చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

రోడ్డుమీద ఓ బండిలో, ఓ పాలిథిన్ బ్యాగ్గులో పెట్టి ఎన్నో పువ్వులమొక్కలు పెట్టుకుని అమ్ముతూ వెళ్తూంటారు, ప్రతీ రోజూ చూస్తూంటాము. చూడ్డానికి చాలా బాగుంటాయి.ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎపార్టుమెంట్లవడం తో, ఇదివరకటి రోజుల్లోలాగ, గార్డెన్లూ అవీ ఉండడం లేదు.అందుకోసమని, ఇదిగో ఇలా రోడ్లమీదొచ్చేవాళ్ళ దగ్గరే కొనుక్కోవాల్సివస్తోంది. ఏదో ఒక మొక్క సెలెక్ట్ చేసికుని,బేరం ఆడి,కొనుక్కుంటాము. ఇంట్లో అప్పటికే కుండీలు ఉన్నాయా సరే, లేకపోతే ఎక్కడికో వెళ్ళి వాటిని కొనుక్కోవడంతో ప్రారంభం అవుతుంది, మన ప్రాజెక్టు! ఆ తరువాత వాటిలోకి కావలిసిన మట్టి. ఈ రోజుల్లో మట్టెక్కడ కనిపిస్తుందీ? ఎక్కడ చూసినా కాంక్రీటే కదా! మళ్ళీ ఆ మొక్కలమ్మినవాడినే కాళ్ళట్టుకుని, ఓ సిమెంటు బస్తాడు మట్టిని కూడా తెమ్మంటాము.

వాడు ఊరికే ఏమీ ఇవ్వడు, దానికీ ఓ రేటు. ఏదో మొత్తానికి తిప్పలు పడి ఆ కొనుక్కున్న మొక్కని కుండీలో వేస్తాము.ఇంట్లో వాళ్ళందరికీ ఆర్డరు పడుతుంది-ప్రతీ రోజూ దాంట్లో, మర్చిపోకుండా నీళ్ళు పోయాలని. మనం కొన్నప్పుడే ఉన్న మొగ్గలు ఓ రెండుమూడు రోజుల్లో, ఎలాగైతేనేం ముక్కుతూ మూలుగుతూ పువ్వులు పూస్తాయి.ఆ తరువాతనుండి మొదలౌతాయి మన పాట్లు.ప్రతీ రోజూ నీళ్ళు పోసినా సరే, మళ్ళీ మొగ్గేయదు, పైగా ఆకులకి ఏదో పురుగు కూడా పడుతుంది.పురుగు పట్టినంత చోటా, కత్తిరించేయడం, చివరకి అలా కత్తిరించుకుంటూ పోయాక మిగిలేది, మనమూ,ఆ మట్టీ, కుండీనూ! ఏమిట్రా ఇలా అయిందని, ఆ అమ్మినవాడిని అడిగితే, ఏదో వచ్చిందీ,దానికి మందుంటుందీ, కావలిసిస్తే ఇస్తానూ అంటాడు.

నాకో విషయం చిత్రంగా అనిపిస్తుంది- మనం కిరాణా షాపులో రవ్వా, మైదా, శనగపిండీ కొనుక్కుంటామా, కొన్నప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని రోజులకి పురుగుపట్టేస్తుందెందుకో? అప్పటికీ, అవేవో ఎయిర్ టైట్ సీసాల్లోనో, డబ్బాల్లోనే పెడుతూంటాము. ఆ కొట్టువాడెమో ఎలా పెట్టినా, ఓ పురుగూ పట్టదూ పుట్రా పట్టదూ అదేమిటో? చాలామంద ఫ్రిజ్  లో పెట్టడం మొదలు పెట్టారు.  ఫ్రిజ్ లో పళ్ళూ కూరగాయలకంటె, ఈ డబ్బాల సంఖ్య పెరిగిపోయింది!

చిన్న పట్టణాల్లో చూస్తూంటాము, రోడ్ సైడున కొట్లు పెట్టుకుని, పెన్నులూ, పిల్లల ఆటవస్తువులూ అమ్ముతూంటారు. ఆ కొట్టువాడు ఓ పెన్ను చేతిలో పెట్టుకుని అటు తిప్పీ ఇటుతిప్పీ గట్టిగా నొక్కేసీ వ్రాసేసి, 'చూడండి మా పెన్ను ఎంత స్ట్రాంగో, స్టర్డీయో' అంటాడు. తీరా మనం ఇంటికి వెళ్ళి అలా చేస్తే, అదికాస్తా పుటుక్కున విరిగూరుకుంటుంది! అలాగే వాళ్ళమ్మిన ఏరో ప్లేన్లూ, హెలికాప్టర్లూనూ, అక్కడ బాగానే ఎగురుతాయి. ఇంటికి వెళ్ళి పిల్లలచేతిలో పెట్టి ఎగరేద్దామని చూస్తే

అది చచ్చినా కదల్దు! తీర్థాల్లోనూ, ఇప్పుడొచ్చే జాత్రాల్లోనూ అమ్మే వస్తువులన్నీ చాలా భాగం అలాటివే. డిజిటల్ వాచీల హవా ఉంది కొన్నాళ్ళు, ఏ ఫుట్ పాత్ మీద చూసినా, పదిహేను రూపాయలకీ, పాతిక రూపాయలకీ వాచీలొచ్చేసేవి.

ఇప్పుడు ప్రతీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్టూ, సగానికంటె తక్కువ రేట్లలో దొరికేస్తుంది. వాళ్ళెలా అమ్ముతారో, జనం ఎలా కొనుక్కుంటున్నారో ఆ బ్రహ్మ కే తెలియాలి.

మధ్యతరగతి వాళ్ళేమో, బ్రాండూ, దిబ్బా అంటూ వేలకివేలు పోసి కొంటారు.అలాగని అవేమీ ఉధ్ధరించేయడం లేదు.మొన్నెపుడో నా సెల్ ( మామూలు బేసిక్ దే,హైఫై కాదు)అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. దాంట్లో ఉన్న ముఖ్యమైన నెంబర్లు గాయబ్ అయిపోయాయి. కొని రెండేళ్లు కాలేదు. ఎల్.జీ. వాడి కొట్టుకి వెళ్తే, అక్కడ ఓ యాభై మందిదాకా చూశాను. అంటే హైఫై సెట్లు కూడా అలాగే తగలడ్డాయన్నమాట! తేలిందేమిటంటే, మన రాత బాగుంటే, ఫుట్ పాత్ మీద కొన్నదైనా మన్నుతుంది,బ్రాండెడ్డే కానఖ్ఖర్లేదు అని!వచ్చిన గొడవేమిటంటే ఫుట్ పాత్ మీద కొనడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ! ఎవరైనా చూస్తే.... అలాగే ఫైవ్ స్టార్ హొటల్లో కంటే, టప్రీ ల్లో ఇచ్చే చాయ్ చాలా రుచిగా ఉంటుంది.

పేద్ద పేద్ద హొటళ్ళలో చెఫ్ఫో స్టువార్డో వచ్చి ఓ పుస్తకంలో మనం ఇచ్చే ఆర్డరు వ్రాసుకుని, ఓ గంటపోయిన తరువాత తీసుకొచ్చినా నొరుమూసుక్కూర్చుంటాము.అయిదు రూపాయల కాఫీకి పాతిక రూపాయలు వసూలు చేసినా పరవాలేదు!ఏమైనా అంటే స్టేటస్సూ, డిగ్నిటీ వగైరా వగైరా.... ఏమిటో వెళ్ళిపోతూంది జీవితం....

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి