ఆల్‌ ఇన్‌ వన్‌ రోబో - వినాశకాలే విపరీత బుద్ధి - ..

all in one robo

టెక్నాలజీ చేసే మేలు ఎంత ఉంటుందో, అంతకు మించిన కీడు కూడా పక్కనే పొంచి ఉంటుంది. మన సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ పోతున్నాం. చమురు దీపం నుండి ఎల్‌ఈడీ లైట్స్‌దాకా, గోడ మీద బొమ్మల నుండి ఐమాక్స్‌ సినిమాలదాకా, పాతాళం నుండి అంతరిక్షందాకా చాలా చాలా ప్రగతి సాధించేశాం. నిత్య జీవితంలో మనం వాడుతున్న వస్తువులు, వాటి కారణంగా పాడవుతున్న వాతావరణం ఇవన్నీ తలచుకుంటే, ఈ భూమ్మీద మానవాళి ఎక్కువ కాలం మనుగడ సాధించలేదనే విషయం అర్ధమవుతోంది. మన మనుగడని మనమే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాం ఈ కారణాలతో. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఇంకో వెయ్యి సంవత్సరాలు, లేదా రెండు వేల సంవత్సరాలదాకా ఈ భూమ్మీద మనిషి జీవించగలగడం అనేది అనుమానమే అని చెప్పక తప్పడం లేదు.

ఈ మధ్య ఓ కార్ల ఫ్యాక్టరీలో రోబోటిక్‌ యంత్రం, అక్కడ పనిచేసే కార్మికులపై ప్రతాపం చూపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే వింటున్నాం. దాదాపు పది, పదిహేను వరకూ ఈ తరహా ఘటనలు వెలుగు చూశాయి. అయితే వాటిలో మానవ తప్పిదమే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. రోబోటిక్‌ యంత్రాల్లో వాటి వర్క్‌కి సంబంధించిన డేటాని మాత్రమే ఫీట్‌ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువే. వాటి పని మాత్రమే అవి చేసుకుని పోతాయి. కానీ అలా జరగడం లేదు. మానవ మేధస్సును మించిన శక్తిని వాటికి అన్వయించాలనే తపనతో జరుగుతున్న తప్పులే ఇలాంటి ఘటనలకు కారణభూతమవుతున్నాయి. ఈ యంత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది అత్యుత్సాహంతో చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఆ యంత్రాలకే బలైపోతున్నారు. అయితే ఈ ఘటనల్లో ఆ రోబోటిక్‌ యంత్రాలకి తమంతట తాముగా స్పందించే గుణం గానీ, అవకాశం కానీ లేవు. కేవలం మానవ నిర్మితాలు మాత్రమే. ఒకవేళ ఈ యంత్రాలు వాటంతట అవే స్పందిస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రమాదాలకి అడ్డుకట్ట పడేనా?

సరిగ్గా ఇదే టైంలో 'రోబో సైన్యం' అనే ఆలోచన ప్రపంచాన్ని వణికించేస్తోంది. రజనీకాంత్‌ నటించిన 'రోబో' సినిమా చూశాం కదా. అందులో చిట్టి రోబో ఏం చేశాడు. రోబోలు మానవాళిపై దండెత్తే ప్రక్రియ మొదలైతే ఇంకేమైనా ఉందా? అయితే ఇది కల్పిత కథ, ఓన్లీ రీల్‌ స్టోరీ. కానీ అదే పరిస్థితిని మనం రియల్‌ లైఫ్‌లోనూ కోరి తెచ్చుకునేందుకు ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. రోబోల్నే సైన్యంగా ఉపకరిస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? చైనా, అమెరికా తదితర దేశాలు ఇప్పటికే రోబోటిక్‌ సైన్యాన్ని తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. రోబోలను సైన్యంలో ఉపయోగిస్తే, యుద్ధ సమయంలో ప్రాణ నష్టం తక్కువ ఉంటుందని వారు భావిస్తున్నారు. కానీ శత్రువు నుండి తప్పించుకోవాలంటే రోబోలకి అప్పటికప్పుడు వాటంతటవిగా స్పందించే గుణం ఉండాలి. తమని తాము కంట్రోల్‌ చేసుకునే అవకాశం ఉండాలి. ఇది జరిగితే, స్పందించే గుణం వాటికి వచ్చేసినట్లే. అప్పుడవి శత్రు సైన్యాల మీద దండెత్తడం కాకుండా, తయారు చేసిన వారి మీద దండెత్తితే.. 'రోబో' సినిమా మాదిరిగా మానవాళినే సర్వ నాశనం చేయాలనుకుంటాయి కదా. ఈ ఆలోచనే అతి భయంకరమైనది. అయితే ఇవి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి భయం లేదు. కానీ మనిషి తల్చుకుంటే అది పెద్ద విషయం కాదు..ఎంతో సమయం కూడా పట్టదు. ఒకవేళ అలాంటి రోబో సైన్యం తయారైన రోజు మానవాళికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయిపోయినట్లే! 

మరిన్ని వ్యాసాలు