చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఇది వరకటి రోజుల్లో ఇంట్లో పిల్లలెంతముందుంటే అంత సందడిగా ఉండేది.ఇప్పుడు అలాగ కాదుగా.ఒకళ్ళు,లేక ఇద్దరూ.కొంతమంది ఒకరితోనే సరిపుచ్చుకుందామనుకుంటారు. కానీ, మాకు 1979 లో మా డాక్టరమ్మగారు చెప్పినది ఇప్పటికీ గుర్తు--ఒక్కళ్ళే ఉంటే, మీరున్నంతకాలం ఫర్వాలేదూ, మీతరువాత, 'నావాళ్ళూ' అనే ఒక్కరైనా ఉండాలి ఇప్పుడున్న బిడ్డకి,అందువలన మీరు ఇంకేమీ ఆలోచించకుండా రెండో బిడ్డకి వెళ్ళండి అన్నారు. ఆవిడ చెప్పిందికూడా కరెక్టే కదా.

అలా కాకుంటే,మన పిల్ల మానసికంగా కూడా 'ఒంటరితనం' ఫీల్ అవుతుంది.ఆడైనా, మగైనా ఇంట్లో ఇద్దరు పిల్లలుంటేనే సందడి.ముందుగానే
నిశ్చయం చేసికుంటే, రెండేళ్ళ వ్యవధిలోనే ఇద్దరినీ కనేయడం శ్రేయస్కరం.లేదా ఇద్దరు పిల్లలకీ కనీసం నాలుగైదేళ్ళైనా వ్యత్యాసం ఉండేటట్లు చూస్తే అందరికీ మంచిది.అంతేకానీ,మొదటి బిడ్డ ఏ మూడేళ్ళో ఉన్నప్పుడు ఇంట్లోకి ఇంకో బిడ్డ వచ్చిందా, ఆ తల్లితండ్రులు పడే యాతన చూడ్డం చాలా కష్టం.

ఈ మొదటి పిల్ల ఇంకా ఏ ప్లేస్కూల్ కో వెళ్తుంటే, అస్సలు వీళ్ళు ఎప్పటికైనా పెద్దవుతారా, అనిపిస్తూంది.తల్లి పూర్తిగా పసిబిడ్డకే అంకితం అయిపోతుంది. పెద్ద పిల్ల కేమో ఇన్నాళ్ళూ 'అమ్మ నాతోనే ఉండేదీ, ఇప్పుడు ఇంట్లోకి ఇంకో బేబీ వచ్చిన తరువాత, నా సంగతే పట్టించుకోవడంలేదూ' అనిపిస్తుంది.ప్రతీ రోజూ ఈ పిల్లని స్నానం చేయించి, యూనిఫారం వేసి స్కూలుకి పంపడం అవీ నాన్నే చూసుకోవాలి.ఇదేకాకుండా, పసిబిడ్డ ఏ కారణం లేకుండా రాత్రంతా ఈ భార్యాభర్తలని మెళుకువగా ఉంచుతాడు.ఇంక చూడండి వీళ్ళ అవస్థ!
పోనీ అలాగని ఈ పిల్లని పసిబిడ్డ దగ్గర వదులుదామా అంటే, ఏం చేస్తుందో అని భయం.ఇంకో సంగతండోయ్, ఎవరైనా పసిబిడ్డని చూడ్డానికి వచ్చినప్పుడు, చేతిలో పెట్టడానికి ఏదో తెస్తూంటారు.పెద్ద పిల్లకి ఏమీ ఇవ్వకపోతే దీనికి ఓ రకమైన విరక్తి పుట్టుకొచ్చేస్తూంటుంది, వచ్చిన వాళ్ళకి బేబీ అంటేనే అభిమానం, నా సంగతే మర్చిపోయారూ అని. ఎందుకంటే ఇన్నాళ్ళూ ఆ ఇంటికి, ఆ తల్లితండ్రులకీ ఈ పిల్లే అన్నీనూ. ఈ పీరియడ్ మాత్రం, అందరూ చాలా జాగ్రత్త గా ఉండాలి.పెద్ద పిల్లని అస్సలు 'నెగ్లెక్ట్' చేయకూడదు.లేకపోతే ఉత్తిపుణ్యాన్న లేనిపోని సమస్యలొస్తాయి.

అదే ఇద్దరు పిల్లలకీ ఏ అయిదేళ్ళో వ్యత్యాసం ఉందనుకోండి, ఈ గొడవలన్నీ ఉండవు. ఆ పెద్దపిల్ల ఏ సెకండ్ స్టాండర్డ్ లోకో వస్తుంది. ఇంట్లో తను అనుభవించే ఆనందం అంతా ఏకఛత్రాదిపత్యంగా జరిపించేసికుంటుంది అప్పటికే. ఇంట్లో ఇంకో బేబీ వస్తూందంటే పట్టలేనంత ఆనందంగా ఎదురు చూస్తూంటుంది.అదో రకమైన 'మెటర్నల్ ఫీలింగ్' కూడా వస్తుంది.తనే అన్నీ చూస్తూంటుంది.ఎప్పుడైనా అవసరం వచ్చి పసిబిడ్డని వదిలి వెళ్ళవలసి వచ్చినా, ప్రాణం పోస్తుంది.ప్రతీ రోజూ బయటకు ఆటలకి వెళ్ళడం మానేసి, ఇంట్లో ఉన్న తన తమ్ముడు/ చెల్లెలు తోనే సమయం గడపడానికి చూస్తుంది.అంతే కాదు మనింటికి ఎవరైనా వస్తే, ఆ తల్లితండ్రులు కూడా గర్వంగా చెప్పుకోగలుగుతారు-'మా అమ్మాయికి వీడంటే ప్రాణం,అసలు నన్నేమీ చేయనీయదు' లాటి ప్రశంసలు ఇచ్చినప్పుడు ఆ పిల్ల మొహంలో కనబడే ఆనందం ఎంత బాగుంటుందో !

ఇలాటి కార్యక్రమాలన్నీ 35 సంవత్సరాలకల్లా పూర్తి చేసేసుకోండి. మీరు రిటైర్ అయే సమయానికి ( ఏ ఉద్యోగంలో ఉన్నా ఈ రిటైర్మెంటనేది తప్పదుగా!) హాయిగా చేతికి అందొచ్చిన పిల్లలుంటారు.అదృష్టం బాగుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా పూర్తిచేసేసికుంటే 'ఏక్ దం సోనేపే సుహాగా'.వాళ్ళ పురుళ్ళూ, పుణ్యాలూ కూడా పూర్తి అయిపోతే ఇంక చెప్పేదేముంది? ఇవన్నీ ఏదో 'హైపోతెటికల్' గా చెప్పేది కాదు-అనుభవం మీద చెప్పేది.

చిన్నా చితుకూ చిరాకులుంటాయి, వాటిగురించి పట్టించుకోకపోతే, అవేమీ మననేం చెయ్యవు.అసలు చిరాకులూ,పరాకులూ లేకుండా జీవితం ఏమిటీ?
ఏదో ఒక కాలక్షేపం కూడా ఉండాలిగా. ఎలా కావాలంటే అలా అన్వయించుకోవచ్చు.ప్రతీ దానికీ పట్టించుకుంటే జీవితం నరకం అయిపోతుంది. అర్ధం చేసికోనే పధ్ధతిలో ఉంటే అందరికీ హాయి.

    ఆ భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చి ఓ అందమైన జీవితాన్ని ప్రసాదించారు. మహా ఉంటే ఎన్నాళ్ళు బ్రతుకుతామూ? ఉన్నన్నాళ్ళూ, పోయిన తరువాతా కూడా మన గురించి ' ఓ తీపి జ్ఞాపకం' లా ఒక్కడు గుర్తుచేసికున్నా మన జీవితం ధన్యం అయినట్లే !

ఈ పిల్లలమధ్య “ ఎడం “ కనుక ఉంటే, ఎక్కువ శ్రమపడాల్సిన వాళ్ళు అమ్మమ్మ / నానమ్మ లే. ..ఏదో ఒకదానితరవాత ఇంకో  మనవడో మనవరాలో వచ్చేస్తే , హాయిగా , ఆవిడకీ బావుండేది..  సేవ చేయడానికి ఆవిడకీ ఓపికుండొద్దూ..
సర్వేజనా సుఖినోభవంతూ.

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి