యువ 'ఆవిష్కరణ'లకు ఆకాశమే హద్దు - ..

young 'innovations'

ఒకప్పుడు ఏదన్నా ఆవిష్కరణ జరిగిందంటే, దాని వెనుక చాలా పెద్ద కసరత్తు ఉండేది. ఏళ్ళ తరబడి ప్రయోగాలు చేస్తేనేగానీ, ఆ ప్రయోగాలు ఓ కొలిక్కి వచ్చేవి కావు. అలా ఓ కొత్త విషయం కనుగొనడానికి ఆ కనుగొనే వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాల్సి వచ్చేది. అందుబాటులో సరైన అవకాశాల్లేకపోవడంతో ఉన్న అవకాశాల్నే వినియోగించుకునే క్రమంలో ఈ ఆలస్యం జరిగేది. అలా ఆవిష్కరణలు చేసేవారు యుక్త వయసులో తమ ప్రయోగాల్ని మొదలు పెడితే, జీవిత చరమాంకంలో వాటి ఫలితాల్ని కనుగొనేవారు. కాలం మారింది. ఇప్పుడు ఆవిష్కరణలన్నీ చాలా తక్కువ సమయంలోనే తెరపైకొస్తున్నాయి. సాంకేతిక విప్లవం తెచ్చిన మార్పు ఇది. ఆలోచనా సరళి సరిగ్గా ఉంటే, దానికి ప్లానింగ్‌ తోడైతే చుట్టూ చాలా అవకాశాలు అందుబాటులోనే ఉంటాయి. అలా అందుబాటులో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటే చాలు, సరికొత్త ఆవిష్కరణలు కళ్ళ ముందు సాక్షాత్కరించేస్తాయి. అందుకేనేమో ఈ సరికొత్త ఆవిష్కరణల విప్లవం, యువతనే కాకుండా చిన్న పిల్లల్నీ ఆకర్షించేస్తోంది.

ఓ మొబైల్‌ యాప్‌, ఓ మోటార్‌, గాల్లో తేలే డ్రోన్‌ - ఇలా ఏదైనా కావొచ్చు, ఆలోచన రావడమే తరువాయి అది తయారైపోతోంది. కష్టం కంటే కూడా కొత్తగా చేసే ఆలోచనలకు ఇప్పుడు మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పక తప్పదు. ఇంటర్నెట్‌ విప్లవం తెచ్చిన ఈ మార్పు కారణంగా రోజుకో కొత్త ఆవిష్కరణ తెరపైకి వస్తోంది. అది వైద్య రంగంలో కావొచ్చు, ఇతరత్రా రంగాల్లో కావొచ్చు. వస్తున్న మార్పులు అద్భుతం, అద్వితీయం. కొన్ని ఆవిష్కరణలు మన ఊహలకి కూడా అందనివిగా అన్పిస్తాయి. గుండెకు వేసే స్టెంట్స్‌ దగ్గర్నుంచి, రైతులు పొలాల్లోకి వెళ్ళకుండానే ఆటోమేటిక్‌గా స్టార్ట్‌ అయ్యే మోటారు పంపుల వరకు అద్భుతమైన ఆవిష్కరణలు అందరిచేతా 'ఔరా' అన్పిస్తున్నాయి. చాలా ఆవిష్కరణలు 15 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వయసున్నవారితోనే సాధ్యమవుతున్నాయని ఓ సర్వే చెబుతోంది. ప్రపంచం నలుమూలలా ఈ ఆవిష్కరణలు జరుగుతుండడం గొప్ప మార్పుకి నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యువత కూడా కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో పరుగులు పెడుతుండడం ఇంకో అద్భుతం. 
పుడుతూనే, స్మార్ట్‌ మొబైల్‌తో పరిచయం ఏర్పడుతోందిప్పుడు. ఐదారు నెలల వయసు నుంచే స్మార్ట్‌ మొబైల్‌కి ఏదో ఒక రకంగా ఎట్రాక్ట్‌ అవుతున్నారు పిల్లలు. ఏడాది తిరిగేసరికి, అందులో పాటలు వినడం, గేమ్స్‌ని ఎంజాయ్‌ చేయడంతో మొదలవుతోంది అసలు ప్రయాణం. రెండేళ్ళు, మూడేళ్ళు దాటేసరికి, స్మార్ట్‌ ఫోన్‌లో ఫీచర్స్‌ దాదాపుగా అర్థమయిపోతున్నాయి. ఇక ఆ తర్వాత ఆ స్మార్ట్‌ ఫోన్లలోనే ప్రయోగాలు, ఐదారేళ్ళకే ఇంటర్నెట్‌ - ఆ తర్వాత ప్రయోగాలకు శ్రీకారం. ఇకనేం, ప్రపంచాన్ని మార్చేసేందుకు కొత్త జనరేషన్‌ రెడీ అయిపోతోందంతే. దుష్ప్రభావాలు కూడా ఉన్నప్పటికీ ఇంటర్నెట్‌ తెచ్చిన ఈ సాంకేతిక విప్లవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రపంచం గతిని ఇంటర్నెట్‌ విప్లవం మార్చేస్తే, స్మార్ట్‌గా ఆలోచిస్తోన్న కొత్త జనరేషన్‌ ఆ ఇంటర్నెట్‌తో అద్భుతాలు సృష్టించేస్తోంది. కొత్త ఆలోచనలకు అడ్డుకట్ట వేయడం మానేసి, వారిని సన్మార్గంలో నడిపించేందుకు పెద్దలు సహకరిస్తే, భవిష్యత్‌ ప్రపంచాన్ని ఇంకా స్మార్ట్‌గా మార్చేయగల శక్తి కొత్త జనరేషన్‌కి ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు