శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందినా మనిషి, మరణాన్ని మాత్రం జయించలేకపోతున్నాడు. అత్యాధునిక వైద్యం అందుబాటులో వుండడంతో, ప్రాణాంతక వ్యాధుల నుంచి ఉపశమనం మాత్రమే పొందగలుగుతున్నాం. ఇంకో అడుగు ముందుకేసి, అసలు మనిషికి మరణమే లేకపోతే? అన్న ఆలోచనల దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటినుంచో ఈ ప్రయత్నాలు జరుగుతుండగా, తాజా ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయపడుతుండడమే గమనించదగ్గ ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవాలి. మోకాలి నొప్పులు ఎక్కువైతే, కొంత భాగాన్ని తొలగించి, ఆ స్థానంలో పరికరాల్లాంటివి అమర్చుతున్నారు వైద్యులు. ఇదిప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా చెప్పుకునే గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించి తాత్కాలిక ప్రత్యామ్నాయాల గురించి వింటూనే ఉన్నాం. వెంటిలేటర్, డయాలసిస్ వంటి ప్రక్రియలు ఆయా వ్యాధుల బారిన పడి, ఆయా అవయవాలు పూర్తిగా పాడైపోయినా కూడా మనుషుల ప్రాణాల్ని నిలబెడ్తున్నాయి.
అయితే, తాత్కాలిక ప్రయోజనాల్ని 'యంత్రాల ద్వారా' పొందుతున్న మనం, ఆ యంత్రాల్నే శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో అమర్చితే, జీవితకాలం పెంచుకోవచ్చు కదా? అనే ఆలోచన ఈ మధ్య విస్తృతంగా వినవస్తోంది. ఆ ఆలోచనలోంచే సరికొత్త ప్రయోగాలు కూడా జోరందుకున్నాయి. మెదడు పనితీరు మందగిస్తే, ఓ చిప్ ద్వారా దాన్ని సరిచేస్తున్నాం. గుండె కొట్టుకునే లయ తప్పితే, దాన్ని సరిచేయడానికీ పరికరాల్ని వాడుతున్నాం. వయసు సహా అనేక కారణాలతో ఆయా అవయవాలకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడే వీటి అవసరం వస్తోంది. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరికరాల్ని మరింతగా అప్‌డేట్ చేసి, వాటికి అద్భుతమైన సాంకేతికతను జోడిస్తే, మరణం కూడా మనిషికి తప్పుతుందనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. ఆ ప్రయోగాలు సఫలమయితే పుట్టినవాడు మరణించక తప్పదు అనే మాట తప్పయిపోతుందనడం నిస్సందేహం.
అవునూ, పైన చెప్పుకున్నవన్నీ జరిగితే అలా తనను తాను మార్చేసుకుంటే ఆ వ్యక్తి మనిషి అని ఎలా అనిపించుకోగలడు? రోబోట్స్‌ని తయారుచేసుకోక, మనిషే ఎందుకు మరమనిషిలా మారాలి? అనే ప్రశ్నలు రావడం సహజమే. రోబోట్స్‌ని మనమే కంట్రోల్ చెయ్యాలి. వాటికీ మనలా స్వయం నిర్ణయాలు తీసుకునే మేధస్సుని మనం ఆపాదిస్తే, మానవాళి వినాశనం తప్పదు. అదీ అసలు సంగతి. కానీ, మనిషి మరణం లేకుండా తనను తాను మార్చుకోగలిగితే అది కూడా ఓ రకంగా వినాశనానికే దారి తీస్తుందేమో!