తెలుగు కార్టూనోత్సవం2017 - బెంగుళూరు లో
దయులు
హృదయులు
సహృదయులు
రసహృదయులు
సరసహృదయులు
నవరసహృదయులు .... అయిన కార్టూనిస్ట్ ల చేరిక ..
ఉద్యానవన నగరి బెంగుళూరు లో నవ్వుల పువ్వులు పూయించింది.
ప్రాంతీయ పత్రికలలో పంచ్ లు పేల్చే యంగ్ గన్నులు ...
జాతీయ కార్టూన్ పోటీల్లో ప్రైజులు కొట్టే ఐడియా ల గనులు ...
అంతర్జాతీయ ఘనత సాధించిన.... లెజెండరీ ఘనులు .....
అందరూ ఒక చోట చేరిక కు వేదిక.... ఇండియన్ కార్టూన్ గేలరీ బెంగుళూరు అయ్యింది
ప్రదర్శన లో తెలుగు జండా రెపరెపలడించడానికి ప్రత్యక్షం గా కదిలి వచ్చిన కార్టూనిస్టులు అచ్చతెలుగు అక్షరాల్లా 56 మంది. (A to z అనికూడా అనచ్ఛన్దోయ్ . ఎందుకంటే Alibaba నుండి Zakir దాకా అని శ్రీ జయదేవ్ గారు చమత్కరించారు కాబట్టి ).
28.10.2017 న ఉదయం 10. 30 ని.లకు శ్రీమతి సత్య భామ బద్రీనాధ్ (డైరెక్టర్ నేషనల్ గేలరీ అఫ్ మోడరన్ ఆర్ట్ -బెంగుళూరు ) గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కార్టూనిస్ట్స్ వారి ఇండియన్ కార్టూన్ గేలరీ హాల్ లో - తెలుగు కార్టూనోత్సవం 2017 ను ప్రారంభించారు. శ్రీ జయదేవ్ బాబు గారు గౌరవ అతిధి గా పాల్గొని స్వాగతోపన్యాసం తో తెలుగు కార్టూనిస్ట్ ల దీక్ష స్ఫూర్తి ని ప్రశంసించారు . శ్రీ నరేంద్ర ( మేనేజింగ్ ట్రస్టీ , ఐ సి సి ) గారు ప్రసంగిస్తూ .. తెలుగు కార్టూనోత్సవం 2017 అనేది 144 వ ఎగ్జిబిషన్ అయినప్పటికీ .. అధికసంఖ్య లో కార్టూనిస్ట్ లు పాల్గొన్న కార్టూన్ ఎగ్జిబిషన్ మాత్రం ఇదే మొదటి ననీ కితాబిచ్చారు.
సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం ఉన్న కార్టూనిస్ట్ లంతా ప్రత్యక్షం గా ఒకరినొకరు పలకరించుకుంటూ ... .. ప్రదర్శన లో ఉంచిన తమ తమ కార్టూన్ లతో సెల్ఫీ లు దిగు తూ .. ఇతర మిత్రులతో గ్రూప్ ఫోటోలు తీస్తూ... తీయించుకుంటూ .. ప్రదర్శన లోని కార్టూన్ లను ఆస్వాదిస్తూ .. సందర్శకుల అభిరుచిని పరిశీలిస్తూ .. స్థానిక కన్నడ కార్టూనిస్ట్ మిత్రులయిన శ్రీ శ్రీధర్ కొమరవెల్లి , శ్రీ గుజారప్ప వంటి వారి వద్ద టిప్స్ తెలుసుకుంటూ మధ్యాహ్నం వరకు తెలుగు కార్టూనోత్సవం లో పాల్గొన్నారు . కార్టూనోత్సవం లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ ముఖ్య అతిధి చేతుల మీదుగా పార్టి సిపేషను సర్టిఫికెట్ అందుకున్నారు.
రమణ శ్రీ బ్రాంట్ న్ హోటల్ లో చక్కని విందు తరువాత అక్కడి కాన్ ఫరెన్స్ హాల్ లో మొదటగా దివంగత కార్టూనిస్ట్ లయిన కీ . శే . మోహన్ , కీ. శే . రవి నాగ్ గార్లకు మౌనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రొఫెసర్ జయదేవ్ మాస్టారు ఔత్సాహిక కార్టూనిస్ట్ లకి ... కార్టూన్ ఐడియాలు ఎలా పెంపొందించు కోవాలో ... బొమ్మలతో కూడిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా పాఠాలు నేర్పారు.
