ఇవేళ చెప్పేవాటిలో ముఖ్యమైన వస్తువు గొడుగు. ఇంట్లో పనిచేసే వంటావిడో, పనిపిల్లో ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు తీసికెళ్ళుంటారు. వాళ్ళు తిరిగి కూడా ఇచ్చే ఉంటారు. ఏది ఏమైనా వర్షా కాలం వచ్చేసరికి, దీనిల్లుబంగారం కానూ, ఛస్తే కనిపించదు.
ఇది వరకటి రోజుల్లో అయితే ఎండా కాలం లో కూడా గొడుగు వేసికుని వెళ్ళేవారు కాబట్టి, ఆ గోడుగు మూవ్ మెంట్స్ మీద ఓ దృష్టి ఉంచేవారం. ఇప్పుడేమిటి, ఎవేవో రైన్ కోట్లూ అవికూడా ఓ ప్యాంటూ షర్టూ లాగ, లేకపోతే ఏదో జాకేట్టు లాగ. దానితో పాపం మన బుచ్చి గొడుగుకి పాపులారిటీ తగ్గిపోయింది. అయినా సరే చరిత్ర లో దాని స్థానం ఎప్పుడూ ఉంటుంది.ఇప్పటికీ మా ఫాక్టరీలో రిటైరు అయిన రోజు ఓ గొడుగు ( ఇప్పుడు ఫోల్డింగు టైపు అనుకోండి) ఇస్తూనే ఉన్నారు.కారు ఆపి కొట్టులోకి వళ్ళాలంటే గొడుగు ఉండాలికదా. దాంతో ఏమౌతూందంటే ఇంట్లో ఉన్న గొడుగులన్నీ, ఆ కారులోనే ఉండొచ్చు, అథవా ఒకటీ రెండూ ఇంట్లో ఉన్నా అవి ఎవరో తీసికెళ్ళుంటారు.ఏది ఏమైనా వర్షం వచ్చినప్పుడు నెత్తిమీద గుడ్డేసుకుని వెళ్ళాల్సిందే !!
ఇంకో వస్తువు టార్చ్ లైటు, ఇప్పుడంటే సెల్ ఫోన్లలో లైటూ అవీ ఉంటున్నాయికానీ, మొన్న మొన్నటిదాకా టార్చ్ లైటు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.ఎవడికో ఇచ్చేఉంటాము,ఆ పెద్దమనిషి, తన పని ఐపోయిన తరువాత తిరిగి ఇద్దామనేది జ్ఞాపకం ఉంచుకోడు.ఇంకోటి గమనించే ఉంటారు, ఆ టార్చ్ లో బ్యాటరీలు మార్చడం ప్రతీ వాళ్ళూ మర్చిపోతూంటారు. దీంతో ఏమౌతుందీ అంటే ఆ బ్యాటరీలు నీరు కారిపోయి, టార్చ్ ఎందుకూ పనికిరాకుండా పోతూంటుంది.
ఇంకోటి నైల్ కట్టర్, హాయిగా ఇదివరకటి రోజుల్లో అయితే గోళ్ళు కొరుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఎవేవో మానిక్యూర్లూ అవీ వచ్చాయి, అయినా వారానికోసారి ఈ నైల్ కట్టర్ కావాల్సివస్తూంటుంది. ఎక్కడో గుమ్ముగా కూర్చునుంటుంది, కనిపించదు. ఇటువంటి క్యాటిగరీలోకే వచ్చేది హాట్ వాటర్ బ్యాగ్గు. ప్రతీరోజూ ఉపయోగించం కాబట్టి దాన్ని ఎక్కడో జాగ్రత్త చేసి పెడతాము. ఏ నడుము నొప్పి వచ్చినప్పుడో, కాలు బెణికినప్పుడో మూవ్ రాసి స్టైలు గా ' ఫొమెన్ టేషన్' పెట్టండీ అంటాడు డాక్టరు. అప్పుడు వెదకడం మొదలెడతాము. ఇదివరకటి రోజులే హాయి, ఓ గిన్నె నిండా నీళ్ళు కాచుకుని, దాంట్లో ఓ గుడ్డ ముంచుకుని, ఆ నీళ్ళు పిండేసి హాయిగా కాపడం పెట్టేవాళ్ళం! ఇప్పుడు అవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళే!
ఇంకో వస్తువు
థర్మా మీటరు. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా ఏదైనా రోగం వస్తే, ప్రతీ గంటకీ టెంపరేచరు నోట్ చేసికోమంటున్నారు. నా నమ్మకం ఏమిటంటే, అసలు ఈ థర్మా మీటర్లుండడం వల్లే ఈ రోగాలు కూడా ఎక్కువయ్యాయి.బి.పీ, సుగర్, ప్రెగ్నెన్సీ, మొన్న ఎప్పుడో చదివాను క్యాన్సరు టెస్టింగు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చుట. ఇదిగో ఇలాటివన్నీ కొంపలో పెట్టుకోవడం, ప్రతీ రోజూ చూసుకోవడం, దాన్ని గురించి నెట్ లో చదవడం, ఏవేవో ఊహించుకోవడం, ఇంట్లోవాళ్ళ ప్రాణాలు తీయడం, డాక్టర్ల బిజినెస్ పెంచడం తప్ప ఇంకోటి కాదు. ఏమన్నా అంటే prevention is better than cure అని జ్ఞానబోధ చెయ్యడం !!
ఇంకోటుందుందండోయ్ ఫ్యూజ్ వైరు. ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా ఇంట్లో కరెంటు పోతే ఇంట్లో వాళ్ళే ఫ్యూజు వేసికునే వాళ్ళు. వీడు ఏదో హై వాటెజ్ ఉండే హీటరో, గీజరో వాడడం మొదలెడతాడు. ఠప్పున షార్టైపోతుంది. అర్ధరాత్రీ,అపరాత్రీ ఎలెక్ట్రీ వాడెక్కడ దొరుకుతాడు, అందుకనొ ఓ ఫ్యూజు వైరు ఇంట్లో ఉంచుకునే వాళ్ళు.లైట్లు పోయినప్పుడు,టార్చి లైటూ, ఫ్యూజు వైరూ లేకుండా కరెంటు ఎలాగొస్తుందీ? ఇప్పుడంటే ఇన్వర్టర్లూ సింగినాదం వచ్చేయి కానీ, మన ఊళ్ళల్లో ఇప్పటికీ ఈ ఫ్యూజు వైర్ల అవసరం ఉంటూనే ఉంటుంది.
పైన చెప్పినవన్నీ పాత రోజుల్లో. ఈ తరంలో అన్నిటికంటే ముఖ్యం సెల్ ఫోనులు.. ఒక్కోడి దగ్గరా రెండు మూడు ఫోన్లు.. ఆఫీసుకోటీ, ఇంట్లోకోటీ, Apps అన్నీ పెట్టుకోడానికోటీ. పైగా వాటన్నిటినీ సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడం.. ఏ సోఫా కుషన్ కిందో ఉండిపోయిందా, అంతే సంగతులు.. ఛస్తే కనిపించదు.. చివరకి సోఫాలమీద ఏ దుమ్ము దులుపుతున్నప్పుడో దర్శనం ఇస్తుంది..
ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంట్లో ఉండే ముఖ్యమైన వస్తువులు, అవసరానికి కనిపించకపోవడమనేది ఓ శాపం అనుకుంటా…
సర్వే జనా సుఖినోభవంతూ..