చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

 సంఘంలో భాగ్యవంతులన్న వారు , ప్రతీదీ తమ దగ్గరుండే డబ్బుతో కప్పేయగల స్తోమత ఉన్నవారే… వాళ్ళేం చేసినా అదే ఫాషనైపోతుంది.. ఉదాహరణకి ,  ఈరోజుల్లో ఆడవారూ, మగవారూ ధరిస్తున్న దుస్తులే చూడండి.. ఒకానొకప్పుడు బట్టకి చిరుగు పడితే, ఏ అలుగ్గుడ్డగానో, ఏ స్టీలు సామాన్లవాడికో ఇచ్చేసేవారు.. అలాటిది ఈరోజుల్లో బట్టలకి ఎన్ని చిరుగులుంటే అంత ఫాషనుట..ధనవంతులు వెసికుంటే వాళ్ళు ఫాషన్ ఐకాన్ (  Fashion Icon )  గా ప్రసిధ్ధి చెందుతారు.. అదే ఏ బడుగుజీవో, మధ్యతరగతి మనిషో వేసికుంటే .. “ అయ్యో పాపం “ అనుకుంటారు.. ఎక్కడిదాకా వచ్చిందంటే , ఈ వేలం వెర్రీ, మాల్స్ లో ఈ చిరుగులున్న బట్టలుకూడా దొరకడం.. పైగా దుక్కలా ఉండే బట్టలకన్నా ఖరీదులు కూడా ఎక్కువే..

అసలు వచ్చిన గొడవంతా ఎక్కడంటే, మధ్యతరగతి వారు, వాళ్ళని పుటాలెసినా, వారి మనస్థత్వం మాత్రం ఛస్తే మారదు. మొహం చూడగానే తెలిసిపోతుంది—వీడిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని..పుట్టుకతో వచ్చిన బుధ్ధులు పుర్రె తోనే అన్నట్టుగా, వారు ఆర్ధికంగా ఎంత ఎదగనీయండి, బుధ్ధులు మాత్రం మాటిమాటికీ తొంగిచూస్తూంటాయి… ఉదాహరణకి ఏ  Exhibition  కైనా వెళ్ళారనుకోండి, అక్కడ ప్రదర్సించే  ప్రతీ తిండిపదార్ధాల స్టాళ్ళకీ వెళ్ళడం, వాళ్ళిచ్చే సాంపుల్ , వాడు ఇవ్వకపోయినా, రుచి పేరు చెప్పి , గుటుక్కున నోట్లో వేసికోవడం, కొనేదీ లేదూ పెట్టేదీ లేదూ, ఓ పది స్టాళ్ళకి వెళ్ళి , పది సాంపుల్స్ తీసికున్నా, పైసా ఖర్చులేకుండా, శనివారం ఫలహారం అయిపోయినట్టేగా..అలాగే అవేవో  Perfumes  అమ్మేచోట, చేతిమీదా ఆ సెంటేదో పూయించుకోవడం..

సీనియర్ సిటిజెన్లకిచ్చే రాయతీల ధర్మమా అని ఈమధ్యన చాలామంది, ఇదివరకటిరోజుల్లో రాత్రంతా బస్సుల్లోనె ప్రయాణం చేసినవారైనా సరే, హాయిగా రైళ్ళలో  AC 2, 3  లలోనే ప్రయాణాలు.. ప్రయాణ సాధనమంటే మారింది కానీ, మనస్తత్వం ఎక్కడకి పోతుందీ? రైలు ఏదైనా స్టేషన్ లో ఆగినప్పుడల్లా, బయతకి వచ్చి నుంచోడం, పక్కనే ఉండే జనరల్ బోగీలో ప్రయాణం చేస్తున్నవారికి చూపించుకోవద్దూ?.. సాధారణంగా ట్రైన్ కి ఆ చివరో, ఈ చివరో ఉంటూంటాయి ఈ   AC  బోగీలు.. పోనీ ప్లాట్ఫారాలకి మధ్యలో ఉండే ఏ పుస్తకాల షాప్పుకైనా వెళ్తాడా అంటే, భయం- తను వచ్చేలోపల ట్రైన్ కదిలిపోతే…

