విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

malaysia tourism

పినాంగ్ ( మలేషియ )

ఇవాళ పినాంగ్ వాతావరణం యెలా వుంటుందో తెలుసుకుందాం . ఈ ద్వీపంలో ప్రతీ రోజు సాయంత్రం వాన పడుతుందంటే ఆశ్చర్యం కదూ కాని యిది నిజం . గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు కన్నా యెక్కువకి చేరుకోవు , కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలకు తక్కువకావు . రోజూ వాన పడడం వల్ల పొల్యూషన్ కూడా చాలా తక్కువగా వుంటుంది .

పినాంగ్ లో తప్పకుండా తినవలసిన పండ్లు చిన్న అరటిపండ్లు , రంబుతాన్ ( లీచీ రకం ) పండ్లు .

ఆటూపోటూ సమయంలో సముద్రం ఓ కిలోమీటరుమేర లోపలికి వెళ్లిపోయేది . ఆ సమయంలో చాలామంది చేతులతో జలచరాలను పట్టుకొని బుట్టలలో వేసుకోడం యెంతో ఆశ్చర్యంగా చూసేదానిని . ఇక్కడ వీరు సముద్ర ప్రాణులు యేవైనా తినేవారు . అలాగే పేక్డ్ ఫుడ్ కొనాలంటే బిస్కెట్స్ అయినా సరే అందులో వాడిని పదార్ధాలను జాగ్రత్తగా చదివి కొనుక్కోవాలి , యిక్కడ వాళ్లకి వెజిటేరియన్ అంటే యేమీఅర్దం కాని పరిస్థితి , బిస్కెట్స్ , చాక్లెట్స్ లో కూడా సముద్రచరాలుకాని భూ చరాలు గాని వుండి తీరుతాయని అక్కడకి వెళ్లేక తెలిసిన నిజం . సాధ్యమైనంత వరకు పప్పో బియ్యమో పేకెట్స్ తప్ప వేరేవేవీ ముట్టుకోకపోవడం మంచిదని తెలుసుకున్నాం .

మద్యం షాపులు చాలా అరుదుగా వుంటాయి , మలేషియన్లు మద్యం ముట్టుకో కూడదు , పొగ త్రాగకూడదు అనే నియమం వుంది , అందువల్ల మలేషియన్ ముస్లిములు యీ రెండూ ముట్టుకుంటే కఠిన మైన శిక్షలు వుంటాయి . అలాగే ముస్లిం లకు యీ పదార్ధాలు అమ్మిన వారిపై కూడా కఠిన చర్యలు వుంటాయి .

స్త్రీలు బురఖా వేసుకోకపోయినా ఒళ్లుకనబడకుండా బట్టలు కట్టుకొని తల పూర్తిగా స్కార్ఫ్ తో కప్పుకుంటారు . చిన్నచిన్న బట్టలలో చైనీయులు తిరుగుతూ వుంటారు . సాయంత్రం ఫుట్పాత్ మీద స్టాల్స్ తయారయిపోయేవి . కుర్చీలు బల్లలు , టివి అన్నీ పగలంతా ఫుట్పాత్ మీదే వుండేవి సాయంత్రం అయేసరికి తినడానికి వచ్చిన మనుషులతో హడావిడిగా వుండేవి , రాత్రి పది అయేసరికి ఫుట్పాత్ మీద బల్లలు కుర్చీలు టివి మాత్రమేమిగిలేవి . మనదేశంలో  అలా వదిలేస్తే మర్నాటికి తుడిచి పెట్టెస్తారు , టీవి కూడా యెత్తుకు పోతారు , లేకపోతే ఓ రాయి విసిరి పగలకొడతారు . కాని యిక్కడ ప్రతీ కార్నరులోనూ యిలాంటి రాత్రి ఫుట్ పాథ్ భోజనశాలలు వుండేవి . వీటిలో భోజనం చాలా తక్కువ ధరలో వుంటాయట , చాలా మంది యిక్కడే తినేవారు . ఇంట్లో వండుకుంటారా ? అని మమ్మలని చూసి అక్కడి వారు ఆశ్చర్య పోయేవారు . అక్కడ తొంభైశాతం మంది యిలాంటి చోట్లల్లో తింటారు యిళ్లల్లో వండుకోడం యే పండగలకో పున్నాలకో మాత్రమే .
           పిడకల వేట లో పడిపోయేను సరే అసలు కథలో కొద్దాం . ఈ ద్వీపం లో చిన్నచిన్న గుట్టలు , యెత్తైన పర్వతాలు తో పాటు అడవులు , నదులు , సరస్సులు , జలపాతాలు కూడా వున్నాయి . ఓ పాటి యెత్తున్న గుట్టలని పార్కులుగా తీర్చిదిద్దుకున్నారు . స్థానిక భాషలో  గుట్టలని ‘బుకిత్ ‘ అనేవారు . ‘ తమన్ ‘ అంటే ఉద్యానవనం . ఇలాంటి బుకిత్ తమన్ లు చాలానే వున్నాయి .

