విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

( మలేషియ )

సుమారు  మూడు సంవత్సరాలుగా గొతెలుగు పత్రిక లో నా వ్యాసాలు చదువుతున్న పాఠకులకు యీ వారం నుంచి మన భారతదేశానికి దగ్గరగా వున్న కొన్ని ఆసియా దేశాలను గురించి అక్కడి పర్యాటక ప్రదేశాల గురించి పరిచయం చేస్తాను .

ఈ వారం నుంచి మీకు ‘ మలేషియ ‘ దేశం గురించి ‘ అక్కడి పర్యాటక ప్రదేశాలను గురించి పరిచయం చేస్తాను .

మలేషియ , యీ మధ్య కాలంలో బలమైన ఆర్ధిక దేశంగా రూపుదిద్దుకుంటున్న దేశం , మంచి పర్యాటక దేశంగా కూడా రూపు దిద్దు కుంటోంది . మలేషియ ముస్లిం దేశంగా ప్రకటించుకుంది . అయినా యిక్కడ హిందూ బౌద్ద మతాలకు కూడా అంతే ప్రాముఖ్యత వుంది . పదమూడు రాష్టాలు , దక్షిణ చైనా సముద్రం వల్ల రెండు భాగాలుగా విభజింపబడ్డ యీ దేశం లో యెన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి .     ఈ వారం నుంచి మీకు మలేషియా లోని ప్రదేశాలను , ఒకటొకటిగా పరిచయం చేస్తాను .

మా వారి ఉద్యోగ రీత్యా రెండు సంవత్సరాలు మలేషియ లో వుండవలసి వచ్చింది . అక్కడ శని ఆదివారాలు శలవు రోజులు .  క్రొత్త ప్రదేశాలు చూడడం మా హాబీ అవడం వల్ల ప్రతీ వారాంతపు శలవులకి యేదోక ప్రదేశానికి బయలుదేరేవాళ్లం . అక్కడి మా అనుభవాలను మీతో పంచుకుంటాను .

కొత్త దేశం , కొత్త భాష . నాకు  నేర్చుకోడానికి చాలా దొరికింది . భాష రాదు కాబట్టి మౌనంగా వారి వేష భాషలను గమనించ సాగేను .
ఇక్కడి ప్రజలను గమనిస్తే హిందూ , చైనీస్ , మలయా మూడు దేశాల ఆచార వ్యవహారాలు నరనరాన జీర్ణించు కున్నట్లు కనిపిస్తారు . మలేషియన్ వాసులు అధిక శాతం ముస్లింలు . ముస్లిం ఆచారవ్యవహారాలను తుచ తప్పకుండా పాఠించడం కనిపిస్తుంది , అలా పాఠించక పోతే కఠిన శిక్షలు వుంటాయి . అయితే యిక్కడ మతాంతర వివాహాలు చాలా యెక్కువగా జరుగుతూ వుండడం చూసేం . ఇలాంటి వివాహాలకు మతపెద్దలు కాని గవర్నమెంటు వారు గాని యెటువంటి ఆంక్షలు పెట్టకపోవడం , పరువు హత్యలు లాంటివి కనబడక పోవడం ఆశ్చర్యాన్ని కలుగ జేసింది . మగపిల్లవాడి మతాన్ని బట్టి ఆడపిల్ల మతం నిర్ణయించబడుతుంది , లేదా యెవరి మతాన్ని వారు ఆరాధించుకోవచ్చు .ఇక్కడి స్థానికుల ఆచారావ్యవహారాలు చాలా మటికి మన వాటినే పోలి వుండడం ఆశ్చర్యానికి గురిచేసింది . మాకు తెలిసిన ముస్లిం ని యీ విషయమై ప్రశ్నించగా అతను మా పూర్వీకులు హిందువులు కదా , మేం మా పూర్వీకులు ఆచరించినవే  ఆచస్తున్నాం , మంచి అన్అనది అన్నిని మతాలలోనూ మంచే కదా ? అని సమాధానమిచ్చేడు . మన దేశం లో యిలాంటి అవగాహన లోపించింది యెందువల్లనో ?

