చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

మామూలుగా మన జీవితంలో, మాట్లాడ్డం మొదలెట్టినప్పటినుండి, మన తల్లితండ్రులు నేర్పేస్తారు. ఎప్పుడూ నిజమే మాట్లాడాలనీనూ, అబధ్ధం చెప్పకూడదనీనూ. స్కూల్లో వెళ్ళినా కూడా,అక్కడ కూడా ఇదే నేర్పుతారు.కాబోసూ అనుకొని, మనం కూడా అదే అలవాటు చేసికుంటాము.కాల క్రమంలో, ఎప్పుడో అవసరంకొద్దీ అనండి, లేక మనం స్నేహం చేసే వాళ్ళవల్ల అనండి అబధ్ధాలు చెప్పడం మొదలెడతాము.మొదటిసారి అమ్మ దగ్గర అబధ్ధం చెప్పినప్పుడు కొంచెం తటపటాయిస్తాము.ఎప్పుడూ నిజమే చెప్పే తన కొడుకో/ కూతురో అబధ్ధం ఎలా చెప్తుందీ అనే దురభిప్రాయం తో, పాపం ఆ వెర్రితల్లి నమ్మేస్తుంది. కానీ ఆ స్టేజిలో అవేమీ ప్రాణహానికరమైన అబధ్ధాలు కావు (అని అనుకుంటాము మనం).కానీ, అవే మొదటి విత్తులు!

ఏ సినిమాకో వెళ్ళాలనిపిస్తుందనుకోండి, రాత్రిళ్ళు చదువుకోడానికి, ఫ్రెండింటికి వెళ్తున్నామూ అని సినిమా సెకండ్ షో కి చెక్కేయడం అన్నమాట. ఫ్రెండ్స్ తో జల్సా చెయ్యాలన్నప్పుడు, ఏవో పుస్తకాలు కొనుక్కోవాలీ అని డబ్బులు అడగడం వగైరా అన్నమాట!ఇంక పెద్ద అయ్యేకొద్దీ పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, ఈ అబధ్ధాలు చెప్పడం ఎంత అలవాటైపోతుందంటే, అసలు నిజం అనేది ఎలా ఉంటుందో మర్చిపోతాము. ఎప్పుడైనా పెళ్ళాంతో సినిమాకెళ్ళాలంటే, ఒంట్లో బాగోలేదని, ఆఫీసుకి శలవు పెట్టేయడం, మన ఇంటికి ఏ అప్పులాడైనా వస్తే, ఇంట్లో లేరని పిల్లలతో చెప్పించడం, వగైరా...ఇవన్నీ చూసి పిల్లలూ అవే నేర్చుకుంటారు. ఫర్వాలేదూ, మా నాన్నే అబధ్ధాలు చెప్తూంటే మనకేం నష్టం, అని వాడూ ఆ మార్గం లోకే వెళ్తాడు.ఇలాటి వాళ్ళు రాజకీయాల్లో బాగా పైకి వస్తారు.ఎందుకంటే ఆ ఫీల్డ్ లో నిజం చెప్తే, మనల్ని ఎవడూ నమ్మడు. అబధ్ధం అనేది ఓ 'అబ్సెషన్'వాళ్ళకి!

మామూలు జీవితంలో కొంతమందికి ఓ అలవాటుంటుంది, ఏ వస్తువు కొన్నా దాని అసలు ఖరీదు చెప్పకుండా,ఎక్కువచేసో, తక్కువ చేసో చెప్పడం, పరిస్థితుల్ని బట్టి. అవతలవాడు ఓ సరుకు కొన్నాడనుకోండి, అదే వస్తువు మనం కొంటే, దాని ఖరీదు తక్కువ చేసి చెప్పి, అవతలి వాడికంటె తను ఎంత తెలివైనవాడో అని ప్రకటించడానికన్నమాట!అలాగే ఏ ఇల్లో, ప్లాటో కొన్నామనుకోండి, దాని ఖరీదుకూడా అంతే( తక్కువచేసి చెప్పడం). ఇంక అవతలివాడి ఇంట్లో రోజూ వాళ్ళావిడ వాడికి ఓ పాఠం తీసుకుంటూంటుంది, 'చూడండి అన్నయ్యగారికి ఎంత తక్కువలో దొరికిందో, మీరూ ఉన్నారు, ఓ బేరం చెయ్యడం అదీ లేదు, అవతలివాడు ఏం చెప్తే దానికే తలూపేయడం '. అంతే కాకుండా ఈ 'అన్నయ్య' గారు కనిపించినప్పుడల్లా ఈ విషయం గుర్తు చేసి జీవితంలో తనేం కోల్పోతూందో, వదినగారు ఎంత అదృష్టవంతులో చెప్తూంటుంది. ఇదంతా ఓపిగ్గా చూసి చూసి, ఈయన అంటే 'తెలివితేటలు లేని' ఇంటాయన, అవసరానికి, ఓ బుల్లి అబధ్ధం చెప్పడం మొదలెడతాడు. ఏ సరుకు కొన్నా సరే తగ్గించే చెప్పడం . ఈవిడ ఊరుకుంటుందా, అమ్మలక్కలందరిదగ్గరా ఠముకు వేసేస్తుంది, తన భర్తకి ఎంతమంది తెలుసునో, దాని వలన తమకు ఎంత లాభం వస్తోందో వగైరా.. కొంతకాలం దాకా బాగానే ఉంటుంది ఈ పాప్యులారిటీ, ఎవరో ఒకరొచ్చి, మాక్కూడా తెచ్చిపెట్టండీ అనేంతవరకూ. అప్పుడు తెలుస్తుంది వీడి అబధ్ధం ఎంత కాస్ట్లీ అయిందో !

