ఉత్తరాఖండ్ తీర్ధయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand

( చంపావత్ జిల్లా )

ఉత్తరాఖండ్ జిల్లాలో కొండలు జలపాతాలూ , దట్టమైన అడవులు మమ్మల్ని చాలా ప్రభావితం చేసేవి . నాలుగురోజులు వరుసగా శలవులు వస్తే మరో ఆలోచన కాని గమ్యం కాని లేకుండా  ఆ పచ్చని ప్రకృతిలో గడపడానికి బయలుదేరేవారం . అలాగే బయలుదేరేం , ఓ గమ్యం లేదు కనిపించిన దారిలో బయలుదేరి చీకటి పడేవరకు ప్రయాణంచి మాతో కూడా తెచ్చుకున్న భోజనాలు ఓ చెట్టుకింద తినేసి ,  దొరికిన బసలో రాత్రి గడిపి తిరిగి బయలుదేరేవారం . అలా ఓ సారి బయలుదేరి వెళుతూ వుండగా రోడ్డు మీద ఓ చిన్న బోర్డు , చేతితో వంకరటింకరగా  ' పాతాళ రుద్రేశ్వర్ ' కి దారి ' రాసినది మమ్మల్ని ఆకట్టుకుంది . రోడ్డు పక్కన కారు నిలుపుకొని , సామానులను నడవలేని మా అమ్మగారిని డ్రైవరు రకషణలో వదిలి మేం బయలుదేరేం .

మా దంపతులం , మా ఆడపడుచు దంపతులు మొత్తం నలుగురం . సాయంత్రం నాలుగింటికి ' పాతాళ రుద్రేశ్వర్ ' . ఎంతదూరం నడవాలో తెలీదు , నడక మొదలుపెట్టేం . కొండలలో సన్నని నడకదారి , కాస్త దూరం నడిచేక యెటువెళ్లాలి , వెళుతున్న దారి గమ్యం చేరుస్తుందా ? అనే అనుమానాలు . ఎండుకట్టెలు యేరుకుంటున్న వారిని సరియైన దారి అదేనా ? అని అడిగేం . అదే దారంట తిన్నగా వెళ్లమని కొంతదూరం మాతో వచ్చి వారి గ్రామం వైపు వెళ్లిపోయేరు . జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ , ముళ్లతుప్పలు దాటుకుంటూ నడవసాగేం . ఎంతదూరం వుందో తెలీదు . కనిపించిన యెవరినడిగినా యీ పక్కనే అనే సమాధానం , మాకు చాలా కష్టం అనిపించసాగింది . కొండదిగడం సులువు కాని తిరిగి వచ్చేటప్పుడు యెక్కాలిగా ? అదే భయం .

దారిలో చిన్నచిన్న గ్రామాలు దాటుతుంటే నవ్వుమొహాలతో పలకరించి వేడివేడి టీ తాగమని అడుగుతున్న స్థానికుల పలకరింపులతో ముందుకు సాగిపోయేం . కొండంతాదిగి రామగంగ నదికి సమానంతరంగా నడవసాగేం . సూర్యకిరణాలు చొరబడలేనంత దట్టమైన అడవిలో ప్రయాణం , యెలాంటి అడవిమృగాలున్నాయో తెలీదు మా కళ్లముందు పాతాళ రుద్రేశ్వరుడు తప్ప మరేమీ లేదు . ఆరుగంటలకు పూజారి వెళ్లిపోతాడని త్వరగా వెళ్లమని స్థానికులు హెచ్చరించసాగేరు . అలాగే పడుతూ లేస్తూ ఓ అరగంట ప్రయాణం తరువాత మరో కొండపైకి దారివెళుతూ కనిపించింది . అమ్మోమళ్లా కొండయెక్కాలా ? , ఓ స్థానికుడు కనబడితే యింకా యెంతదూరం వెళ్లాలి అడిగేం . కనబడుతున్న కొండయెక్కి , దిగి ఆ వెనుకనున్న  కొండ దగ్గర గుహలు వున్నట్లు చెప్పేడు . వెనుకకి మరలిపోదామా అని అనిపించింది . గబగబా నడుస్తే పదినిముషాలలో చేరగలం అని కూడా చెప్పేడు అతను .

