ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand

( చంపావత్ , పిత్తోరాగఢ్ )

చంపావత్ జిల్లాలో మరో ముఖ్యనగరం లోహాఘాట్ . ఇది చంపావత్ జిల్లాలో వున్న అతి సుందరమయిన వేసవి విడిది . చంపావత్ కి సుమారు 13 కిలోమీటర్ల దూరం , పిత్తోరాగఢ్ కి సుమారు 62 కిలోమీటర్ల దూరంలో వుంది .

ఈ ప్రదేశం చేరుకోడానికి హలద్వాని మీదుగా గాని లేక తనక్ పూర్ మీదుగా గాని చేరుకోవచ్చు . రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే ఢిల్లీనుంచి హలద్వాని కి , తనక్ పూర్ కి రైళ్లు వున్నాయి . రోడ్డు మార్గం ద్వారా అయితే ఢిల్లీనుంచి బస్సు సౌకర్యం టాక్సీ సౌకర్యాలు కూడా వున్నాయి . ఢిల్లీ నుంచి సుమారు 430 కిలోమీటర్లు . సుమారు 200 కిలోమీటర్లు కొండలమీద వుండే ఘాట్ రోడ్డు మీద సాగే ప్రయాణం అహ్లాదకరంగా వుంటుంది .

ఈ ప్రాంతం ఇప్పటికీ  పర్యాటకుల తాకిడి యెక్కువగా లేని ప్రదేశం . అందుకే యిక్కడిగాలి  కలుషితం కాలేదు . ఇక్కడికొండలు , అడవులు మానవుల వికృతికి గురికాకుండా యింకా స్వచ్చంగా వున్నాయి . చిన్న చిన్న జలపాతాలు , ఓ పక్కగా ప్రవహిస్తున్న మహాకాళి నది , యిందులో నీరు నల్లరంగులో కనిపిస్తూ వుంటుంది . అందుకే యీ నదికి మహాకాళి అనే పేరు వచ్చిందట . ఈ నది మనదేశానికి , నేపాలుకి సరిహద్దు . అంటే యీ నదికి యివతల వొడ్డున మనదేశం , అవతల వొడ్డున నేపాలు దేశం వున్నాయి .

అందుకనే పదహారవ శతాబ్దంలో కుమావు ప్రాంతపు రాజుని ఓడించి నేపాలు రాజులు యీ ప్రాంతాన్ని పరిపాలించేరు . ఇప్పటికీ మనకి యీప్రాంతాలలో ప్రజలు నేపాలీ పోలికలతో వుండడం కనిపిస్తుంది .

లోహా ఘాట్ లోహావతీ తీరాన వున్న నగరం , లోహావతి నది వొడ్డున పెరిగిన నగరం . ఈ నదిలో రాఫ్టింగు కి అనుకూలంగా వుండడం వల్ల యిక్కడ ఔత్సాహికులు రాఫ్టింగు చెయ్యడానికి వస్తూవుంటారు .

లోహాఘాట్ విహారస్థలమే కాక ఆధ్యాత్మిక ప్రదేశంగా కూడా ప్రసిధ్ద పొందింది .

ఇక్కడ అన్ని రకాలయిన వసతి గృహాలు లభ్యమవుతాయి . లోహఘాట్ చుట్టుపక్కల యెన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి . వాటిలో ముఖ్యంగా మాయావతి ఒకటి . మాయావతి చిన్న గ్రామం , లోహఘాట్ కి సుమారు  9 కిలోమీటర్ల దూరంలో వుంది , యిక్కడవున్న అద్వైతఆశ్రమం వల్ల యిక్కడకి చాలా మంది దేశీవిదేశీ పర్యాటకులు వస్తూవుంటారు . 1899 లో రామకృష్టా మఠం వారు వివేకానందస్వామి ఆధ్వర్యంలో యిక్కడ ఆశ్రమం ప్రారంభించేరు . ఆశ్రమానికి మొదటి అధిపతిగా వివేకానందుడి ముఖ్య శిశ్యుడైన ' స్వామి స్వరూపానందస్వామి ' ని నియమించేరు . అప్పటి నుంచి చాలా మంది విదేశీ రచయితలు యీ ప్రదేశం లో వుండి వారి రచనలలో యీ ప్రాంతాన్ని కాశ్మీరు తో పోల్చి ' భూతాల స్వర్గం యిక్కడుండగా కాశ్మీరులో వెతకడం తెలివైన పనేనా ? ' అని రాసేరు .

