డ యీ గుహలను కనుగొని లోపలకి వెళ్లి చూడగా భువనేశ్వర్ లింగం అగ్నిలింగగంగా వుండడం చూసి లింగాన్ని రాగి రేకుతో తాపడం చేసి ఆ అగ్నిని చల్లార్చేరు . కలియుగాంతం లో యీ రాగిరేకు  ఆ అగ్నిజ్వాలలకు కరిగి తిరిగి లింగం అగ్నిలింగంగా మారుతుందని అంటారు .

ఈ గుహ లో వున్న నాలుగు ద్వారాలను పాపద్వారం , రణద్వారం , ధర్మ ద్వారం , మోక్షద్వారం అని అంటారు . పాపద్వారం రామరావణ యుధ్దానంతరం రావణుడి మరణం తో మూసుకొని పోయిందట , రణద్వారం మహాభారతయుధ్దం ముగియడంతో మూసుకుపోయిందట . ధర్మద్వారం కల్కి అవకతరించగానే మూసుకుపోతుందట , మోక్షద్వారం యుగాంతంలో మూసుకు పోతుందట . ఈ మందిర పూజారులు శంకరాచార్యుల శిష్యులు ' భండారి ' సంతతికి చెందిన వారు యిప్పటికీ పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . 

ఈ గుహలలో గోడలకు చెవులు ఆనించి వింటే లోపల నీరు ప్రవహిస్తున్న శబ్దాలు వినిపిస్తాయి . 

పాతాళభువనేశ్వర్ ప్రాంతంలో రాత్రి వుండడానికి వీలైన వసతులు లేవు . రోడ్డుపైకి వున్న హోటలులో టీ ఫరవాలేదు , భోజనం అంతంత మాత్రం .

ఇలాంటి అద్భుతమైన ప్రదేశం చాలాకాలం మరుగునే వుండిపోయింది , యిప్పటికీ కూడా పొందవలసినంత ప్రాచుర్యం పొందలేదనే అనిపిస్తుంది . టాక్సీ లో తప్ప  బస్సులలో అయితే చాలా సమయం వృధా అవడం ఖాయం . 

రాష్ట్ర ప్రభుత్వం వారు సరైన శ్రద్ధ తీసుకొని సదుపాయాలు కలుగజేస్తే యీ పాతాళభువనేశ్వర్ గుహలు మంచి పర్యాటక స్థలంగా దేశవిదేశాలలో పేరుపొందడం ఖాయం .

మళ్లావారం మరికొన్ని వివరాలతో మీ ముందుంటానని మనవిచేస్తూ శలవు .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి