ఆ స్పర్శపేరు ? - శ్రావణ్ దమ్ములూరి

aa
నా లో ఒక ప్రశ్న.... నేను ఎవరిని ,నేను ఎక్కడ ఉన్నాను ? నాకు ఏం కనిపించటం లేదు .. నా చుట్టూ చీకటి అలుముకొని ఉంది , ఒక నీటి కుండలో తేలుతున్నట్లు అనిపిస్తుంది .

నా.. ఈ ఆలోచనలతో పాటు, ఇంకా ఏవో కదలికలు నాలో జరుగుతున్నట్టు  తెలుస్తుంది . కానీ అవి ఏంటో , ఎలా కదులుతున్నాయో తెలియటం లేదు .

నేను ఉన్న ఈ ప్రపంచమంతా చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది . బహుశా ఇక్కడ ఎవరూ లేరు అనుకుంటా. నెన్నొక్కడినే ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాను , నన్ను ఇక్కడ వదిలి వెళ్ళింది ఎవరు ?

నా ఆలోచనలకి , చలనానికి కావలసిన శక్తీ నాకు ఎలా వస్తుంది?. నా దగ్గరకి ఎవరూ రావటం లేదు , నేను ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదు . కానీ నాకీ శక్తి ఎక్కడి నుండి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది ... నా చుట్టూ ?

నాలో అన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి . అసలు నా రూపమే , నాలో నాకు ఏం అనిపిస్తుందంటే , నేను కేవలం ఒక ప్రశ్నలు నిండిన , కదలికలు కలిగిన " ఆలోచన " మాత్రమే అని .

ఈ ప్రపంచమంతా ఇలానే ఉంటుందేమో .... చుట్టూ చీకటితో , మొత్తం ప్రశ్నలతో నా ఆలోచనలు వచ్చి ఈ ప్రపంచంలో చిక్కుకు పోయినట్టు ఉంది . ఈ ప్రశ్నలకింక సమాధానం దొరకదా అనుకుంటున్న సమయంలో ... నా చుట్టూ ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయ్, నేను కదులుతున్నట్టు తెలుస్తుంది .

ఎవరో నన్ను పట్టుకొని మోస్తున్నారు . ఏవేవో కొత్త , కొత్త మాటలు నాకు వినిపిస్తున్నాయ్.  నా ఆలోచనలు వేరే ప్రపంచానికి మారిపోయినట్లు ఉంది .

రోజులు గడిచే కొలది నాలో ఎన్నో ప్రశ్నలు .... నా చుట్టూ మాట్లాడుతున్నది ఎవరు ? నన్ను మోస్తున్నది ఎవరు ? నేను వాళ్ళని చూడాలి . నా బలం , ఆలోచనలు రోజు రోజికి పెరిగిపోతున్నట్టు తెలుస్తుంది . తొందరలోనే నేనా ప్రపంచాన్ని చూడాలి ...!  కానీ , ఎలా?

ఇప్పుడు నాకు బలం పెరిగింది ... నా కదలికలను , బయటఉన్నవారికి తెలిసేలా చేస్తున్నాను . వాళ్లకు అర్ధం అవుతున్నట్టు ఉంది , నేను వాళ్ళని కలుసుకోవాలని అనుకుంటున్నట్టు . అయినా వాళ్ళు నన్ను కలవనీయటంలేదు .

మరికొద్ది రోజులకి ... నాకు కోపం, బలం  పూర్తిగా పెరిగిపోయాయి. నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను , నన్ను పంపేయండి అనేంతలా కదులుతున్నాను. నా కదలికలకు బయపడి , నన్ను మోస్తున్న వాళ్ళు ఎక్కడికో  వెళుతున్నారు .

కొద్దీ సమయానికి , నా చుట్టూ మెత్తని పరుపులా ఉన్న నీళ్లు వెళ్ళిపోతున్నట్టు నాకు తెలుస్తుంది . అవి నా నుండి వెళ్ళిపోగానే ఒక వస్త్రం నన్ను కప్పింది . నాలో ఎదో ఆందోళన , ఏం జరుగుతుంది నాకు అని ? ... చాలా భయం వేస్తుంది , ఏమైపోతానో అని?

ఎవరో నన్ను పట్టుకొని బలంగా లాగుతున్నారు ... నాకు చాలా బాధగా ఉంది . ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? అసలు ఎవరు మీరు ? నేను తట్టుకోలేనంత నొప్పి కదలలేకపోతున్నా, నా ఆలోచనలు కూడా. నన్ను మరలా నా ప్రపంచంలోకి తీసుకొని వెళ్లి వదిలేయండి . నావల్ల కావటం లేదు .. ఇక...!

నన్ను ఎవరో బయటకు లాగేసారు బలంగా ... నా  ప్రపంచం నుండి .  ఇంకా నా లోపల చీకటిగానే ఉంది . కానీ , నా చుట్టూ ఉన్నది చీకటి కాదు ... వేరే విధంగా ఉంది. ఎవరెవరో నన్ను మోస్తున్నారు . నా కదలికలు పని చెయ్యటం లేదు , నా ఆలోచనలు కూడా పని చెయ్యటం లేదు.

నా చుట్టూ ఏవో గొంతులు గట్టి గట్టిగా మాట్లాడుతున్నాయ్. బహుశా వాళ్ళు ఏవో ఆందోళనలో ఉన్నట్టు ఉన్నారు . పోనీ వాళ్ళు నా కోసమే ఆందోళనగా ఉన్నారా ? నాకేం తెలియటం లేదు ...? ఏం జరుగుతోందో ..?

నేను చాలా ప్రయత్నిస్తున్నా... కదలడానికి. కానీ  నా వల్ల కావటం లేదు . అలా ప్రయత్నిస్తున్న  సమయంలో .... ఎవరో  నన్ను తాకారు .. అంతే నాలో మళ్ళీ కదలిక మొదలైంది. ఆ స్పర్శకి నేనంటే ఎంతో ప్రేమ అని అర్ధమవుతుంది . అలా నా పై ఆ స్పర్శ  తాకంగానే ... " నేను కేవలం ఒక కదలికలు కలిగిన ఆలోచనని మాత్రమే కాదు ..! నేను ఒక రూపం , దేహం కలిగిన వాడినని తెలిసింది నాకు ".

ఆ స్పర్శ నాకు గుర్తుంది .... నన్ను ఇంత కాలం  మోసింది ఆ స్పర్శే.

ఇన్ని ప్రశ్నల మధ్య నాకు అర్ధం  అవుతున్నది ఏంటంటే? ఇంత కాలం నేను ఒకరిలో ఆలోచనగా పెరిగాను .. ఇప్పుడు నా ఆలోచనలు బయటకు వచ్చాయ్.

ఆ స్పర్శ నాతో మాట్లాడుతుంది .... " కన్నా అమ్మ  ఎంత ఆనందంగా ఉందొ .... చూడు".

అప్పుడు తెలిసింది నాకు ఆ స్పర్శ పేరు   " అమ్మ " అని .

... నేను ఆ  " అమ్మకి పుట్టిన పసి పాపని అని "

ఇంత కాలం నాలో  ఉన్న కొన్ని వందల వేల ప్రశ్నలకి సమాదానం......

నా " అమ్మ యొక్క చల్లని చేతి స్పర్శ ".

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు