న్యూ జనరేషన్‌ న్యూ సెన్సేషన్‌ - ..

new generation new sensation

'చిరునవ్వుతో..' సినిమాలో హీరో నేను వంటవాణ్ణి అని చెప్పుకుంటాడు. వంటవాణ్ణి అని చెప్పడం ద్వారా వంటోడి గొప్పతనాన్ని హీరో క్యారెక్టరైజేషన్‌ ద్వారా ఎంతో బాగా చెప్పారు ఆ సినిమాలో. వంటోడు అంటే సిగ్గుపడాల్సిన రోజుల పోయాయిప్పుడు. వంట అనేది ఓ ప్రొఫిషన్‌. దాన్ని మనం ఎంత గొప్పగా భావిస్తే, అందులో అన్ని గొప్ప గొప్ప అద్భుతాలు సృస్టించొచ్చు. నేటి తరం యువత కొత్త కొత్త ఫుడ్స్‌ని తినడానికి ఎంత ఇష్టపడుతున్నారో. వాటిని వండేందుకు అంతే ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్‌తో కొత్త కొత్తగా పుట్టుకొచ్చినవే మార్కెట్‌లో నోరూరిస్తున్న కొత్త రకం వంటకాలైనా, ఆకట్టుకునే కొత్త రకం రెస్టారెంట్లైనా. అలాగే వ్యవసాయ రంగాన్ని కూడా ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. వ్యవసాయంలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీని ఫాలో అవుతూ అత్యున్నత శిఖరాలను అందుకుంటున్నవారిని ఈ మధ్య చాలా మందినే చూస్తున్నాం. సమాజంలోని వివిధ సమూహాల నుండి ఉన్నత స్థాయికి వెళ్లినవారు ప్రతీ రంగంలోనూ ఉంటారు. ఓ కుగ్రామం నుండి వచ్చి, అంతర్జాతీయ స్థాయి నగరాల దాకా ఎదగడం ఓ ఎత్తు అయితే, అంత ఎదిగాక కూడా మళ్లీ తిరిగి సొంత ఊరి వైపు చూడాలనుకోవడం మరో ఎత్తు.

ట్రెండ్‌ మారింది. ప్రస్తుత జనరేషన్‌ చేస్తున్న ఈ తరహా ఆలోచనలతోనే గ్రామాల సంస్కృతీ సాంప్రదాయాలు జాతీయ స్థాయిలోనే కాక ప్రపంచ స్థాయిలోనూ గుర్తింపు దక్కించుకుంటున్నాయి. అత్యంత విలాసవంతమైన జీవితాలకు అప్పుడప్పుడూ బోర్‌ కొట్టేస్తుంటుంది. అలాంటి లైఫ్‌ నుండి ఒక్కోసారి కొంచెం బైటికి వచ్చి చూస్తే..ఏంటి? అనే దాని నుండి పుట్టిందే ఈ కొత్త తరం ఆలోచన. అమ్మమ్మలూ, బామ్మల కాలానికి వెళ్లి అప్పటి ఆహార రుచుల్ని, కట్టు, బొట్టు వంటి సాంప్రదాయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఈ తరం జనరేషన్‌. వెస్ట్రన్‌ ఫుడ్‌తో పాటు, బామ్మల కాలం నాటి వంటకాలను లొట్టలేసుకుంటూ లాగించేయడానికి బాగా ఇష్టపడుతోంది. ఆహార రుచులు, సంస్కృతీ, సాంప్రదాయాలే కాదు, వ్యవసాయ రంగం వైపు కూడా బాగానే యువత మొగ్గు చూపుతోందనే చెప్పాలి. అలా వారు చూపుతున్న ఆశక్తి నుండే హైటెక్‌ రైతులు పుట్టుకొస్తున్నారు. సాంప్రదాయ వంటకాలతో ఈ హైటెక్‌ జనరేషన్‌కి గ్రామీణ రుచుల్ని పరిచయం చేస్తూ ఎలాగైతే రెండు చేతులా సంపాదిస్తున్నారో, అలాగే వ్యవసాయ రంగంలోనూ కొత్త కొత్త ఆవిష్కరణలతో సులభతరమైన పద్ధతిలో వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ రకంగా వ్యవసాయం, వంట అనేవి ఏ మాత్రం తక్కువ కావనీ ఈ జనరేషన్‌ పీపుల్‌ నిరూపిస్తున్నారు.

టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ.. ఈ దశల్లోనే కొంతమంది ఈ తరహా ఆలోచనలు చేస్తున్నారు. తద్వారా నెక్ట్స్‌ జనరేషన్‌కి మార్గదర్శకులుగా మారుతున్నారు. 'యాపిల్‌ కాశ్మీర్‌లోనే ఎందుకు పండుతుంది..? ఇక్కడ ఎందుకు పండించలేము..? ఫలానా పండును విదేశీ మార్కెట్‌ నుండే ఎందుకు దిగుమతి చేసుకోవాలి..? మనమే దాన్ని పండించి, మన మార్కెట్‌లోకి తీసుకురావచ్చు కదా.. వెస్ట్రన్‌ రుచులకు అలవాటు పడిన వారిని మన రుచుల వైపు తిప్పుకోలేమా..? అనే ప్రశ్నలతోనే అసలు కథ మొదలవుతోంది. ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాల గురించి తెలుసుకోగలిగితే, వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు. భోజన ప్రియుల అభిరుచిని తెలుసుకోగలిగితే, లక్షలే కాదు కోట్లు గడించొచ్చు. డబ్బు సంగతి పక్కన పెడితే, గౌరవ ప్రదమైన భవిష్యత్‌ని అందుకోవచ్చు. వ్యవసాయం చిన్నదీ కాదు, వంట పనీ తక్కువదీ కాదు. చేసే పనిని గౌరవించడం, దానికి సాంకేతికను, కొత్త ఆలోచనల్ని మేళవించడమే ముఖ్యమిక్కడ. ఇది న్యూ జనరేషన్‌ చెబుతున్న హైటెక్‌ మాట. 

మరిన్ని వ్యాసాలు