నేటి చిచ్చర పిడుగులే రేపటి మేధా సంపత్తి! - ..

todays childen tommorows big minds

పిల్లలకు చదుకు తప్ప వేరే లోకం లేదా? అని ఈ మధ్య తల్లితండ్రులు బాగానే క్వశ్చన్‌ చేసుకుంటున్నారు. చదువొక్కటే కాదు, ఆట పాటల్లోనూ తమ చిన్నారులు రాణించాలని కాంపిటేషన్స్‌లో చిచ్చరపిడుగుల్లా దూసుకెళ్లాలనీ కోరుకుంటున్నారు. కుదిరితే క్రికెట్‌, వీలైతే వాలీబాల్‌..సమయం సరిపోకపోతే తక్కువ సమయంలోనైనా సంగీతం, డాన్స్‌, డ్రాయింగ్‌.. ఇంకా ఇంకా చాలానే. కానీ వీటన్నింటికీ సమయం ఎక్కడిది. సోమవారం నుండీ శనివారం వరకూ 8 గంటల నుండి 5 గంటల వరకూ స్కూల్‌. ఆ తర్వాత ట్యూషన్‌. ట్యూషన్‌ అయిపోయాక ఓ గంటైనా పైన చెప్పుకున్న యాక్టివిటీస్‌.. ఆదివారం పూర్తిగా రెస్ట్‌.. ఆ రెస్ట్‌ కూడా హోమ్‌ వర్క్‌ చేసిన తర్వాతే తీసుకోవాలి. ఇలా అయితే చిచ్చరపిడుగులు ఎలా అవుతారు? దీనికి సొల్యూషన్‌ ఏంటి..?

ఈ సమస్య గురించి జన బాహుళ్యంలో చర్చ బాగానే జరుగుతోంది. ప్రభుత్వాలు, ఈ సమస్య పట్ల దృష్టి పెట్టాయి. విద్యా సంస్థల యాజమాన్యాలు  తమ ధోరణిని మార్చుకుంటున్నాయి. తల్లితండ్రులు కూడా తమ ఆలోచనని మార్చుకోవాలి. చదువుతో పాటు అన్నీ కావాలి అనే డిమాండ్‌ని స్కూళ్ల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. ఇంటి దగ్గర కూడా పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించాలి. ఆటలు పిల్లల్లో శారీరక ఉత్సాహాన్ని, మానసిక పరిపక్వతనీ తీసుకొస్తాయి. స్వేచ్ఛగా ఆటాలాడుకునే పిల్లల్లో జ్ఞాపక శక్తి, మిగతా పిల్లలతో పోలిస్తే ఎక్కువనీ ఎన్నో పరిశోధనల్లో తేలింది. అంటే పిల్లల్ని ఆటల వైపు ప్రోత్సహిస్తే, ట్యూషన్స్‌ పేరుతో అదనంగా స్టడీ అవర్స్‌ అనే ఇబ్బంది తప్పినట్లే. 
ఒకప్పుడు మన దేశంలో విద్యా రంగం పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇప్పుడు చాలా మారిపోయింది. ఇది వెస్ట్రన్‌ కల్చర్‌ ప్రభావం అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలా విదేశాల్లో చదువు కంటే కూడా ఇతర వ్యాపకాలపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. మన దగ్గర్నుంచీ ఆ గొప్పతనాన్ని వాళ్లు అలవర్చుకుంటే, వారితో పోటీ పడేందుకు మనం మన పిల్లల్ని చదువు పేరుతో నిర్భంధించేసినంత పని చేస్తున్నాం. ఇంతా చేసి, మన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించినా, ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్లకి లోక జ్ఞానం తెలుసుకునే ఛాన్స్‌ మనం ఇవ్వడం లేదు. స్కూళ్లు, ప్రభుత్వాల బాధ్యత ఎలా ఉన్నా, మన పిల్లల విషయంలో మనం ఖచ్చితమైన బాధ్యతతో వ్యవహరిస్తే, చిచ్చరపిడుగుల్ని అద్భుతాలు సృష్టించే మేధా సంపదగా మార్చగలం! 

మరిన్ని వ్యాసాలు