ఏ విషయంలోనైనా ఓ అబధ్ధం చెప్పామంటే, దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. ఎవడితో ఏం చెప్పామో, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో సహా,గుర్తుండదు. ఇంట్లో అయితే మరీ కష్టం, అదేంటండీ మొన్ననే కదా చెప్పారూ, మా ఇంటికి ఫోన్ చేశారనీ, ఈవేళ మా వాళ్ళు చాలారోజులనుంచీ మీదగ్గరనుంది ఫోన్నే రావడంలేదే అంది, మా అమ్మ, అంటే నన్నూరుకోపెట్టడానికి అబధ్ధం చెప్పేశారన్నమాట. చెయ్యకపోతే చెప్పొచ్చుకదా, అయినా మీఇంటివాళ్ళకేదైనా చెయ్యాలంటే ఊరికి ముందరుంటారు కానీ, మా వాళ్ళదగ్గరకొచ్చేసరికే ఈ గొడవలన్నీనూ,అని.కొంతమందికి అబధ్ధాలు చెప్పడం, ఓ ఫాంటానో, లింకానో త్రాగినంత ఈజీ. ఇదివరకటిరోజుల్లో అయితే 'మంచినీళ్ళ ప్రాయం' అనేవారు, కానీ కొంచెం మాడరన్ గా ఉండాలని పోలిక మార్చాను!

ఏ విషయమైనా సరే ఊరికే 'అతి ' చేసి చెప్పేమనుకోండి, కొంతకాలం వరకూ బాగానేఉంటుంది, ఈ చెప్పబడిన 'ప్రాణులు' ఒకరితో ఒకరు కలుసుకునేవరకూ, అప్పుడు మన మాట వచ్చిందనుకోండి, అప్పుడు చూసుకోండి మనం వీళ్ళిద్దరితోనూ చెప్పినవి బయట పడిపోతాయి. ' అరే అలాగా మీతో అలా చెప్పాడా, నాతో ఇంకోలా అన్నాడే, అయినా వాడి మాట నమ్మమని ఎవడన్నాడూ, వాడి నాలక్కి నరం లేదండి' అని మన ఇమేజ్ కి ఓ ఢక్కా వస్తుంది. ఇదంతా అవసరమా? ఇంక పెళ్ళిళ్ళ విషయంలో మధ్యవర్తులు-'వెయ్యి అబధ్ధాలు చెప్పైనా సరే ఓ పెళ్ళి చేయించాలీ' అని ఓ పాతకాలపు సామెత ముసుగులో, నోటికొచ్చినట్లల్లా అబధ్ధాలు చెప్పేస్తారు. ఆ పెళ్ళి పెటాకులైనప్పుడు, వాళ్ళదగ్గరకు వెళ్ళి ' ఏమండీ, అప్పుడు అలా చెప్పారూ, మీ మాట పట్టుకుని మేం ఈ సంబంధం నిశ్చయం చేసికున్నామూ, ఇప్పుడు చూస్తే అన్నీ గొడవలే' అన్నాకూడా, దానికీ ఓ సమాధానం రెడీగా ఉంటుంది, ' ఆరోజుల్లో నాకు తెలిసున్నదేదో చెప్పానుకానీ,నాకేమైనా సరదా ఏమిటండీ, మిమ్మల్ని గొడవల్లో ఇరికించడానికీ'అని తప్పించుకుంటాడు.

ఇన్ని గొడవలతో ప్రతీవాళ్ళతో మాట పడఖ్ఖర్లేకుండా ఉండాలంటే జాయిగా నిజం చెప్పేయడం హాయి.. ఎందుకంటే నిద్రలోంచి లేపి అడిగినా ఒకే సమాధానం చెప్తాము.ఎవడితో ఏం చెప్పామూ అని గొడవుండదు. పైగా ఇంట్లో వాళ్ళందరూ నిజమే చెప్పేస్తే ఇంకా హాయి, ఎవడి సర్కిల్లో ఎవడడిగినా ఒకేలాగుంటుంది. ఏమంటారూ ?... అయినా అబధ్ధం చెప్పడం అలవోకగా వచ్చేస్తుంది… అదో పెద్ద వ్యసనం..

సర్వేజనా సుఖినోభవంతూ….

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి