కొత్త కొత్త ఆలోచనలతో 2017లో ఏడాది కొత్త కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వారి కొత్త ఆలోచనలకు ప్రేక్షకుల బ్రహ్మరధం పట్టారు. న్యూ కాన్సెప్ట్‌తో ఈ ఏడాది వచ్చిన సినిమాలు చాలా వరకూ విజయం సాధించాయి. వాటిలో ముందుగా యూత్‌ని మెప్పించిన సినిమాగా 'అర్జున్‌రెడ్డి'ని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా చాటాడు. సందీప్ రెడ్డి వంగాకి డైరెక్టర్‌గా 'అర్జున్‌రెడ్డి' మంచి గుర్తింపునిచ్చింది. వివాదాలెలా ఉన్నా, ఈ సినిమా సాధించిన ఘనవిజయం తెలుగు సినీ పరిశ్రమకు కాసుల కనకవర్షం పరంగా కొత్త ఉత్సాహాన్నిచ్చిందని చెప్పక తప్పదు. ఇంకో వైపున కొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రంగా 'ఘాజీ' గురించి చెప్పుకోవాలి. సబ్‌మెరైన్ గురించి సినిమా ఏంటని అందరూ ఈ సినిమా డైరెక్టర్ సంకల్ప్‌ని తొలుత ఆటపట్టించారట. బడ్జెట్ గురించి భయపెట్టేశారట. కానీ రిస్క్ చేశాడు. ఆశించిన స్థాయి విజయం దక్కించుకుని, విమర్శకుల ప్రశంసలందుకుంది 'ఘాజీ'. సినిమా కోసం వేసిన సబ్‌మెరైన్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారంటే దర్శకుడి విజన్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ యంగ్ డైరెక్టర్ న్యూ అటెంప్ట్‌ని వచ్చిన ప్రశంసలు ఎంతో ప్రత్యేకం. ఇంకో వైపున కొత్త రక్తం నుంచి వచ్చిన సినిమాలు కొన్ని ఆశించిన విజయాల్ని అందుకోకపోయినా యంగ్ టాలెంట్ సినీ పెద్దల దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు.
అలాగే, యంగ్ హీరోలు ఈ ఏడాది సత్తా చాటారనే చెప్పుకోవాలి. 'శతమానం భవతి' సినిమాతో హీరో శర్వానంద్ మంచి విజయం అందుకున్నాడు. 'రాధ'తో కొంత నిరాశ పరిచినా, తర్వాత వచ్చిన 'మహానుభావుడు'లో మళ్లీ హిట్ కొట్టాడు. ఇక నాని సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ ఏడాది మూడు సినిమాలతో దూసుకొచ్చాడు. హ్యాట్రిక్ కొట్టాడు. వరుసగా 'నేను లోకల్', 'నిన్ను కోరి', ఇటీవలే వచ్చిన 'ఎంసీఏ'తో హిట్స్ అందుకుని, బాక్సాఫీస్‌కి వసూళ్ల పంట పండించాడీ నేచురల్ స్టార్. అలాగే 'ఫిదా' సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సెన్సేషనల్ విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇయర్ ఎండింగ్‌లో రీ లాంఛింగ్ మూవీ 'హలో'తో వచ్చి అక్కినేని బుల్లోడు అఖిల్ సూపర్ అనిపించుకున్నాడు. యాక్టింగ్‌తో పాటు సింగింగ్, డాన్సింగ్, క్రికెట్ ఇతరత్రా టాలెంట్స్‌తో యువతను సరికొత్తగా ఎట్రాక్ట్ చేశాడు. మరికొందరు యువ హీరోలూ ఈ ఏడాది బాగానే సందడి చేశారు.
ఇకపోతే ఈ ఏడాది కొత్త భామలు కూడా బాగానే సత్తా చాటారు. వారిలో ముందుగా చెప్పుకోదగ్గది బ్యూటీ సాయి పల్లవి. 'ఫిదా' సినిమాతో నటనతో కట్టిపడేసిన ఈ బ్యూటీ 'ఎంసీఏ'తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని వారెవ్వా అనిపించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ నటనతో పాటు చదువుని కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఇటు సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, పట్టుదలతో ఉన్నత చదువులు కొనసాగిస్తూ యూత్‌కి తన వ్యక్తిగత జీవితం ద్వారానూ మంచి సందేశాన్నిస్తోంది. ఆ తర్వాత అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు తాము ఎంచుకున్న యాక్టింగ్ రంగంలో డెడికేషన్‌తో పని చేసి, సీనియర్ హీరోయిన్స్‌కి గట్టి పోటీనిస్తున్నారు. నటనలో భాష కీలకమైందని భావించి, తెలుగు నేర్చుకుని, తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకున్నారు.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే చెప్పాలి. ఏడాది చివర్లో విడుదలైన 'హలో' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శన్. తొలి సినిమాకే నటనలో వందకు వంద మార్కులేయించేసుకుంది. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మెహ్రీన్ ఈ ఏడాది సంఖ్యా పరంగా, హిట్స్ పరంగా సత్తా చాటింది. ఇలా 2017 సంవత్సరానికిగానూ యంగ్ డైరెక్టర్లూ, యంగ్ హీరోలూ, యంగ్ హీరోయిన్లూ రేసులోకి కొత్త కొత్తగా బుల్లెట్ స్పీడుతో దూసుకొచ్చి సక్సెస్, ఫెయిల్యూర్ అనే డిఫరెన్స్ లేకుండా సత్తా చాటారు. యూత్‌కి ఇన్స్‌ప్రేషన్‌గా మారారు.