జనాబ్ సుభానీ (డెక్కన్ క్రానికల్) గారు చార్ట్ లపై అప్పటికప్పుడు పొలిటికల్ నేతల చక్కని క్యారికేచర్ లను గీసి చూపించి అందరినీ ఆహ్లాద పరిచారు.
తరువాత శ్రీ కళాధర్ బాపు (అమెరికా ) గారు తనకు కీ . శే . శ్రీ బాపు గారితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ .. కార్టూనిస్ట్ అనే వాడు గొప్ప క్రియేటర్ అని .. అతడు కార్టూన్ సృష్టి తోనే ఆగి పోకుండా ... సామాన్యుడికి సైతం నిత్య జీవితం లో ఉపయోగ పడే ఐడియాలు సృజించాలని సందేశమిస్తూ .. ''బియాండ్ కార్టూన్స్ '' అనే అంశాన్ని స్పృశిస్తూ చక్కని పవర్ పాయింట్ తో ... ఇట్ ఈజ్ నాట్ ఇంక్ ... ఇట్ ఈజ్ థింక్ .. అనే భావాన్ని అందరి మనస్సు లలో నాటటం లో కృత కృత్యు లయ్యారు. .
శ్రీ సరసి గారు నేటి కార్టూన్ లలో తెలుగు తనం ఉట్టిపడేలా గీయాల్సిన ఆవశ్యకతను తరువాతి తరానికి అందజేయాల్సిన బృహద్ బాధ్యతను తెలుగు కార్టూనిస్ట్ లకు ప్రబోధిస్తూ హాస్య స్ఫోరకం గా సోదాహరణం గా చక్కగా ఉపన్యసిం చారు.
శ్రీ మృత్యుంజయ్ ( నమస్తే తెలంగాణ) గారు వాకేం టాబ్లెట్ పై క్యారికేచర్స్ వారు ఎలా గీస్తారో ప్రత్యక్షం గా గీసి చూపించి అందరి మన్నన లను అందు కొన్నారు . ''ఈ తెలుగు కార్టూనోత్సవం కు యాదృచ్చికం గా 56 మంది హాజరవడం తెలుగు వర్ణ మాలను గుర్తుకు తెస్తోందని మృత్యుంజయ్ గారు చమత్కరించారు."
శ్రీ నర్సిం ( నవ తెలంగాణా ) గారు ఫోటోషాప్ మెళకువలు ఇతర కార్టూనిస్ట్ లకు సరళం గా విశదీకరించి ఆనందింప చేశారు .
శ్రీ బాచి గారు ... కార్టూన్ లు వేయడం కార్టూనిస్ట్ ల సామాజిక బాధ్యత అని గుర్తు చేస్తూ .. నేటి కార్టూన్ ల , కార్టూనిస్ట్ ల పోకడలు సమాజ హితం గా ఉండాలని పిలుపునిచ్చారు.
శ్రీ పార్నంది శర్మ గారు వోట్ అఫ్ థాంక్స్ తెలియజేసారు.
ఆజన్మాంతం గుర్తుండి పోయేలా తెలుగు కారూనోత్సవం
2017 ను నిర్వహించిన నిర్వాహకులకు .. వదాన్యత కనపరచిన అజ్ఞాత దాతలకు .. ఏ లోటూ జరగకుండా చూసుకున్న వాలంటీర్ కార్టూన్ మిత్రులకు ధన్య వాదాలు అర్పిస్తూ .. ఎద లో మూటకట్టుకున్న మధుర జ్ఞాపకాలను తమ కుటుంబ బంధు మిత్రులతో పంచుకోవడానికి బయలుదేరారు నవ్వులు పంచే కార్టూనిస్ట్ లు . మరో సారి అతి త్వరలో కలవాలని అందరి మది లోని ఆకాంక్ష .
ఇటువంటి ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేసి హాస్య ధురిమను మరింత పంచాలని హార్ట్టూనిస్ట్ లయిన కార్టూనిస్ట్ లను కోరుకుందాం . అల్ ది బెస్ట్