పచ్చని అడవిలో  మంచుకప్పబడ్డ పర్వతాల మధ్య వున్న యీ ఆశ్రమం చాలా ప్రశాంతంగా వుంటుంది .  ' ప్రబుద్ద భారత ' అనే ఆధ్యాత్మిక ఆంగ్ల మాసపత్రిక యిక్కడనుండే వెలువరిస్తునారు . ఈ ఆశ్రమంలో ఉచిత వైద్య సదుపాయాలు చుట్టుపక్కల గ్రామాల వారికి అందజేస్తున్నారు .

అబ్బొత్ పర్వతం --

లోహఘాట్ కి సుమారు 7 కిలో మీటర్ల దూరంలో వున్న మంచి పిక్నిక్ స్పాట్   . సరయు మహాకాళి నదుల సంగమ ప్రాంతంలో వున్న పర్వతం . కనుచపు మేరవరకు వున్న పచ్చిక మైదానాలు , పంచేశ్వర్ రివర్ రాఫ్టింగ్ స్పాటులతో మంచి విహారకేంద్రంగా ప్రసిధ్ద చెందింది . 

లోహఘాట్ కి సుమారు 7 కిలోమీటర్ల దూరం లో ద్వాపరయుగానికి చెందిన బాణాసురుని కోట అవశేషాలు వున్నాయి . 

|పిత్తోరాగఢ్ ----

దేశరాజధాని ఢిల్లీకి సుమారు 490 కిలోమీటర్ల దూరం లో  ఉత్తరాఖండ్ లోని పర్యాటక జిల్లాలలో మరో ముఖ్యమైన జిల్లా పిత్తోరాగఢ్ . ఈ ప్రాంతం కతూరియా రాజులు , బామ్ రాజులు తరువాత చాంద్ వంశపు రాజులు పరిపాలించేరు . 1514 లో చాంద్ వంశపురాజైన పృథ్వీ గౌసాయ్ యిక్కడ కోటను నిర్మించడం వల్ల యీ ప్రాంతాన్ని పృథ్వీ గఢ్ అని పిలువసాగేరు కాలక్రమేణ యిది పిత్తోరాగఢ్ గా పిలువబడసాగింది . ఈ రాజ్యం తరచు నేపాలీ రాజుల చొరబాటుకి గరౌతూ వుండేది . ఆ యుధ్దాలలో దెబ్బతిన్న కోటను 1790 లో నేపాలిరాజులు తిరిగి నిర్మించగా  1962 లో జరిగిన చైనా యుధ్దంలో నేలమట్టమైంది ప్రస్తుతం యిక్కడ గర్ల్స్ యింటరు కాలేజీ భవనం నిర్మించేరు .

పిత్తోరాగఢ్ జిల్లా మొత్తం కొండలు దట్టమైన అడవులతో కూడుకోని వుంటుంది . మంచుపర్వతాలకు అతిదగ్గరగా వుండడం వల్ల చాలా చల్లగా వుంటుంది వాతావరణం . కాళి నదివొడ్డున వున్న నగరం . ఈ జిల్లాలో మొత్తం పేరున్న హిమానీనదాలు పాతికకిపైబడి వున్నాయి . అలాగే సుమారు 40 పర్వతశఖరాలు , పన్నెండు లోయలు , నాలుగు జలపాతాలు వున్నాయి . పేరు పెట్టని జలపాతాలకు లెక్కేలేదు . ప్రతీ కొండ మలుపులో ఓ జలపాతం కిందకు దుముకుతూ వుంటాయి . అడవిపూలకి అంతేలేదు . ఇక్కడ మరో సంగతి యేమిటంటే యీకొండలలో గులాబీ మానులు ( మన యిళ్లల్లో యెంతో శ్రద్ధగా పెంచినా మూడు నాలుగేళ్లకే యెండిపోతాయి , యిక్కడ పెద్ద వృక్షం లా పెరగడం వింత అనిపించింది ) నిండుగా పూలతో వున్నవి చూసి ఆశ్చర్యపోయేం . అలాగే రంగురంగుల జినియాపూలు దారిపొడవునా యెవరో శ్రద్ధగా పెంచుతున్నట్లు పెరిగాయి .

