పాతొక అనుభవం, కొత్తొక అద్భుతం - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

old is gold

(ఇన్వైటింగ్ న్యూ ఇయర్ 2018)

కొత్తొక వింత, పాతొక రోత అన్నాడు మన తెలుగువాడు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నాడు ఇంగ్లీషువాడు.

మన తెలుగువాడు అలా ఏ సందర్భంలో ఎందుకలా అన్నాడో తెలీదు కాని, ప్రస్తుతానికి మనం ఆంగ్ల కొత్త సంవత్సరానికి (2018) జస్ట్ కొద్ది దూరంలో ఉన్నాం. కాబట్టి ఇంగ్లీషు వాడన్నది మాత్రమే పరిగణనలోకి తీసుకుందాం.

మనం ఈరోజు ఇలా ఉన్నామంటే గతకాలమే మూలం. గతంలో మనం మనకు నచ్చిన దాన్లో ఎంత కృషి చేస్తే ఈరోజు ఈ స్థితికి చేరాం. ఆ అనుభవాన్ని తీసిపారేయలేం, తేలిగ్గా మర్చి పోలేం కదా. 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ…గతమెంతో ఘనకీర్తి కలవోడ' అన్నది వేములపల్లి శ్రీ కృష్ణ ప్రబోధాత్మక గీతం. ఇందులో గతమెంతో ఘనకీర్తి అంటే భూతకాలంలో మనం ప్రోది చేసుకున్న కీర్తే కదా! మన గతమెంత ఘనమైనదో కదా! ఎవరికైనా గతం అనుభవాల పుట్ట. మంచో చెడో ఏదో ఒక అనుభవం ఉండి తీరుతుంది. ఏదైనా మన స్వయంకృతమే! ఆచి తూచి అడుగేయాలనుకునే మనం, కొన్నిసార్లు పప్పులో కాలేస్తాం. కొన్ని కోల్పోతాం. అయితే ఆ అనుభవాన్ని ఆధారం చేసుకుని ముందడుగేస్తాం. సాటివారికి అనుభవసారం పంచుతాం. అవే అడుగుజాడలంటే.

చరిత్ర- నాయకుల కుటిలత్వాన్ని, యుద్ధాలవల్ల నష్టాన్ని కళ్లకు కడుతుంది. అన్ని దేశాలూ శాంతి ఆవశ్యకతను తెలుసుకున్నాయి గనకే ఈనాడు సర్వత్రా శాంతి పరిఢవిల్లుతోంది. అందుచేత కొత్తలోకి ప్రవేశిస్తున్నాం కదాని పాతని పాతరేయకూడదు.

నిత్యం మనం ఎన్నో సమీక్షిస్తాం. అందులో సమాజం, పుస్తకాలు, సినిమాలు ఉంటాయి. వాటివల్ల మనకేంటి లాభం? ఎవరికో లాభం. మనం మన దైనందిన చర్యను దైనందిని(డైరీ)లో రాసుకుని సంవత్సరాంతపు చివరిరోజున సమీక్షించుకుంటే మనం మన 365 రోజుల్ని ఎలా గడపామో అర్థం అవుతుంది. ఎక్కడ తప్పులు చేశామో, ఎన్ని ఒప్పులు చేశామో, అద్దంలో చూసినంత స్పష్టంగా కనిపిస్తుంది( ప్రతిదినం మన గురించి మనం నిష్పక్షపాతంగా రాసుకుంటేనే). అది చాలదూ రేపటి గురించి స్పష్టమైన ప్రణాళికలు వేసుకోడానికి.

సంవత్సరానికోసారి ప్రభుత్వాలు ఆర్థిక బడ్జెట్ వేసుకుంటాయి. రాబడి, కర్చుల మీద ఒక అంచనాకొస్తాయి. డబ్బు కన్నా విలువైనది జీవితం. జీవితం లోని విలువైన సమయం కర్చు పెట్టేప్పుడు, మరింత అప్రమత్తంగా ఉండాలి కదా మనం! ఒక్క క్షణం చేజారినా తిరిగి రాదు. తరిగే ఆయుష్షును మనం పునరుద్ధించుకోలేం. కాని మన నియమిత ఆయుష్షులోని ప్రతి క్షణాన్ని అద్భుతంగా వినియోగించుకోడం మన మీదే ఆధారపడి ఉంది. మన ప్రమేయం లేకుండా ఈ లోకం లోకి వచ్చాం. మన ప్రమేయం లేకుండానే లోకాన్నొదిలిపోతాం. మధ్యన ఉండే మన కాలాన్ని అర్థవంతంగా గడిపి ఈ లోకంలో మనదైన మార్క్ ను విడిచి వెళ్లాలి.

ఎందరో మహానుభవులు మనచేత వందనాలు పెట్టించుకునే స్థితికి చేరుకున్నది అలా జీవితాన్ని సఫలం చేసుకునే.

ఒక్కప్పటి భారతావనికి ఇప్పటి ఇండియాకి చాలా తేడా ఉండి. యువత వండర్స్ చేస్తోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్లో మన యువ పారిశ్రామికవేత్తలు కుబేరవారసులై విలాసపు నవ్వులు చిందిస్తున్నారు. బ్యాంకులో కొంత డబ్బు వేసుకుని ఊరట చెందే పెద్దలు, ఈనాడు ఆకాశహర్మ్యాలు నిర్మించి వ్యాపారాల్లో అగ్రగాములై అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నారు. స్త్రీలు అప్రతిహతంగా ఎదుగుతూ తమ సత్తా చాటుతున్నారు. ఆటల్లో, పాటల్లో, అన్నింట్లో అందరికీ ఆకాశమే హద్దయింది.

ప్రపంచం మొత్తం మన దేశ ఉన్నతిని కళ్లప్పగించి తెల్లబోతూ చూస్తోంది. దేశమంటే మట్టి కాదోయ్, మనుషులోయ్ అన్నాడు గురజాడ. వ్యక్తులందరి సమిష్టి ఎదుగుదల అలా దేశాన్ని మెఱిసే మేరువును చేసింది.

అర్ధరాత్రి పాత సంవత్సరపు డిసెంబరు 31 నుంచి కొత్త సంవత్సరపు 1 వ తారీకులోకీ హడావుడిగా, హంగామాగా ప్రవేశించి 2 వ తారీకు నుంచి సాధారణ జీవితంలోకి ఇమిడిపోయి, పొద్దున్న లేవడం -రాత్రి పడుకోవడం అంతే కదా జీవితం అనుకునే వాళ్లగురించి మనకు అనవసరం. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీ శ్రీ ఎప్పుడో అన్నాడు. ఆలోచనలు ఉడిగిపోతే, ఎదుగుదల ఒరిగిపోతుంది.

మనకు కొత్త సంవత్సరపు తాత్కాలిక తీర్మాణాలేంవద్దు, పాతను సమీక్షించుకుందాం.మనను మనం ఉన్నతంగా, ఉత్తమంగా తీర్చిదిద్దుకుందాం. ఎందుకంటే ఇది మన జీవితం. మెరిసినా, విరిసినా మనమే!

ప్రతి సంవత్సరం ఒక మెట్టనుకుంటే మనం పైకి- పైకి- పైపైకి ఎక్కి ఒకనాటికి ఆకాశాన్ని చుంబించే స్థాయికి చేరుకోవాలి. వ్యక్తిగా జీవిత సాఫల్యం అదే. అందరూ సాధించాల్సిందీ అదే!

మన గోతెలుగు పాఠకులకి జీవితం విలువ తెలుసు, ఎలా పరిపూర్ణంగా, అర్థవంతంగా జీవించాలో తెలుసు అందుకే కొత్త మెట్టెక్క బోతున్నవాళ్లకి ప్రత్యేకంగా:

"విష్యూ ఎ హాప్పీ  అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2018"

గోతెలుగు పాఠక రచయిత

మరిన్ని వ్యాసాలు