మరో అరగంట నడిచి గమ్యం చేరేం . సుమారు 40 మీటర్లపొడవు 18 మీటర్ల వెడల్పు వున్న రెండుగుహలు . కొన్ని సంవత్సరాలపాటు నీటి కోత వలన యేర్పడ్డ వివిధ ఆకృతులు . హిందూ దేవీదేవతలను గుర్తుచేస్తున్నట్లుగా వున్నాయి . అలాగే యేర్పడ్డ శివలింగం , పూజారి రాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కనిపించేరు . పాతాళ భువనేశ్వర్ తో పోలిస్తే కాస్త నిరాశ కలుగుతుంది . కొండ గోడలపై యెక్కడ చెయ్యివేసినా నీటిప్రవాహపు శబ్ధాలు తెలుస్తున్నాయి . చాలా చీకటిగా వున్న గుహలు కొన్ని వేల గబ్బిలాల నివాసాలయేయి . తేమగా వున్న నేలమీద నడక కష్టమైనా గుహంతా తిరిగి వివిధ ఆకృతులను తాకి చూసి అబ్బురపడ్డాం .

పూజారి చెప్పిన కథనం ప్రకారం 1993 లో ఓ గ్రామస్థుని కలలో అమ్మవారు కనిపించి యీ ప్రదేశం గురించి ఆనవాళ్లుచెప్పిందట , అతను గ్రామ పెద్దలతో యీ ప్రదేశానికి వచ్చి యీ గుహలను కనుగొన్నాడట . అప్పటినుంచి యిక్కడ నిత్యపూజలు నిర్వహిస్తున్నారట , మోక్షార్ధలు యిక్కడ యిప్పటికీ సాధన చేసుకుంటూ వుంటారట .

అప్పటికే చీకటి పడ్డంతో పూజారి మమ్మల్ని ఆరాత్రికి వారింట వుండమని ఆహ్వానించేరు . కాని రోడ్డుమీద కారు , డ్రైవరు , మా అమ్మగారు గుర్తొచ్చి వారి ఆథిధ్యం నిరాకరించి వెనుకకి మరలేం .

అమావాస్య రాత్రులు , కన్నుపొడుచుకున్నా దారితెలీటం లేదు . మా అందరి పరిస్థితి అంతే , మా ఆడపడుచు భర్త ( మా మేనమామ కొడుకే లెండి ) ఆర్మీ మనిషి కావడంతో అతని ట్రైనింగులో చిమ్మచీకటిలో దారితప్పకుండా నడవగలగడం కూడా వుండటం మాకు పనికొచ్చింది . అతని వెనకాల మెల్లగా నడుస్తూ గమ్యం వైపు సాగిపోయేం .

ముందుగా ఆకొండదారిలో సుమారు మూడు కిలోమీటర్లు నడవాలని తెలిస్తే  మాత్రం అంత సాహసం చేసేవాళ్లం కాదు , స్థానికులు పక్కనే అన్నారు కాబట్టి అంతదూరం నడిచి ఓ అద్భుతమైన గుహాలయాన్ని చూడగలిగేం . గుహాలయం లోపల ఆకృతులు యెంతబాగున్నాయో , బయట ప్రకృతి అంతబాగుంది .

