చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

ఈ తరం వారు మూఢనమ్మకాలని కొట్టిపారేస్తారు కానీ, చిన్నతనంలో ఏదైనా అస్వస్థత కలిగితే, డాక్టరు దగ్గ్రకు వెళ్ళేలోపల, ఇంట్లోని అమ్మమ్మ గారో, నానమ్మ గారో ఏదో ఒక ప్రధమ చికిత్స లాటిది చేసేవారు… ఊరంతటికీ ఒకరో , మహా అయితే ఇద్దరో   MBBS  డాక్టర్లుండేవారు. ఏ కారణం చేతైనా వారు పొరుగూరికి వెళ్తే,  ఇంట్లోవారు మరీ ఈ అస్వస్థత కలిగిన వాడిని గాలికొదిలేయరుగా.. ఇంకో సంగతి – ఆ పెద్దవాళ్ళు చేసే వైద్యాలుకూడా ఏమీ వికటించేవి కావు. . ఆరోజుల్లో నాడి చూసి చెప్పగలిగేవారు గర్భవతో కాదో.. ఈరోజుల్లోలాగ ప్రతీ నెలా చెకప్పులూ, సింగినాదం ఉండేవి కావు..ఏమెమి తినాలో, తినకూడదో ఇంట్లో పెద్దవారే చెప్పేవారు.టైముకి ఏ మంత్రసానో వచ్చి పురుడు పోస్తుంది… ముత్యంలాటి బిడ్డని చేతిలో పెట్టేది.

ఈ రోజుల్లో అమ్మాయికో, కోడలుకో , నెలలు నిండేసరికి వారి స్ర్గితిగతులని బట్టి ఏ పెద్దాసుపత్రికో తీసికెళ్తారు. సాధారణంగా పురుడు వచ్చే సమయానికి ఓ రెండు మూడు రోజులుముందుగా ఓ రూమ్ముని బుక్ చేసుకుంటారు, ఆరునెలల యెడ్వాన్స్ గా. అదేం చిత్రమో, సరీగ్గా ఆరోజుకి హాస్పిటల్ కి వెళ్తే, మనం బుక్ చేసుకున్న రూమ్ము ఛస్తే ఖాళీగా ఉండదు, ఎందుకులేదూ అని అడిగినా,, ఏదో కుంటిసాకు చూపించి ఏదో ఎమర్జెన్సీ వచ్చిందని తప్పించుకుంటారు.. పైగా, ఏ డీలక్స్ రూమ్మో చూపిస్తారు.. రోజువారీ రెంట్ కూడా  డబలవుతుంది…ఈరోజుల్లో చాలామందికి నొప్పులు పడి బిడ్డని కనే సహనమూ లేదూ, ఓపికైతే సరేసరి… ఏవేవో టెస్టులు చేసేసి , సిజేరియన్ చేయాలని చెప్పేస్తారు… ఏ భర్త కానీ, తండ్రికానీ వద్దంటారూ ? ఇంక తల్లిగారు కూడా, పోనిద్దూ, పిల్ల శ్రమపడకుండా ఉంటే చాలని, మొత్తానికి అందరి  అంగీకారం తోనూ , ఆ సిజేరియన్ చేసేసి , పనికానిచ్చేస్తారు… ఇవన్నీ తప్పనికాదు, కానీ సహజసిధ్ధంగా వచ్చే పురుడు కాకుండా, ఛాన్సొస్తే సిజేరియన్ చేయడంలో అర్ధం ఏమిటీ? పైగా ఓ వారంరోజులపాటు ఉంచి మరీ పంపిస్తారు.. బిల్లు  లకారానికి చేరుతుంది.. దానికేముందిలెండి , ఏ ఇన్స్యూరెన్సొ ఉండనే ఉంటుంది…

 చిన్నప్పుడు ఏ కాలో బెణికిందంటే ఏ పెద్దవారో “ ఇరుకు మంత్రం “ అని వేసేవారు… గడపవతల అమ్మమ్మ గారూ, ఇవతల  కాలు బెణికినవాడూనూ.. మనం తలుపుకొట్టడం, అవతలినుంచి అమ్మమ్మగారు – “ ఎవరు వారూ..” అనగానే ఇటువైపునుండి “  మేము ఇరుకు వారమండీ “ అంటూ ఓ రెండుమూడుసార్లు చేసేటప్పటికి రెండోరోజుకల్లా నొప్పి మాయం.. అమృతాంజనం ప్రకటనలోలాగ.

అలాగే ఏ తేలో కుడితే,  తేలుమంత్రం తోపాటు, ఓ గ్రామఫోను రికార్డు ముక్కతో గంధం తీసి కుట్టినచోట అద్దేవారు. అలాగే పాముకాటుకి ఆయనెవరో నర్సయ్య గారనుండేవారు. ఆయనకి ఫోనుచేసి, కరవబడ్డవాడి పేరు చెప్తే, ఆయన ఏదో మంత్రం జపించేవారుట.. ఇక్కడ ఓ గంటలో పేషంట్ కి గెంతులేసే శక్తి వచ్చేది..

అలా చెప్పుకుంటూ పోతే, ప్రతీదానికీ విరుగుడుండేది… ఈరోజుల్లో అయితే ముందర గూగులమ్మని అడగడంతో మొదలవుతుంది.. సంగతి తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ మన పరిమిత  జ్ఞానాన్ని  డాక్టరెదురుగా ప్రదర్శిస్తేనే గొడవ. ఆ డాక్టరు “ వైద్యం నువ్వు చేసేమాటైతే ఇక్కడికెందుకొచ్చినట్టూ.. “ అంటారు.

ఈ రోజుల్లో ఎవరితోనైనా చెప్తే, “ అంతా బక్వాస్ “ అంటారు… వీటన్నిటికీ మూలమంత్రం – “ నమ్మకం “  వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఈ రొజుల్లో ఎవరికీ ఎవరిమీదా నమ్మకాలనేవి లేవు.  

ఈనాటి కాలమాన పరిస్థితులను బట్టి, ఒకే సంస్థలో, నలభై ఏళ్ళు పనిచేసారంటేనే , వేళాకోళం చేస్తారు..సంవత్సరానికి ఒకసారి ఉద్యోగాలు మార్చే ఈ తరం వారికి , నలభై ఏళ్ళు ఒకేసంస్థలో పనిచేసారంటే, “ అసలు ఆరోజుల్లో ఎవరికీ Drive , ambition  అనేదే ఉన్నట్టులేదే..” అంటారు. చివరకి, ఓ నలభై ఏళ్ళు , ఒకే భార్యతో కాపరం చేసారన్నా నమ్మని ప్రబుధ్ధులని కూడా చూస్తూంటాము… ఎందుకంటే, కాలం మారిపోయింది… ఎన్ని ఉద్యోగాలు మార్చాడూ, ఎంతమంది భార్యలకి విడాకులిచ్చాడూ అన్నదే , మనుషుల గొప్పతనానికి కొలమానం.. 
కాలం గడుస్తూనే ఉంటుంది.. ఎవరికోసమూ ఆగదు..

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి