విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

malaysia tourism

పినాంగ్ ( మలేషియ )

‘ పినాంగ్ ‘ అంటే పోకచెట్టు అని అర్దం . ఈ ద్వీపం పోకచెట్టుని పోలి వుంటుంది కాబట్టి యీ ద్వీపానికి ఆ పేరు వచ్చిందని కొందరంటే కాదు యీ ద్వీపంలో పూర్వకాలంలో పోకచెట్లు వుండేవని అందుకనే యీ ద్వీపానికి ఆ పేరువచ్చిందని మరికొందరు అంటారు . అయితే యిప్పడు మాత్రం యీ ద్వీపంలో ఒక్క పోక చెట్టుకూడా లేదు . దీనిని ‘ పులావ్ పినాంగ్ ‘ అంటారు పులావ్ అంటే మలయ భాషలో ద్వీపం అని అర్దం .

పినాంగ్ ద్వీపం మనం ముందుగా చెప్పుకున్నట్లు ఆంగ్లేయులచే కనుగొనబడింది . ఇక్కడ వాతావరణం నచ్చడంతో ఆంగ్లేయులు 1786 లో ఫ్రాన్సిస్ లైటు ఆధ్వైర్యంలో ఈష్ట్ యిండియ కంపెనీ స్థాపించడానికి యీ ద్వీపాన్ని లీజుకి తీసుకున్నారు . ఆంగ్లేయులు యిక్కడ కోట నిర్మాణం చేసుకొని నివశించసాగేరు . ఇప్పటికీ యీ కోటను , కోట ముందర  ‘ ఫ్రాన్సిస్ లైటు ‘ విగ్రహాన్ని చూడొచ్చు .

కొండలు , నదులు ‘ అడవులతో కూడుకొని పచ్చగా వుండే యీ ద్వీపం యెప్పుడూ పర్యాటకుల దృష్టి లో మొదటి స్థానంలో నిలిచింది . మన దేశంలో మాల్స్ కల్చరు రాకముందే యిక్కడ యెక్కువ సంఖ్యలో మాల్స్ వుండేవి . జార్జ్ టౌను , బాతు ఫిరంగి , గుర్ని మొదలయిన చిన్నచిన్న గ్రామాలున్న ద్వీపం . అయితే మనకి మొత్తం పినాంగ్ అంతా ఒకే వూరనే భావన కలుగుతుంది . మన దేశం లో కూడా పట్టణాలు చుట్టుపక్కల వున్న గ్రామాలను కలుపుకొని మహానగరాలుగా మారినట్లే యిక్కడకూడా అన్నమాట .

ఈ ద్వీపం లో భారత , చైనా దేశస్థులు యెక్కువశాతం వున్నారు . బ్రిటిష్ పాలకులు చైనా , భారతదేశాలకు చెందిన మత్సకారులను యీ ద్వీపం నివాసయోగ్యంగా మార్చడానికి  పిలచి యెవరెంత నేలను బాగు చేసుకుంటే అది వారికి చెందుతుందని చెప్పేరని , దాని ఫలితంగా వలస కార్మికులు యీ ప్రదేశాన్ని బాగుచేసుకొని నివశించసాగేరని అంటారు . ఇక్కడ చైనా , భారతదేశ పౌరులు యెంతో కలసికట్టుగా వుండడం కనిపిస్తుంది . ముఖ్యంగా యిక్కడి స్థానిక హిందువులు జరుపుకొనే ’ తైపూసం ‘ కి కావలసిన యేర్పాట్లలో చైనా వారు పాల్గొనడం విశేషం .

పినాంగ్ లో హిందూమందిరాలు , చైనా మందిరాలు , ముస్లిం ప్రార్ధనా మందిరాలు అనేకం వున్నాయి .

ఇప్పుడు అన్ని మాల్స్ లోనూ మనకి కావలసిన వస్తువులు దొరుకుతున్నాయి కాని అప్పట్లో పప్పులు , బియ్యం కూరలు దొరికేవి కావు  , వాటికోసం మేం యిండియన్ మార్కెట్టుకి వెళ్లవలసి వచ్చేది . అలాంటి షాపులన్నీ జార్జి టౌను లోని లిటిల్ యిండియా ప్రాంతం లో   తమిళ మలేషిన్ల చే నడపబడుతుండేవి . బట్టల దుకాణాలు , టైలరింగు షాపులు వుంటాయి . అక్కడే చిన్నచిన్న యిండియన్ రెష్టాంటులు , టఫిన్స్ అమ్మే బండీలు వుంటాయి .

అక్కడే హిందూ మందిరం ‘ మారియమ్మ కోయిల్ ‘ వుంది . మారియమ్మ అంటే పార్వతీదేవి , పార్వతీదేవి మందిరం అన్నమాట . మందిరం వున్న ప్రాంతాన్ని క్వీన్స్ స్టీట్ అని అంటారు .

1800 సంత్సరంలో నిర్మించబడిన మందిరం . దీనిని UNESCO వారు సంరక్షిత మందిరంగా గుర్తించేరు .

మారియమ్మ అంటే గ్రామదేవత అని చెప్పుకోవచ్చు . ఈ కోవెలలో పూజలు అన్నీ ఆగమశాస్తప్రకారం జరుగుతాయి . ప్రొద్దున్న 6 నుంచి 12-30 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 8 వరకు తెరచివుంటుంది . తమిళనాడు మందిరాన్ని పోలివుంటుంది , హిందువులతో పాటు చైనీయులు కూడా యీ మందిరంలో పూజలు చెయ్యడం చూసి ఆశ్చర్యపోయేం . ఇక్కడ అమ్మవారికి ఆరోగ్యం కోసం సౌభాగ్యంకోసం పూజలు నిర్వహిస్తారు .

ఈ కోవెలలో వినాయకుడు , కుమారస్వామి , శివుడు మొదలైన దేవుళ్లకు చిన్నచిన్న మందిరాలు వున్నాయి . ద్వజస్థంబం లోపల ప్రత్యేక పూజలప్పుడు భక్తులు కూర్చోడానికి వీలుగా మంటపం , మంటపం దాటేక గర్భగుడిలో అమ్మవారు సర్వాలంకారాలతో కళకళ లాడుతూ వుంటుంది .

ప్రతీ యింటిముందర చిన్న పాటి మందిరం , అందరూ వుపయోగించుకోగలిగినట్లు ఊదొత్తులు , అగ్గిపెట్టె వుండేవి . కొందరు ఊదొత్తులు వెలిగించేవారు . ఇలాంటివి ప్రతీ చైనీస్ యింటిముందు వుండేవి . మనం పెరట్లో తలసికోట పెట్టుకున్నట్లు వీరు యింటిముందు దేవుడిని పెట్టుకుంటారేమో ? , పళ్లు , కూల్ డ్రింకులు , చాక్లెట్సే కాక వండిన వెజ్ నాన్ వెజ్ పదార్ధాలు కూడా అక్కడ పెట్టేవారు .  నైవేద్యం చేసినవి ప్రసాదంగా తీసుకెళ్లక అక్కడ యెందుకు వదిలేస్తున్నారో సందేహం , యెవరిని అడగాలన్నా మనుషులే కనిపించని చోట యెవరిని అడుగుతాం ? . ఏ దేవుడిని యింత భక్తి శ్రద్దలతో పూజిస్తునారు అనే కుతూహలంతో  వెళ్లి చూస్తే ఆ చిన్న మందిరంలో ఊదొత్తులు పెట్టుకొనే పాత్రతప్పమరేమీ లేదు . మా చైనీస్ మైడ్ ని ఆ మందిరం చూపించి అందులో యే దేవుడుని పూజిస్తారని అడిగేను . ఆమె “ ఛ దేవుడుకాదు దెయ్యానిదా ప్రదేశం “ అంది .

నైవేద్యాలు అవీ యెందుకు పెడుతున్నట్లు అని అడిగితే ఆమె సమాధానం బయట పెట్టిన పదార్ధాలు తిని సంతుష్టులైన దెయ్యాలు యింట్లో ప్రవేశించకుండా బయటకి వెళ్లిపోతాయట . చైనీయులలో మనకన్నా యెక్కువ మూఢనమ్మకాలున్నవారు అని అర్దం అయింది . పినాంగ్ లో చాలా చైనీస్ మందిరాలుండేవి వాటిలో యెవి దేవుళ్లవో యెవి దెయ్యాలవో అర్దమయేవికావు . ప్రతీ పదిహేను రోజులకి ఓ ఊరేగింపు జరిగేది . కాస్త పెద్దగా వుండే కోవెళ్లలో నిలువెత్తు ఊదొత్తులు అంటే సునాయాసంగా మూడు నాలుగు రోజులు యేకాద్రంగా వెలిగేవి వెలిగించి వుంచేవారు . మన బుర్రకథ హరికథ లను పోలిన కార్యక్రమాలు నిర్వహించేవారు . భాష తెలియకపోవడం వల్ల వారు చెప్తున్నదేమిటో మాకేమీ అర్దం కాలేదుకాని వారు పాడే ట్యూను , వేషం అంతా మన బుర్రకథను పోలి వుండటం మాకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలుగజేసింది . హరికథలాంటి వాటిలో యిద్దరు చిడతలు వాయిస్తూ కథ చెప్పడం ( మన కి హరిదాసు చిడతలు వాయిస్తూ ఒకరు మాత్రమే వుంటారు ) చూసేం .

