సాధారణంగా, ఏవైనా శుభసందర్భాలలో , బహుమతులిచ్చి, మన అభిమానమూ, ఆత్మీయతా చూపించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది , ఎన్నో సంవత్సరాలనుండి… ఇదివరకటి రోజుల్లో, ఈ బహుమతుల ప్రకరణం , పుట్టినరోజులకి, ఇంట్లోవారికే పరిమితమయుండేది. గుర్తుందా, చిన్నప్పుడు మన పుట్టినరోజుకి , తలంటూ, కొత్తబట్టలూ, మహా అయితే సాయంత్రం ఓ సినిమా.. పిండివంటలతో భోజనం.. ఆరోజు మాత్రం ఎవరూ కోప్పడేవాళ్ళు కాదు.. కొన్నిరోజులకి, చదువుకునే స్కూల్లో, ఫ్రెండ్సందరికీ , ఏవో చాకొలేట్లు ఇవ్వడం ప్రారంభం అయింది..
కాలక్రమేణా పుట్టినరోజుసందర్భంగా, పెద్ద పెద్ద గెట్ టుగెదర్ ( Get together ) లూ అవీ మొదలయ్యాయి. వీటన్నిటినీ చేయడానికి ఈవెంట్ మానేజర్స్ ( Event managers ) రంగంలోకి దిగారు.. గిఫ్టులూ, ఆ గిఫ్టులిచ్చిన వారికి తిరిగి గిఫ్టూ ( Return Gift ).. సాధారణ మనిషికూడా, లక్షల్లో ఖర్చుపెట్టడానికి వెనకాడ్డంలేదు.. డబ్బున్నవాళ్ళ విషయం సరే.. డబ్బుందీ , తగలేయడానికి ఓ మార్గం.. కానీ మధ్యతరగతి వాళ్ళు కూడా, అప్పుచేసైనా సరే, తమ ( లేని ) గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికే తయారవుతున్నారు.. పుట్టినరోజులు చేసుకోవాలి వద్దనరెవరూ.. కానీ అదే పుట్టిన రోజుని, ఏ అనాధ శరణాలయంలోని పిల్లలతోనో, వృధ్ధాశ్రమాల్లోని వారితోనో చేసుకుంటే, కనీసం ఆ ఒక్కరోజుకైనా, వారి మొహాల్లో కనిపించే ఆనందం చూడొచ్చుగా.. అబ్బే ఎక్కడో , అక్కడక్కడ మాత్రమే ఇలాటివారు కనిపిస్తారు..
ఈ రోజుల్లో ఈ పుట్టినరోజు కార్యక్రమాలు చేయడానికి ఎన్నో ఎన్నెన్నో సంస్థలు వచ్చేసాయి.. దబ్బులుంటే చాలు.. మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇంక పెళ్ళిళ్ళైతే అడగక్కర్లేదు.. ఎదురు సన్నాహాలదగ్గరనుండి, కొత్త దంపతుల హనీమూన్ దాకా అన్నీ వాళ్ళే చూసుకుంటారు..
వీటితో ఎమౌతోందంటే, ఈరోజుల్లో ప్రతీదీ వ్యాపారాత్మకం అయిపోయింది… ఇదివరకటి రోజుల్లో ఉండే వ్యక్తిగత అభిమానాలూ, ఆత్మీయతలూ ఎక్కడా కనిపించడం లేదు. బహుమతులకే ప్రాధాన్యం ఉంటోంది. పైగా ఎవరిస్థోమత వారు చూపించుకోవడమే ముఖ్యంగా కనిపిస్తోంది… చివరకి జరుగుతున్నదేమిటంటే సంఘంలో పేరున్న వారు, ఈ పుట్టినరోజులు చెప్పుకుని, వారివారి పనులు చక్కబెట్టుకోవడం. ఏ పెద్దపదవిలోనో ఉన్నవాడు, పుట్టినరోజని చెప్పడం.. వారివలన పనులేమైనా చేయించుకోవలసినవారందరూ ఏదో ఒక బహుమతి ఇవ్వడం. పనిని బట్టి బహుమతి విలువ.ఇవన్నీ ఒక ఎత్తు..
ఈ రోజుల్లో ఇళ్ళల్లో ఉండే మనవళ్ళకీ, మనవరాళ్ళకీ, ఈ పుట్టినరోజు బహుమతులివ్వడం ఓ పెద్దపనైపోయింది. ఇదివరకటిరోజుల్లో ఇచ్చే బహుమతులకి ఈ రోజుల్లో ఎవ్వరూ విలువ ఇవ్వడం లేదు. ఏదైనా Electronic వస్తువు ఇద్దామా అనుకుంటే, వారి తల్లితండ్రులు ఏదో సందర్భంలో , మార్కెట్ లో లభించే ప్రతీ latest gadget అప్పటికే కొనేసుంటారు. అలాగే, పోనీ ఏదైనా indoor game ఇద్దామనుకున్నా అదే పరిస్థితి. పోనీ పుస్తకాలేమైనా ఇద్దామా అంటే , ఈరోజుల్లో కేజీ క్లాసుకొచ్చిన పిల్లవాడి దగ్గరనుండీ, ప్రతీవాళ్ళూ అదేదో KINDLE ట , దానికలవాటు పడిపోయారు. పుస్తకాలు చదివే అలవాటు బాగానే ఉంటోంది, కానీ Printed Book కాదు, అందరికీ digital edition మాత్రమే. ఏ గొడవా లేకుండా, హాయిగా ఏ Amazon నుండో ఓ Gift Voucher తీసికుని ఇచ్చేస్తే, వాళ్ళక్కావాల్సినవేవో వాళ్ళే కొనుక్కుంటారు… పోనీ ఇవైనా ఇదివరకటివాటిలా ఉంటాయా అంటే అదీ లేదూ… మనమే online లో డబ్బుకట్టేస్తే, బహుమతిగ్రహీతకి mail ద్వారా పంపెస్తారుట… శుభం..
ఈ సదుపాయాలన్నీ వినడానికి బాగానే ఉన్నాయి కానీ, స్వయంగా Gift wrap చేయించి, మనవడికో, మనవరాలికో చేతిలో బహుమతి అందించినప్పుడు, వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆ తళుక్కుమనే ఆ సంతోషం కోల్పోవడం లేదూ ?
పెద్దవాళ్ళు బహుమతులివ్వడం, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టించుకుని, మనసారా ఆశీర్వదించే ఆ మధుర క్షణాలు ఎక్కడికి వెళ్ళిపోయాయో మరి…అందరూ ఇచ్చిన బహుమతులు, అందరూ వెళ్ళిపోయాక, ఒక్కోప్పుడు ఆ ఇచ్చినవాళ్ళుండగానే, ఆ రంగు కాగితాలు చింపేస్తూ, లోపల బహుమతీ ఏముందో అని ఆత్రంగా, చూసినప్పుడు, తను ఆశించినదాన్నే చూడ్డంతో కలిగే, ఆ ఆనందం, ఈ online gift vouchers వలన వస్తుందంటారా?.. ఏదో “ఇచ్చినమ్మా వాయినం పుచ్చుకున్నా వాయినం “ అన్నట్టుగా ఉంటుంది కానీ, అలనాటి ఆత్మీయత, అభిమానం ఎక్కడా కనిపించడం లేదు..
సర్వేజనా సుఖినోభవంతూ…