పినాంగ్ లోని మరో హిందూ మందిరం గురించి చెప్పుకుందాం . ఈ మందిరం కుమారస్వామి మందిరం . బయటి దేశాలలో వున్న అతి పెద్ద మురుగన్ కోవెలగా దీనిని చెప్తారు . దీనిని ‘ అరుళ్ మిగు బాల దండాయుధపాణి ‘ మందిరం అని అంటారు .

ఈ మందిరం నిర్మించిన సంవత్సరానికి సంభందించిన సాక్షాలు దొరకక పోయినా యీ మందిరం సుమారు 1782 నుంచి వున్నట్లు ఆనవాళ్లు లభించేయి . 1800 సంవత్సరంలో ఆంగ్లేయులు ఓ జలపాతం వద్ద చిన్న కుమారస్వామి మందిరాన్ని కనుగొన్నారు . ఇప్పటికీ యీ మందిరంలో 1856 లో ఆంగ్ల చిత్రకారుడు చిత్రించిన అప్పటి మందిర చిత్రాన్ని చూడొచ్చు .

ప్రస్తుతం వున్న మందిరం యేడంతస్థుల గోపురంతో రెండు భాగాలుగా నిర్మింప బడ్డ మందిరం యిన్ని వందల సంవత్సరాలలో యెన్నో సార్లు మరమ్మత్తులు చేయడం , పూర్తిగా మందిరాన్ని మార్చడం జరిగిన తరువాత యీ విశాల మందిరం తీర్చదిద్దబడింది .

ముందుగా నేను చెప్పినట్లు యీ మందిరాన్ని జుపాతం వద్ద నిర్మించేరు 1892లో యిక్కడ రిజర్వాయర్ నిర్మించదలచినప్పుడు యీ మందిరాన్ని యిక్కడ నుంచి మార్చవలసి వచ్చింది . కొత్త మందిర నిర్మాణం కొండపైన కట్టడానికి తీర్మానం జరిగింది . 1915 లో కొండపైన కట్టిన మందిరానికి మూల విరాట్టుని తరలించేరు . 1915 లోనే యిక్కడ థైపూసం ఉత్సవాన్ని మొదటిసారి నిర్వహించేరు . 1985 లో వున్న మందిరాన్ని పెద్దది చెయ్యాలనే ముఖ్య వుద్దేశ్యంతో మరమ్మత్తులు చేపట్టేరు . ఏడంతస్థులగోపుర నిర్మాణం జరిగింది , మందిరం చేరుకోడానికి రోడ్డు మార్గమే కాకుండా 513 మెట్లతో కూడిన నడక దారికూడా వుంది . జనలపాతం అందాలని , దట్టమైన అడవి అందాలను చూస్తూ వెళ్లడానికి రెండంచలుగా వెళ్లే బండి యేర్పాటు కూడా వుంది .

1985 లో ఏడంతస్థుల గోపురనిర్మాణానంతరం అదే సంవత్సరం కుంభాభిషేకం నిర్వహించేరు . 2006 లో  మందిరానికి సుమారు 30మీటర్ల యెత్తులో మరో మందిర నిర్మాణం చేపట్టి 2012 లో పూర్తిచేసేరు . మండపం లో పాలరాతి పలకలు పరిచి మందిరాన్ని యెంతో సుందరంగా తీర్చిదిద్దేరు . 2012 లో 1.6 టన్నుల బంగారంతో చేసిన రథం మనదేశంలో తమిళనాడులో తయారుచెయ్యబడిన ముక్కలు జోడించి పినాంగ్లో వాటిని రథంగా మలిచి మొదటిసారి అదే సంవత్సరం ‘ థైపూసం ‘ పండగలో వేలాయుధాన్ని వూరేగించేరు. అదే సంవత్సరం మహాకుంభాభిషేకం నిర్వహించేరు .

కొండ మీదకి నడక దారిలో వెళ్లినా , కారులో వెళ్లినా అందమైన అనుభూతిని సొంతం చేసుకోడం ఖాయం . బండి మీద వెళ్లే అనుభూతి మరోరకం యేటవాలుగా వున్న పట్టాలుమీద పెద్దపెద్ద కేబుల్స్ ద్వారా లాగబడే బండి , దట్టమైన అడవుల గుండా , జలపాతాన్ని దాటుతూ వెళ్లే ఆ అనుభూతేవేరు . అందుకే మా యింటికి వచ్చే అథిధులకి ఆ అనుభూతిని అందించే వారం . పూర్తిగా ద్రవిడ శిల్పకళ తో కట్టిన మందిరం తమిళనాడు లో వున్న అను భూతిని కలుగ జేస్తుంది . నవగ్రహమందిరం , వినాయక మందిరం , నాగరాజమందిరం , శివకోవల యీ ప్రాంగణం లో వున్నాయి . పరిసరాలు , మందిరం చాలా ప్రశాంతతను కలుగజేస్తాయి . ఇక్కడ నిర్మించిన సుమారు 8.5 మీటర్ల శివ విగ్రహం ప్రత్యేకంగా వుంటుంది .

కొత్త మందిర నిర్మాణం కొండపైన జరిగినా యింకా జలపాతం దగ్గర పాత మందిరాన్ని అలాగే వుంచేరు .

ఈ మందిరం గురించి చెప్పుకున్నప్పుడు చాలా సార్లు ‘ థైపూసం ‘ గురించి చెప్పుకున్నాం . ఇప్పుడు థైపూసం అంటే యేమిటి? మలేషియన్ హిందువులు యెలా జరుపుకుంటారో తెలుసుకుందాం . తమిళ నెలల ప్రాకారం మాఘ పౌర్ణమి కి ( జనవరి 15 నుంచి వారి థై మాసం మొదలవుతుంది ) పున్నమి నాడు పుష్యమి నక్షత్రం లో వస్తుంది ఆరోజును ‘. థైపూసం (థై + పుష్యం ) గా అన్జని కుమారస్వామి మందిరాలలోనూ జరుపుకుంటారు  . ఇది మొత్తం 18 రోజులు జరుపుకొనే పండగ . దేవీ భాగవతం , శివపురాణం ప్రకారం రాక్షససంహారణార్దం కుమారస్వామి జననం జరిగేక అతనికి ఆయుధాన్ని సృష్టించేపనిలో ఆది పరాశక్తి తనలోని శక్తులను రోజుకొకటి చొప్పున వేలాయుధం లో నిక్షిప్తం చేసి కుమారస్వామికి థైపూసం నాడు అందజేస్తుంది . కుమారస్వామికి ఆదిపరాశక్తి శక్తివంతమైన ఆయుధాన్ని సమర్పించిన రోజుని తమిళనాడు ప్రజలు యెంతో భక్తి శ్రధ్దలతో జరుపుకుంటారు . పినాంగ్ లోని హిందువులు యెలా జరుపుకుంటారో తెలుసుకుందాం .

థై పౌర్ణమికి పద్దెనిమిది రోజులముందు ‘ క్వీన్స్ స్ట్రీట్ లో వున్న ‘ మారియమ్మ ‘ మందిరంలో కమారస్వామి ఆయుధమైన ‘ వేలాయుధాన్ని ‘ వుంచి రోజూ పూజలు నిర్వహిస్తారు .  థైపూసానికి రెండు రోజుల ముందు ‘ జలాన్ కెబున్ బుంగ ‘ లో వున్న వినాయక మందిరానికి తెస్తారు . థైపూసం రోజు వినాయక మందిరం నుంచి వూరేగింపుగా ‘ మారియమ్మన్ ‘ కోవెలకు తీసుకు వచ్చి పూజలు నిర్వహించి బంగారు రథం లో వేలాయుధాన్ని వుంచి వూరేగింపుగా తీసుకువెళ్లి మలై మందిరం లో వుంచుతారు . మలేషియ దేశం థైపూసం దినాన్ని శలవు దినంగా ప్రకటించింది . ఆ రోజు భక్తులు కావిళ్లు మొయ్యడం ‘ శరీరం లో యినుప హుక్కులు బిగించుకొని రథాలను లాగడం , కొరడాలతో కొట్టుకోడం లాంటి మొక్కులు తీరుస్తూ వూరేగింపులో వెళతారు . భక్తులకు అన్నపానీయాలు ఉచితంగా అందించడంలో హిందువులతో సమానంగా చైనీయులు పాల్లొంటారు .

థైపూసం నాడు కుమారస్వామి వేలాయుధాన్ని పొందిన రోజు , వైశాఖ విశాఖం నాడు ( వైశాఖ మాసంలో పౌర్ణిమ విశాఖ నక్షత్రం లో వుంటుంది ) కుమారస్వామి జన్మించిన రోజుగా భావిస్తారు .         ఈ మందిరం లో థైపూసం , చిత్తర పూర్ణం ( చైత్ర పూర్ణిమ ) , వైశాఖ వాశాఖం , కాంత షష్ఠి , పెరియకార్తిఘై , ఆడి పూర్ణిమ ( ఆషాఢ పూర్ణిమ ) రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .

ఈ థైపూసం యాత్రకి కావలసిన ఆర్ధిక సహాయం చైనీయులువఅందిస్తారు .

ఈ మందిరం వున్న ప్రదేశం మంచి పిక్నికి స్పాట్ కూడా , చిన్నచిన్న ట్రెక్కింగులు చేస్తూ పగలంతా సరదాగా గడిపే వసతులు వున్నాయి .
పినాంగ్ లో వున్న మరో అహ్లాదకరమైన పిక్నిక్ స్పాట్  ‘ ఎయిర్ హితేమ్ ‘ . మలయభాషలో ‘ ఎయిర్ అంటే నీరు  హితేమ్ అంటే ఆకుపచ్చ అని అర్దం . అక్కడినీటిలో చుట్టుపక్కల వున్న చెట్ల రంగు ప్రతిఫలించి నీరు ముదురు ఆకు పచ్చ రంగులో వున్న బ్రమ కలిగిస్తుంది యీ రిజర్వాయరులోని నీరు . నిజానికి నీరు పాకు పట్టి అలా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది . కాని నీరు చాలా స్వఛ్చమైనవి , పినాంగు ద్వీపానికి యిక్కడనుంచే మంచినీటి సరఫరా జరుగుతుంది. రిజర్వాయరు మీద కట్టిన ఆనకట్ట మీద నడుస్తూ అవతల వొడ్డున వున్న అడవిలో పిల్లలకి ఆడుకోడానికి వీలుగా పార్కు కట్టేరు . యేకాలమైనా యెండ పడకుండా చల్లగా వుండటం వల్ల సీజను తో సంభందం లేకుండా హాయిగా గడపొచ్చు . ఇక్కడ నేల తడితడిగా వుండి తరచూ వానపడుతున్నట్లు తెలుస్తూ వుంటుంది . ఈ ప్రదేశానికి వెళ్లేదారిలో ఓ కొన్ని గజాలమేర యేకాలమైనా యే సమయమైనా వానపడే ప్రదేశం , మేమెప్పుడు అక్కడనుంచి వెళ్లినా వాన పడుతూ వుండేది .

వచ్చేవారం పినాంగ్లో మరికొన్ని విశేషాలతో మీ ముందుటానని మనవి చేసుకుంటూ శలవు .

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి