ఒక్క క్లిక్‌ మీ జీవితాన్నే మార్చేస్తుంది - ..

One click changes your life

చేతిలో ఫోన్‌, లేదంటే కళ్ల ముందు ఓ ల్యాప్‌ట్యాప్‌ ఉంటే చాలు చెలరేగిపోతున్నాం. అంతర్జాలం అంతుచూసేద్దామనే ఉత్సాహంతో ఉరకలేసేస్తున్నాం. స్మార్ట్‌ యుగంలో అందరి కంటే స్మార్ట్‌గా ఉండాలననిపించుకోవడం కోసం తహతహలాడిపోతున్నాం. ఈ ఉత్సాహానికి వయసుతో సంబంధం లేదు. సంవత్సరం పిల్లాడి దగ్గర నుండి డెభ్బై, ఎనభై ఏళ్ల ముసలోడి దాకా ఇదే పరిస్థితి. టెక్నాలజీతో పోటీ పడిపోదామనే ఉరకలేస్తున్నారు. అయితే నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే ఇక్కడ కూడా మంచీ చెడూ ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు ఈ ఆత్రుతలో పడి. స్మార్ట్‌ ఫోన్‌ కావచ్చు. కంప్యూటర్‌ కావచ్చు. ఒక్కసారి ఇంటర్నెట్‌ కనెక్ట్‌ అయితే చాలనుకుంటున్నారు.. కానీ అందులో మైనస్‌లను అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా యువత అందరి కన్నా స్మార్ట్‌ అనిపించుకోవడానికి చూపుతోన్న అతి శ్రద్ధ వారిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోంది. ఎక్కువ సేపు ఈ స్మార్ట్‌ గాడ్జిట్స్‌కి అతుక్కుపోవడంతో తద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యల గురించి పలు సార్లు చర్చోపచర్చల్లో విన్నాం. కానీ వాటి సంగతి పక్కన పెడితే, జీవితానికి అవసరమైన ఉద్యోగాన్వేషణలో యువత ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు శోచనీయం. చాలా బాధాకరం.

స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక పర్సనల్‌ అంటూ ఏమీ ఉండడం లేదు. అంతా పబ్లిసిటీనే. ఈ పబ్లిసిటీ పిచ్చి కొందరి విషయంలో కెరీర్‌నే దెబ్బ తీసేస్తోందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ప్రొఫైల్స్‌.. ప్రొఫైల్స్‌తోనే అవతలి వ్యక్తి స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ తెలిసిపోతోంది. ఒకవేళ ఇక్కడ తెలియకపోతే సోషల్‌ మీడియా ఉండనే ఉంది. అక్కడ ఓ సారి ఎంటర్‌ అయితే చాలు. జీవితం తెరిచిన పుస్తకమే అన్నదానికి డైరెక్ట్‌ మీనింగ్‌ ఇక్కడే తేలిపోతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివిటీస్‌ ఎలా ఉన్నాయి.. ఏంటి? అనే విషయాలపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నారు. అంతే మొత్తం బయోడేటా వచ్చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తు. మొబైల్స్‌లో రక రకాల ఫ్రీ మెసేజ్‌లు. యాప్స్‌ లింక్స్‌. అస్సలు ఖర్చే ఉండదు. మొత్తం ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ. సో ఎలా ఉంటాం. క్యూరియాసిటీ ఆగదు కదా. జస్ట్‌ క్లిక్‌ అంతే సంగతి. ఒక్కోసారి ఈ లింక్స్‌ మనకి తెలీకుండానే ఓపెన్‌ అయిపోతూ ఉంటాయి. అంతే ఇక మన పుట్టు పూర్వత్తరాలు అవతలి వ్యక్తి చేతిలో పెట్టేసినట్లే. ఇలా వీటిన్నింటినీ విశ్లేషించి, కొత్త కొత్త యాప్స్‌ సహాయంతో మన ఆలోచనల్ని అవతలి వ్యక్తులు అంచనా వేసేస్తున్నారు. తర్వాత దోచేస్తున్నారు.

నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానంటే కుదరదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో ఏ చిన్న తప్పు దొర్లినా అంతే.. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టరు. ఇక ఉద్యోగాల విషయంలో చూస్తే సేమ్‌ ప్రోసెస్‌. మనం వాడే యాప్స్‌, సోషల్‌ మీడియా, మొబైల్‌ ప్రొఫైల్స్‌ తదితర అంశాల ఆధారంగానే మన వ్యక్తిత్వాన్ని డిసైడ్‌ చేసేస్తారు. ఏ చిన్న అవకాశం దొరికినా వెంటనే రిజక్ట్‌ చేసేస్తారు. ఉద్యోగాల సంగతి ఇలా ఉంచితే, ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. వీసా స్టాంపింగ్‌, తదితర అంశాల్లో కూడా మన స్మార్ట్‌ టెక్నాలజీ మన భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడేదీ మూడో కంటికి తెలియకుండా జరగడం లేదు. దీనికంతటికీ కారణం స్మార్ట్‌ యూజ్‌ అనే చెప్పాలి. కాబట్టి మై డియర్‌ యూత్‌ ..! బీ కేర్‌ ఫుల్‌ ఇన్‌ యూజింగ్‌ సమ్‌ న్యూ యాప్స్‌. నో కాస్ట్‌ కదా పోయేదేముంది అనుకుని టెంప్ట్‌ అయ్యి మనకి వచ్చిన ప్రతీ లింక్‌నీ క్లిక్‌ చేయకండి. అవే మీ పాలిట కాస్ట్‌లీ మిస్టేక్స్‌గా మారి మీ బంగారు భవిష్యత్తును పాతాళంలోకి నెట్టేయొచ్చు. జర భద్రం మిత్రమా!

మరిన్ని వ్యాసాలు