ఇవాంకా ప్రేమ! - రాజు ఈపూరి

ivanka love

సుందర్ మనసు మనసులో లేదు. నాలుగు రోజులుగా సరిగా నిద్రపట్టడం లేదు. ఇవాంకాని ఎలా అయినా లవ్ లో పడేయాలి. 
ఇవాంకా రావడానికి పట్టుమని ఐదు రోజులు కూడా లేదు. ఏమిచేసైనా ట్రంప్ అల్లుడై పోవాలి.ఇదేలాస్ట్ ఛాన్స్.
ఇది మిస్ ఐతే తను ఇంక జీవితంలో అమెరికా వెళ్లే అవకాశమే రాదు.

చిన్న తనం నుండి ఎలా అయినా అమెరికా లో సెటిల్ కావాలని చేయని ప్రయత్నాలు లేవు .అన్నీ బెడిసి కొట్టి ఇక తన అమెరికా వెళ్లే దారులు అన్నీ మూసుకు పోయేయే అని ఆత్మహత్య చేసుకోవడమే సరైన మార్గం అనుకునే తరుణంలో ఇవాంకా ఇండియా వస్తోంది. 
అందులోనూ తను ఉండే హైదరాబాద్ వస్తోంది అనే వార్త పోయిన ప్రాణం తిరిగి వచ్చి నట్టయింది.

ఇవాంకాకి పెళ్లయితేనేం? ఏం పర్వాలేదు అమెరికా వెళ్లేందుకు ఆమాత్రం త్యాగం తప్పదు. ఇవాంకాని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటే ఆ కాన్సులేటోళ్లు చచ్చినట్టు వీసా ఇస్తారు . 

తనకేం తక్కువ ఇవాంకా తననిచూస్తేచాలు ప్రేమలో పడటం ఖాయం. ఎలా కలవాలి? 

ఆమె చుట్టూ వందలమంది పోలీసులు . 

అమెరికా ఇంటిలిజెన్స్ ఆఫీసర్లు. 

ఎలా? ఎలా? ఇవాంకా దృష్టిలో పడటం ఎలా? 

ఇవాంకా ఎప్పుడు ఏ టైంలో వస్తుంది. ఎక్కడక్కడి వెళుతుంది? 

ఆమె వచ్చిన దారిలో ఎవరూ ఇళ్ళల్లోనుండి బయటకి కూడా రాకూడదట.

తల కొట్టుకున్నాడు. ఇవాంకా చెయ్యదాటిపోతుందా? అలా జరగటానికి వీల్లేదు. 

ఎస్ ... అలా చేస్తే బాగుంటుంది. తనకి వచ్చిన ఆలోచనకి ఎగిరి గంతేశాడు సుందర్. 

ఇవాంకా ఫలక్నామా ప్యాలెస్ లో కేసీఆర్ ఇచ్చిన విందు ముగించి గిఫ్ట్ తీసుకొనిహైటెక్స్ వైపు వస్తున్నప్పుడు తాను ఫ్లై ఓవర్ పైన నుండి సరిగ్గా ఇవాంకా వస్తున్న కారు మీద దూకి తనుకనిపిస్తే చాలు ఇవాంకా ప్రేమలోపడటం ఖాయం . ఇంతకుమించి మరో ఉపాయంలేదని ఫిక్స్ అయిన సుందర్ ఆరోజు కోసం ఎదురు చూస్తూ క్షణమొక యుగంలా గడిపాడు .

ఆ రోజు రానే వచ్చింది తనూ ఇవాంకా ల వైవాహిక జీవితం గురించి కలలు కంటూ ఇవాంకా కారు కోసం ఎదురుచూస్తూ దూకడానికి రెడీ గా ఉన్న సుందర్కి పోలీసు సైరన్ వినిపించడం ఇవాంకా కారు రావటం సుందర్ దూకటం ఒకేసారి జరిగింది. 

పైనుండి ఓ వక్తి దూకటం చూసిన ఇవాంకా కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో సుందర్ సరిగ్గా ఇవాంకా కారు ముందు పడటం. 
తలనేలకి తాకిన సౌండ్ . 

నెమ్మదిగా కనులు విప్పిన సుందర్ కి ఆందోళనగా తనవైపు చూస్తున్న ఇవాంకా.

ఇవాంకా ఒడిలో తనతల.

సుందర్ కి కాసేపు నోటా మాట పడిపోయింది . 

'ఇవాంకా ఐ లవ్ యు' 'ఇవాంకా ఐ లవ్ యు' ఇవాంకా....సుందర్ మాటలకు అడ్డు వస్తూ మీకో గుడ్ న్యూస్ అండీ మీ అమెరికా కోరిక త్వరలో నెరవేరబోతోంది. మనమ్మాయి తల్లి కాబోతోందట. మూడో నెలట. డెలివరీ టైంకి మనల్ని అమెరికాకి రమ్మని అమ్మాయి ఫోన్ చేసింది. ఇంత వయసొచ్చినా ఇంకా మంచం మీద నుండి పడటటం ఏంటండీ చిన్నపిల్లోడిలా అంటున్న ఇవాంకా ముఖంలోకి చూస్తూ కాదు తన భార్య వెంకాయమ్మ ముఖం వైపు చూస్తూ బాధగా కళ్ళు మూసుకున్నారు సుందర్.. కాదు . సుందరం.

మరిన్ని వ్యాసాలు