ఓ గమ్యం లేకుండా వెళుతున్న మేం మంచు కొండలనూ , లోయలనూ జలపాతాలను చూసుకుంటూ దిదిహాట్ చేరేం . దిదిహాట్  కి 4 కిలోమీటర్ల దూరం లో వున్న   ఆస్కోట్  కస్తూరిమృగాల సంరక్షిత ప్రాంతం వల్ల ప్రసిధ్ద పొందింది . సుమారు 600 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కస్తూరిమృగాల సంరక్షణకి వుపయోగించేరు . కస్తూరి మృగాలు చాలా చల్లగా వుండే ప్రాంతాలలో యెత్తైన కొండలమీద మాత్రమే బ్రతకగలవు . మనదేశంలో చాలా అరుదైన జంతువు . సాధారణంగా కస్తూరిమృగాలు చిన్న అలికిడైనా చెట్లలోకి పారిపోతాయి , ఆ ప్రాంతంలో ఓ రెండుమూడు గంటలు తిరిగేం కాని మాకు యెటువంటి జంతువులు కనబడలేదు , అయితే చక్కని ప్రకృతిని చూసి చాలా ఆనందించేం .

థాల్---

కాలినాగ్ , సుందరినాగ్ , ధౌళినాగ్ పర్వతాల మద్య రామ గంగవొడ్డున వున్న యీ లోయ యెంతో చక్కగా వుంటుంది . ఇక్కడ చాలా చిన్న శివకోవెల  వుంది . మరో కోవెల ఓ మోస్తరుదే కాని కాస్త నిర్లక్ష్యానికి గురౌతున్న మందిరం దీనిని ' యేక్ హథియా దేవాలయ ' అని అంటారు . దీనిని ఒకే రాతితో యేక రాత్రిలో ఒకే మనిషి ద్వారా నిర్మింపబడింది . ఇలాంటి వాటిని ప్రభుత్వం సంరక్షించి ముందుతరాలవారికి యీ అధ్బుతాన్ని అందిస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది . ఒకే మనిషి చే నిర్మింపబడిందా లేదా ? అనే వాదన పక్కన పెడితే యేక శిల నిర్మితం కూడా చాలా అరుదే కదా ? ఇలాంటి కట్టడాలు యిలా నిర్లక్ష్యానికి గురౌవడం చాలా సోచనీయం కదా ? .

దైనందిన ఒత్తిడుల నుంచి తప్పించుకొని హాయిగా కొన్ని రోజులు గడపాలనుకొనే వారికి ఈ లోయ యెంతో వుపయోగకరంగా వుంటుంది . ప్రకృతికి దగ్గరగా , ప్రకృతిలోని ప్రతీ మంచిని ఆస్వాదిస్తూ కొన్ని రోజులు గడపడానికి మంచి ప్రదేశం యిది . ఇది భారతదేశం నుంచి జరిగే కైలాస మానససరోవర యాత్ర దారిలో వుండడం వల్ల ఆ సమయాలలో యాత్రీకులతో కళకళలాడుతూ , మిగతా సమయాలలో స్థానికులుతప్ప యాత్రీకులు కానరాని మారుమూల ప్రదేశం .