అవన్నీ రైళ్ళలో వెళ్ళేవాళ్ళు.  ఒకానొకప్పుడు విమానం చప్పుడు వినిపించగానే , ఇంటిబయటకి వచ్చి, ఆకాఆశంలోకి చూసే ప్రాణులందరూ , ఈరోజుల్లో ఏకంగా విమానాలే ఎక్కేస్తున్నారు.. విదేశాల కి వెళ్ళేటప్పుడు అయితే, ఎలాగూ తప్పదు, కానీ దేశంలో ప్రయాణాలకి కూడా, చాలా మంది విమానప్రయాణాలే .. ట్రైన్ లలో వెళ్ళడం ఈరోజుల్లో చాలామంది తగ్గించేశారు.. ట్రైన్ లనుండి, విమానాల్లోకి ప్రమోషనంటే వచ్చింది కానీ, మన అంతర్గత తత్వాలెక్కడకి పోతాయీ?

ఈ మధ్యన పిల్లలతో విమాన ప్రయాణం మొట్టమొదటిసారి చేసే అదృష్టం కలిగిందిలెండి.. ఇదివరకటిరోజుల్లో, ఎవరినైనా రిసీవ్ చేసికోడానికి మాత్రమే వెళ్ళేవాడిని.. అప్పుడు చూస్తే, ఆ  Exit  నుండి బయటకొచ్చే ప్రతీవాడూ, ఏదో ఒక పోజు పెట్టేవాడే.. ఎవరెవరు మనల్ని చూసి నోరు వెళ్ళబెడుతున్నారో… వగైరా.. వగైరా.. నిజంగా ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు, ఓహో మనంకూడా అలాగే ఉండాలేమో అనుకున్నాను.. ఏ కంపెనీ తరఫునో వెళ్ళేవాళ్ళు తప్పించి., మిగిలిన జనాలందరూ ఒకటే టైపు.. ఆ  lounge  లో ఉన్న కుర్చీలలో కూర్చోడం, పక్క కుర్చీలో వాడి అదేదో  Hand baggage  పెట్టడం.. పోనీ ఖాళీగా ఉంటే, ఇంకెవరో కూర్చోవచ్చుగా, అబ్బే అలాటి విశాల హృదయాలు ఛస్తే కనిపించవు. ఏ వయసు మళ్ళినవారో, నుంచోలేక, ఆ సామాను పెట్టిన వ్యక్తిని అడగండి—లేదండీ ఇక్కడెవరో ఉన్నారు  ఇప్పుడే అలా వెళ్ళారూ అని ఇంగ్లీషులోనూ హిందిలోనూ చెప్పడం… ఇదివరకటి రోజుల్లో గుర్తుండే ఉంటుంది—బస్సు స్టాండ్ లోకి వచ్చీరావడంతోటే, దానితోపాటు పరిగెత్తి ,  బస్సు కిటికీలోంచి, ఏ జేబురుమ్మాలో వేసేవారు. ఎక్కడకి పోతాయి బుధ్ధులూ? ఇంక ఆ   Boarding Pass  ఏదో వచ్చిన తరువాత, ఒకళ్ళొనళ్ళు తోసుకోవడమే. ఇవన్నీ మధ్యతరగతి మనస్థత్వాలు కాక ఇంకేమంటామూ?

అన్నిటిలోకీ నవ్వొచ్చేది, విమానంలో ప్రయాణం చేసే ఆ గంటన్నరలోనూ,  Wash Room  కి వెళ్ళడానిక్కూడా క్యూయే.. ఆ మాత్రం ఆపుకుంటే, ఏం కొంపమునుగుతుందీ? చిన్న పిల్లలూ, ఏ వయసు మళ్ళినవారూ అలా వెళ్తే అర్ధం చేసుకోవచ్చు..

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు