కొత్తగా వచ్చిన ముని: ఏమిటా కూతలూ, కేకలూ, ఒక్క సారిగా శతమర్కటాలు మన మీద దాడి చేయబోతున్నాయా?
పాత ముని: ఆ పక్కన బ్రహ్మచారుల ఆశ్రమం వుందిలే!!
**************
శివానందయ్య: మీ అందరూ వొట్ఠి చింతమొద్దులు. తెలివైన వాడు ఒక్కడున్నాడా అంటే లేదు... మీ గురువు ఎవరయ్యా?
శిష్యులు: పరమానందయ్య గారు!!
**************
పంచ తులసమ్మలలో ఒక తులసమ్మ: ఏమిటీ... వనమంతా గాలిస్తున్నట్లున్నావ్?
రెండో తులసమ్మ: గంజాయి మొక్కలేమైనా మొలిచాయా... పీకేద్దామనీ!!
**************
ఒక చిలక: నువ్వేమీ తినవా? నిన్నే జనం తింటారా?
రెండో చిలక: ఔను.. నేను పంచదార చిలకని!!
**************
ఒక పౌరుడు: ఇంత పెద్ద మానవాహారం దేనికి?
రెండో పౌరుడు: రాజ్యపాలనకి నిరసనగా, రాజ్య పాలనని స్థభింభ చేయడానికి!!
మూడో పౌరుడు: మరి, మానవాహారం లో రాజు, మంత్రి, సేనాధిపతి కూడా చేతులు కలిపారే?
నాలుగో పౌరుడు: రాజ్య పాలనని స్థంభిభ చేయడానికని చెప్పాగా?
**************
దేవలోకం లో ఒక నగరం లో :
యక్షుడు: షడ్రసోపేతమైన భోజనం వండమని, నలభీముల్ని రప్పించాం గదా? వంట వండారా?
కిన్నెరుడు: వంట ఎప్పుడో పూర్తయింది!
యక్షుడు: ఆలస్యం దేనికీ... విస్తళ్ళు పరిచి వడ్డించరేం?
కిన్నెరుడు: వడ్డించడానికేం మిగిలింది గనక?
యక్షుడు: ఏవైంది?
కిన్నెరుడు: వంట , పూర్తవగానే, నలుడికి కొంతపెట్టి, తక్కిందంతా తను తిని, భీముడు పాకశాల ఖాళీ చేసి వెళ్ళిపోతేనూ!!
**************
పౌరుడు: నిన్నటిదాకా సిం హాసనం మీద కూర్చుని రాజ్యమేలిన రాజువి, చిలుక జోస్యం చెబుతూ పొట్ట పోసుకుంటున్నావే?
చిలుక జోస్యు డు: గ్రహస్థితి మారిందని ఒక చిలుక జోస్యుడు చెప్పాడు!
పొరుడు: ఎవరా చిలుక జోస్యుడూ?
చిలుక జోస్యుడు: అతడే ఈ రోజు సిం హాసనమెక్కి మన రాజ్యాన్ని ఏలుతున్నాడు!!
**************
పరిచారిక: రాజుగారి పక్కన నిలబడి వింజామర వీచే కన్యని ఉద్యోగం నుంచి తొలగించారటగా... ఎంచేత?
మరో పరిచారిక: వింజామర వీస్తూ, తూగి రాజు గారి భుజం మీదికి వాలిందట! రాణీ గారికి కోపమొచ్చింది!!
**************
పౌరుడు: మంత్రి గారు తలపాగా పెట్టుకోకుండా కొలువుకొచ్చారే?
ఇంకోపౌరుడు: రాజుగారి కిరీటాన్ని మరమ్మత్తు చేయడానికి కంసాలికిచ్చారటలే!
పౌరుడు: నేనడిగిన ప్రశ్న వేరు!
ఇంకోపౌరుడు: అర్ధమైందిలే... మంత్రి గారి తలపాగా ని రాజు గారు పెట్టుకున్నారు!!
**************
మంత్రి: విదూషకుడు చెప్పిన కథ నచ్చక , రాజు గారు విదూషకుడ్ని శిక్షించారా? ఏం కథ చెప్పాడు?
ఉప మంత్రి: అనగనగా ఒక రాజు... ఆ రాజుకి ఏడుగురు కొడుకులు... ఏడుగురు కొడుకులు వేటకి వెళ్ళి... ఏడు చేపలు తెచ్చారు.." రాజు గారికి తిక్కరేగింది!
మంత్రి: మంచి కథనే...!
ఉప మంత్రి: ఆ కథని రాజుగారికి చెప్పడం ఇది పదకొండోసారట!!