ప్రజలలోనూ పాలకులలోనూ పరమతసహనం చాలా ఉఛ్చ స్థాయిలో కనిపించింది .చెప్పకపోవడమేమిగాని ముందు ముస్లిం దేశం వెడుతున్నాం , అక్కడ యెన్ని యిబ్బందులు యెదుర్కోవాలో అనుకున్నాం కాని తిరిగి వచ్చేటప్పుడు దేశం విడిచి రావాలంటే గుండెలు బరువెక్కేయి .

అక్కడ మేం మూడు బెడ్రూముల సర్వీస్ అపార్ట్మెంటు తీసుకున్నాం , వంటగదిలో గ్యాసు , ఫ్రిడ్జ్ , వాషిన్ మెషిన్ లతో పాటు వంట పాత్రలు కొన్ని వుంటాయి . రోజు విడచి రోజు యిల్లు శభ్రం చెయ్యడానికి మనిషిని పంపుతారు . పదిహేను రోజులకు ఓ సారి దుప్పట్లు , టవల్స్ మార్చుతారు .

కనీసం రోజూ యెదురు పడే వారితో మాట్లాడదామన్నా భాష రాదు . పనులకు వచ్చేవారు యెక్కువ సంఖ్యలో యిండోనీషియా వారు అధిక శాతం లో వుండేవారు . పనికి వచ్చేవారికి యింగ్లీషు వస్తుందని అనపకోవడం నా తెలివి తక్కువ అని మొదటి రోజే తెలుసుకున్నాను . మరునాడే ఇంగ్లీషు మలయ నిగంఠువు కొని మెల్లగా రెండేసి పదాలు జోడించి మాట్లాడ్డం నేర్చుకున్నాను .

నా ముచ్చట్లు తరువాత ముందు మలేషియ దేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .

చరిత్రకారుల ప్రకారం మలేషియ దేశంలో సుమారు 40 వేల సంవత్సరాలకు పూర్వం నుంచి జీవరాశులు వుండేవి . ఒకటవ శతాబ్దం లో భారతదేశం నుంచి చైనా దేశం నుంచి వర్తకానికి వ్యాపారులు రాకపోకలు సాగించసాగేరు . రెండవ శతాబ్దంలో వ్యాపారులు తీరప్రాంతాలలో తాత్కాలిక నివాసాలు యేర్పరచుకోసాగేరు .

15 వ శతాబ్దం లో భారత దేశాన్ని పరిపాలించిన చక్రవర్తి శ్రీ విజయాదిత్య ఆధీనంలో వుండేది , సింగపూరు , మలేషియా దేశాలకు ‘ పరమేశ్వర ‘ అనే రాజుని అధిపతిగా నియమించేడు చక్రవర్తి శ్రీ విజయాదిత్య .   తరువాత ‘ మలక్క ‘ సుల్తానుల ఆధీనం లోకి వచ్చింది .1511 లో పోర్చుగల్ ఆధీనం లో , 1641 నుంచి డచ్ వారి ఆధీనంలో వుంది . 1786 లో మలక్క సుల్తానులదగ్గర ‘ పినాంగ్ ‘ ద్వీపాన్ని ఆంగ్లేయులు తమ ఈస్ట్ యిండియ కంపెనీ స్థాపనకై లీజుకి  తీసుకున్నారు . రెండవ ప్రపంచయుద్దం వరకు ఆంగ్లేయుల ఆధీనం లోనే వుంది . రెండవ ప్రపంచయుధ్దంలో ఈ భూభాగం జపాన్ గెలుచుకుని మూడు సంత్సరాలు ఆర్మీని వుంచేరు . 1948 ఫిబ్రవరి 1 న సింగపూరు , మలక్క , దీవులతో పాటు తొమ్మిది రాష్ట్రాలు గల మలేషియాని మలేషియా సమాఖ్య దేశాలు గా యేర్పరచేరు . 1957 ఆగస్ట్ 31 న మలేషియా స్వాతంత్రం పొందింది . 1963 లో  మలేషియా , సింగపూర్ లు సమైఖ్య రాజ్యాలనుంచి విడిపోయేయి . ఆంగ్లేయుల పాలన లో వున్నప్పుడు పొరుగు దేశాలైన భారత ; చైనా దేశాలనుంచి కార్మిక వలసలను ప్రోత్సహించేరు . అంటే సుమారు 1800 సంత్సరం నుంచి మలేషియ నేలమీద భారత , చైనా పౌరులు నివసించేవారు .ప్రస్తుతం పదమూడు రాష్ట్రాల తో కూడిన రెండు దక్షిణ చైనా సముద్రం తో రెండుగా విభజింపబడ్డ  మలేషియ దేశం వంశపారంపర్యంగా రాచరికానికి వచ్చే తొమ్మిది రాష్ట్రాల రాజులచే యెన్నుకోబడ్డ రాజు రాష్ట్రపతిగా , ప్రజలచే యెన్నుకోబడిన పార్టీ నాయకుడు ప్రదానమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు .

దేశ రాజధాని కౌలాలంపూరు , పరిపాలనా భవనాలు వున్న ప్రదేశాన్ని ‘ పుత్రజయ ‘ అని అంటారు .

రాజ భాష ‘ మలయ ‘ లేక ‘ భహష మలయ ‘ , రెండవ భాష గా ఆంగ్లం . మలయ భాషని లిపి లేని భాష అనొచ్చు . ఆంగ్ల లిపి నే మలయ భాషకు వాడతారు . కొన్నాళ్లు పోతే మన దేశంలోని భాషలకు కూడా లిపి లేకుండా పోతుందేమో ? , ఇప్పటికే మన దేశంలో చాలా మంది మాతృభాషలో చదవడం వ్రాయడమేకాదు  మాట్లాడ్డం కూడా మరచిపోయేరు , స్మార్ట్ ఫోనులు వచ్చేక  తెంగ్లీషు వాడకం యెక్కువయింది . ఇలా కొన్నాళ్లు గడిస్తే హిందూ భాషలకి ఆంగ్ల లిపి నే వాడవలసి వస్తుందేమో ?.

మలేషియ దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత చాలా త్వరగా అభివృధ్దిని సాధించింది . దాంతో ప్రపంచ సంపన్నదేశాల దృష్టిలో పడింది .
మలేషియా దేశాభివృధ్ది లో రబ్బరు , పామాయిలు , చమురు ముఖ్య పాత్ర వహించేయి . ఈ దేశ మట్టి వాతావరణ పరిస్థితులు ఆహారధాన్యాలు పండవు . ఆహారధాన్యాలు , కాయగూరలు పొరుగు దేశాలనుంచి దిగుమతి చేసుకుంటారు .

ఇక్కడి ప్రజలు శాంతికాముకులు , అమాయకులు , కష్టజీవులు . సాంప్రదాయాలను ఖచ్చితంగా పాఠిస్తారు . ప్రభుత్వం విధించే నియమనిబంధనలను తుచ తప్పకుండా పాఠిస్తారు . ఆడమగ సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు . మిగతా ముస్లిం దేశాలలో వున్నట్లు స్త్రీవిద్య మీద ఆంక్షలు లేవు .

మిగతా దేశాలలో మాదిరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడం , ర్యాలీలు నిర్వహించడం కనబడదు . ఇవి మలేషియన్ల గురించిన కొన్ని వివరాలు  , ఇక మనం మన యాత్రా వివరాలలోకి వెళదాం .

ముందుగా మీకు మలేషియాలోని నాలుగవ పెద్ద ద్వీపమైన ‘ పినాంగ్ ‘ ని పరిచయం చేస్తాను .