ధర్ చూలా---

పిత్తోరాగఢ్ కి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో వున్న సరిహద్దు గ్రామం యిది లోయ కూడా  . నేపాలు భారత దేశాల మధ్య సరిహద్దు  లోయ . విభజన సమయంలో యీ లోయ లో కొంతభాగం నేపాలు దేశానికి యివ్వబడింది . అయితే చెప్పుకోదగ్గ విషయం యేమిటంటే భారతదేశం లో వున్న  భాగాన్ని ' ధర్ చూలా ' అని అంటారు అలాగే నేపాలులో వున్న భాగాన్ని కూడా ' ధర్ చూలా ' అనే అంటారు . ధర్ చూలా అంటే పొయ్యి ఆకారంలో వున్న శిఖరం అని అర్దం .

కైలాస్ మానస సరోవర యాత్ర లో భారత దేశం లో వున్న ఆఖరు గ్రామం దీనితరువాత నేపాలు అక్కడనుండి టిబెట్ భూభాగం లోకి ప్రవేశిస్తారు యాత్రీకులు . కాళి నది వొడ్డున వున్న లోయ , పూర్వకాలం నుంచి యీ లోయ వాణిజ్య కూడలిగా ప్రఖ్యాతి పొందింది .

ఈ లోయకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ' చౌదన్స్ ' అనే లోయలో వున్న ' నారాయణ ఆశ్రమం ' ఆధ్యాత్మిక , సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రసిధ్ద పొందింది . 1936 లో ముఖ్యంగా కైలాస్ మానస సరోవర యాత్రీకులకు వసతి యేర్పరచే వుద్దేశం తో ప్రారంభించింది . రకరకాల వృక్షాల నడుమ , దారంతా అడవిపూలు స్వాగతిస్తూవుంటే పళ్ల తోటల మధ్యనుంచి నారాయణ ఆశ్రమానికి వెళుతున్నాం . కొండలపైనుంచి దూకుతున్న లెక్కలేనన్ని జలపాతాలు చూసుకుంటూ ఆశ్రమం చేరుకున్నాం . ప్రశాంత వాతావరణంలో వున్న ఆశ్రమం మమ్మల్ని సేద తీర్చింది .

ఆశ్రమం లో వున్నప్పుడు మనం అక్కడి నియమాలను పాఠించాలి , దినచర్య అంతా సమయానుసారంగా పంచబడుతుంది . టైముప్రకారం భోజన సదుపాయాలు వుంటాయి , టైము దాటితే భోజనం దొరకదు . రాత్రి యేడు కి డైనింగు హాలు మూసేస్తారు . తరువాత తినడానికి యేమీ దొరకదు . ఎందుకంటే చుట్టుపక్కల మరో భోజన హోటలు కూడా లేదు . సమయానికి ఆహారం తీసుకుని మనకు తోచిన సేవ చేసుకోడం , ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనడం యిది ఆ ఆశ్రమం లో దిన చర్య . ఓ రాత్రి మాత్రమే అక్కడ గడిపే అదృష్టం కలిగింది .

ధర్ చూల నుంచి ఛోట కైలాస్ కి నడకదారి వుంది . ఛోటా కైలాస్ , పార్వతి సరస్సు కూడా చాలా ప్రసిద్ధి పొందింది . ఛోటా కైలాస్ ని ' ఓమ్ ' పర్వతం అని కూడా అంటారు . ఈ పర్వతం పైన పడిన హిమం  'ఓమ్ ' ఆకారంలో కనబడడం వల్ల యీ పర్వతానికి ఓమ్ పర్వతం గా పేరొచ్చింది . దీనిని ఫొటోలలో చూడ్డం మన కాని నిజంగా చూసే భాగ్యం మాకు కలుగలేదు .

ఈ వారంతో ఉత్తరాఖండ్ లో మేము చూసిన యాత్రలు పూర్తయేయి , మళ్లా వారం మరో రాష్ట్రం లోని యాత్రా విశేషాలతో మీ ముందుకు వస్తాను అంత వరకు శలవు .            

       

        

              

        

 

 

 

మరిన్ని వ్యాసాలు