దారిలో ప్రతీ స్థానికుడు తమ యింట వుండిపొమ్మని , రాత్రి ఆ అడవిలో కృారమృగ సంచారం వుంటుందని రాత్రి ప్రయాణం మంచిది కాదని చెప్పేవారు . మేము ప్రాణాలు అరచేత పట్టుకొని యెలాగో  మా కారు చేరేం . ఆ రాత్రి యెక్కడ వుండాలనే  ప్రశ్న మొదలయింది . చంపావత్ నుంచి సుమారు 60 కిలోమీటర్లు నాలుగు గంటలు ప్రయాణంచి చేరేం . రాత్రి సమయంలో ఆరుగంటలు ప్రయాణిస్తే కాని చంపావత్ చేరలేం .   మా డ్రైవరు మేం లేని సమయంలో సేకరించిన సమాచారం ప్రకారం అక్కడకి సుమారు మరో 25 , 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే ' మీఠా రీఠా సాహెబ్ గురుద్వారా ' లో రాత్రి వుండడానికి వసతి వుందని .

ఆ రాత్రి గురుద్వారాలో వుండడానికి నిశ్చయించుకున్నాం .

గంటగంటన్నర ప్రయాణించి రాత్రి పదిగంటలకు గురుద్వారా చేరేం . గురుద్వారాలో వున్న వారు మాకు గది యిచ్చేరు . రాత్రి పదిదాటడం వల్ల రాత్రి భోజనం దొరకదు అని చెప్పేరు . మాతో పాటు రైస్ కుక్కర్ వుండటం వల్ల ఆరాత్రి పెరుగన్నం తినగలిగేం .

చాలా చల్లగా వుంది  అక్కడ . రాత్రి అక్కడకి చేరడం వల్ల పరిసరాలు చూడలేకపోయేం . రాత్రి గడగడ లాడించింది చలి . పొద్దున్న లేచి గురుద్వారా లోకి వెళ్లేం , వేడివేడి టీ యిచ్చేరు . పదిగంటలకు గురుద్వారా తెరుస్తారని చెప్పేరు . పదకొండు గంటలకు 'లంగరు ' సేవ మొదలవుతుందని భోజనం చేసి వెళ్లమని చెప్పేరు . మాకు ' లంగరు ' ( గురుద్వారాలలో ఉచితంగా భోజనం పెట్టడాన్ని లంగరు సేవ అంటారు ) లో తినడం మొహమాటంగా వున్నా సరే అన్నాం .

వేడివేడి టీ తాగి పరిసరాలు చూడ్డం మొదలు పెట్టడం . చుట్టూరూ దట్టమైన అడవులతో వున్న పర్వతాల మధ్యవున్న ' దేయూరు ' అనే గ్రామంలో 1960 లో నిర్మింపబడ్డ గురుద్వారా . దూరంగా మంచుతో కప్పబడ్డ కొండలు కనువిందుచేస్తూ రాత్రి వేసిన చలికి కారణం కూడా తెలిసింది . ' లోఢియా ' , రథియ నదుల సంగమ ప్రాంతంలో నిర్మింపబడి వుంది యీ గురుద్వారా . మేం తప్ప మరెవ్వరూ యాత్రీకులు లేరు . సుమారు పాతిక ముప్పై గదులు గురుద్వారా చుట్టూ నిర్మించేరు . గురుద్వారా చుట్టూ తోట పెంచుతున్నారు , తోట మధ్యలో పెద్ద చెట్టువుంది దానిని ' రీఠా ' అంటే కుంకుడు చెట్టు అనిచెప్పేరు . మన కుంకుడు చెట్టుకి భిన్నంగా వుంది . ఆ చెట్టు క్రింద కూర్చొని గురునానక్ జీ తపస్సుచేసుకొనేవారట .