1786 లో ప్రాన్సిస్ లైట్ అనే ఈస్ట్ యిండియా కంపేనీ అధికారి నేతృత్వం లో  యీ ధ్వీపం కనుగొనబడింది . ఈ ద్వీపం యొక్క వైశాల్యం సుమారు 293 చదరపు కిలోమీటర్లు . మలేషియ దేశంలో ‘ పినాంగ్ ‘ వాణిజ్యపరంగా పేరుపొందిన జిల్లా . దీని ముఖ్యపట్టణం ‘ బటర్ వర్త్ ‘ , జిల్లా ముఖ్యపట్టణం ముఖ్య భూభాగం లో వుంది , బటర్ వర్త్ ని పినాంగు ద్వీపంతో కలుపుతూ ఎయిట్ లేన్ బ్రిట్జ్ సముద్రం మీద నిర్మింపబడింది .

బటర్వర్త్ లో చాలా కంపెనీలు వున్నాయి .  మా వారి వుద్యోగ రీత్యా వెళ్మలిన మేం మలేషియ దేశానికి చెందిన ‘ పినాంగ్ ‘ ద్వీపంలో 32 అంతస్థుల సర్వీస్డ్ అపార్ట్ మెంట్ లో 14 అంతస్థులో వుండేవాళ్లం  , అదీ సముద్రానికి దగ్గరగా . బల్కనీ లోంచి అనంతమయిన సముద్రాన్ని చూస్తూ కూర్చోడం అలవాటయింది . దూరంగా కదులుతున్న ఓడలను చూడడం , మద్యాహ్నం యెండలో తళతళ మెరుపులు విరజిమ్మే సముద్రాన్ని చూడడం ఓ వ్యసనంగా మారింది .

ముఖ్య భూభాగం నుంచి ‘ పినాంగ్ ‘ లోకి ప్రవేశించడానికి రెండు మార్గాలున్నాయి ‘ ఒకటి రోడ్డు బ్రిడ్జ్ మీదుగా మరొకటి నీటిమార్గం ద్వారా . నీటిమార్గం ద్వారా వెళ్లడానికి పెద్ద ఓడలో సుమారు 15 నిముషాలు ప్రయాణించాలి. ఈ ఓడ మూడంతస్థులలో వుంటుంది . రెండంతస్థులలో కార్లు బారులు తీరివుంటాయి , ఒకంతస్థులో మనషులు ప్రయాణించడానికి వీలుగా వుంటుంది . ప్రతీ పదినిముషాలకు ఓ ఓడ బయలుదేరుతుంది . కారు రోడ్డుమీంచి తిన్నగా ఓడలోకి చేరుతుంది వరుసలో కార్లని నిలుపుకొని కారులోని వారు ఓడలోని రైలింగు దగ్గర నిలబడి సముద్రాన్ని చూసే వీలుంది . సముద్రపునీరు యెంత స్వచ్చంగా వుంటుందంటే లోతుగా నీళ్లల్లో వున్న సముద్ర జీవులు కనిపిస్తూ వుంటాయి . అలా మన కార్లను ఓడలో పెట్టుకొని అవతలి వొడ్డుకి చేరేక తిరిగి కార్లో ప్రయాణించడం మొదటి మారు కావడం తో యెంతో థ్రిల్ల్ గా అనిపించింది . ఈ సముద్రంలో ‘ జెల్లీ ‘ చేపలు నీటిలో యీదుతూ వుంటే ఓడలో ప్రయాణం చేస్తూ వాటిని చూడడం కూడా చాలా బాగుండేది . అసలు అలాంటి చేపలు కూడా వుంటాయని మలేషియ లోనే తెలిసింది .

‘ పినాంగ్ ‘  లో అధిక సంఖ్యలో చైనీయులు , హిందువులు వుండటం తో  ఇక్కడ ‘ కెపితాన్ కెలింగ్ ‘ మసీదే కాకుండా అనేక చైనా మందిరాలు , మారియమ్మ ( పార్వతీ దేవి ) మందిరం , రాధా కృష్ణమందిరం , గురుద్వారాలు వున్నాయి .

మళ్లావారం ‘ పినాంగ్ ‘ లో మరికొన్ని ప్రదేశాల గురించి తెలియజేస్తానని మనవి చేసుకుంటూ శలవు .

మరిన్ని వ్యాసాలు