పినాంగ్ రాష్ట్రం లో వున్న మరో ప్రధానమైన జిల్లా ‘ బయాన్ లెపస్ ‘ . ఈ జిల్లా ‘ సుంగై క్లువాంగ్ ‘ తీరానవుంది . సుంగై అంటే నది అని అర్దం . క్లువాంగ్ నదీతీరానవుంది . ‘ సుంగై దువ ‘ అంటే రెండునదుల సంగమం అని అర్దం . బయాన్ లెపస్ జిల్లాలో ముఖ్యంగా చూడదగ్గవి వార్ మ్యూజియం , మలేషియాలో అతి పెద్దదిగా చెప్పబడే ‘ క్వీన్స్ బె మాల్ ‘ , స్నేక్ టెంపుల్  .

క్వీన్స్ బె మాల్ చాలా పెద్దది , విండో షాపింగ్ కి చాలా అనువుగా వుంటుంది . ఇప్పడంటే మాల్స్ అంటే బోరుకొట్టేయిగాని అప్పట్లో వారానికి ఒకసారైనా వెళ్లకపోతే మాకు తోచేదికాదు .

స్నేక్ టెంపుల్ —-

సులువుగా ఆంగ్లంలో స్నేక్ టెంపుల్ గా పిలువబడుతున్న యీ మందిరాన్ని స్థానిక భాషలో ‘ తొకోంగ్ ఉలర్ ‘ గా పిలుస్తారు . ‘ ఉలర్ ‘ అంటే పాము అని అర్దం లెండి . ప్రంచంలో  బతికున్న పాములకి మందిరం వున్నది యిదొక్కటేనేమో ? .

బతికున్న పాముల మందిరం అంటే పాములు అద్దాల పెట్టెలలో పెడతారా ? అని అడిగితే లేదు ఫ్రీగా తిరుగుతూ వుంటాయని చెప్పడంతో పాములంటే సహజంగా వుండే భయం వల్ల చాలా రోజులు ఆమందిరం చూడ్డానికి వెళ్లలేదు . చాలారోజుల తరువాత యెలాగో ధైర్యం కూడదీసుకొని వెళ్లేం .

మందిరం మొత్తం చైనీ ఆర్కిటెక్చర్ తో నిర్మింపబడింది .  లోపల యెప్పుడూ ఊదొత్తుల , సాంభ్రాణి పొగలతో నిండి వుంటుంది . బతికున్న పాములు , మంచి జాతి విష సర్పాలు మెల్లమెల్లగా కదులుతూ గర్భగుడిలో వున్న విగ్రహాలమీద పాకుతూ కనిపించేయి . మందిరం లో వున్న చైనీయులు పాములు కుట్టవని , యిప్పటి వరకు యెవరినీ కుట్టలేదని చెప్పినా జాగ్రత్తగా చూసుకుంటూ మందిరం లోంచి బయటకి వచ్చేం . లోపల అక్కడక్కడ పాములు చాలా విషపూరితమైనవని , వాటిని తాకడం , శరీరం పైన వుంచుకోడం గాని చెయ్యకూడదనే హెచ్చరికలు కనిపించేయి .

ఈ మందిరాన్ని 1850 లో ‘ ఛోర్ సూ కొంగ్ ‘ అనే బౌద్ద భిక్షువు జ్ఞాపకార్దం నిర్మించేరు . 960 —- 1279 మధ్యకాలంలో చైనాను పరిపాలించిన ‘ సోంగ్ ‘ రాజుల కాలంలో ‘తన్ ‘ వంశంలో జన్మించిన ‘ కొంగ్ ‘ బౌధ్ద ధర్మాలను నియమనిష్ఠలతో పాఠిస్తూ పాముల  కొసం నివాసాలను యేర్పరుస్తూ వాటి సేవచేస్తూ కాలంగడిపే వాడట . అతని 65 వ యేట అతను మరణించేడుట , మరణానంతరం అతని సేవలను గుర్తించి అతనికి ‘ ఛోర్ సూ ‘ అనే బిరుదుని యిచ్చేరు . జాతక కథలలో వున్నట్లు యితను కూడా రకరకాల జన్మలు యెత్తుతూ కష్టాలలో వున్న వారికి సహాయపడేవాడట . పినాంగ్ ద్వీపం లో యీ మందిరం నిర్మించిన తరువాత పాములు వాటంతటవే వచ్చి యీ మందిరం లో నివశించసాగేయట , వాటినే ‘ ఛోర్ సూ కొంగ్ ‘ అవతారంగా భావించి పూజిస్తూ వుంటారు . 

ప్రతీ సంవత్సరం చైత్ర శుక్ల షష్ఠి నాడు ‘ ఛోర్ సూ కొంగ్ ‘ జన్మదినంగా యిక్కడ ప్రత్యేక పూజలు జరుపుకుంటారు . ఈ పూజలకు థాయ్ వాన్ , సింగపూర్ , హాంగ్ కాంగ్ ల నుంచి అనేకమంది భక్తులు వస్తూ వుంటారు .

వచ్చేవారం మరికొన్ని మలేషియ సంగతులతో మీ ముందుంటానని మనవి చేసుకుంటూ శలవు .

మరిన్ని వ్యాసాలు