ఇక్కడ మనం కాస్త గురునానక్ గురించి చెప్పుకుందాం . గురునానక్ ఏప్రెల్ 15 1469 లో పంజాబులో ' రాయ్ బోయ కి తల్వాండి ' అనే గ్రామం లో జన్మించేడు . ప్రస్తుతం యీ గ్రామం పాకిస్థాన్ కి చెందిన పంజాబులో ' నానక్ సాహెబ్ ' గా ప్రసిధ్ది పొందింది . తొమ్మిది సంవత్సరాలవరకు మాటలుకూడా రాని నానక్ ఒక్కసారిగా శ్లోకాలు , నీతి పద్యాలు చెప్పనారంభించి , అప్పటి మొఘల్ పాలకుల అరాచకత్వాన్ని ప్రతిఘటించేందుకు తమలో శక్తి వుండాలని , తమని తాముకాపాడుకోడానికి ఓ సైన్యం వుండాలని తోటి యువకులకు శిక్షణ యిస్తూ , ప్రతీ యింటినుంచి ఓ యువకుడిని తనకు యిమ్మని , తాను వారికి మొఘల్ పాలకులనుంచి విముక్తి నిస్తానని చెప్పి  ' శిక్కు మతాన్ని ' స్థాపించేడు .

శిక్కు మతంలో ' గురుగ్రంథ్ సాహెబ్ ' అనే వారి పవిత్రగ్రంథం లో సుమారు  960 శ్లోకాలను నానక్ రచించేరు . అప్పట్లో ప్రజలమీద గోరఖ్ నాథ్ చెడుప్రభావం వుండడంతో చాలా మార్లు అతనితో , అతని శిశ్యులతోనూ వాదనలు చేసి వారిది తప్పు అని నిరూపించేరు . గోరఖ్ నాథ్ తాంత్రిక సిద్ధులు పొందిన బాబా .

ప్రజలలో ఆధ్యాత్మకతను పెంచేందుకు నానక్ మొత్తం దేశ సంచారం చేసినట్లు గురుగ్రంథం లో చెప్పబడింది .

చాలా మటికి హిందూ పురాణాలు చదివి ఆ ఆనవాళ్ల ప్రకారం అక్కడకి వెళ్లి ఆ ప్రదేశాలలో అక్కడ తపస్సు చేసుకున్నారు .

ఆ సమయంలోనే నానక్ చంపావత్ లోని యీ పవిత్ర సంగమ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ వుండగా గోరఖ్ నాధ్ నానక్ తన తపశ్శక్తితో సాధించినదేమిటి? అని యెగతాళి చెయ్యగా నానక్  " యీ  చెట్టు కాయను తియ్యగా చేస్తాను , నువ్వు చెయ్యగలవా "? అని అడిగేరట , దానికి తాంత్రిక బాబా గోరఖ్ నాధ్ ' అసాధ్యం ' అని అన్నాడట , అప్పుడు నానక్ చెట్టునున్న కాయను యిచ్చి తినమని అడిగేరట , ఆకాయను రుచి చూసిన గోరఖ్ నాధ్ అతని శిశ్యులు తాంత్రిక ఉపాసన విడిచి పెట్టి నానక్ శిశ్యులుగా మారిపోయేరట .

శిక్కు మతం లో పది గురువుల తరువాత గురు పరంపరకు శ్వస్తి చెప్పడం జరిగింది . అప్పటి నుంచి శిక్కు గురువులచే రచింపబడ్డ ' గురు గ్రంథ్ సాహెబ్ ' నే వీరు గురువుగా పూజిస్తున్నారు .

ఇప్పటికీ యీ ' మీఠా రీఠా సాహెబ్ ' లో ఆ చెట్టుకాయను ప్రసాదంగా యిస్తారు . అలాంటి చెట్లు ఆ ప్రాంతాలలో చాలా వున్నాయి , కాని వాటికాయలు చాలా చేదుగా వుంటాయట .

మద్యాహ్నం అక్కడ ' లంగరులో ' పెట్టిన రొట్టికూర , ఖిచిడి తిని తిరిగి తనక్ పూరు బయలుదేరేం .

మళ్లా వారం మరిన్ని యాత్రానుభవాలతో మీ ముందుంటానని తెలియజేసుకుంటూ శలవు .

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి