చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

మన సిటీల్లోనూ, ఇప్పుడిప్పుడే పట్టణాల్లోనూ వస్తూన్న ఓ కొత్త జాడ్యం!మనకి దేనిగురించైనా తెలిస్తే, ఇంకోళ్ళకి చెప్పకుండా ఉండడం.ఏదో రోజు, నీళ్ళురావని, ఏ పేపర్లోనైనా వేసేడనుకుందాము, దాన్ని చదివినవాడు, అందరికీ చెప్పొచ్చుగా, అబ్బే అలా చెప్పేస్తే అందరూ సుఖపడిపోరూ, తనొక్కడే బాగుపడాలి. పైగా సొసైటీ లో మిగిలినవాళ్ళందరూ, అదేమిటీ, చెప్పాపెట్టకుండా, కార్పొరేషను వాళ్ళు ఇలా నీళ్ళు బందుచేశారూ, అనుకుంటూంటే, మన హిరో పేద్ద గొప్పగా నిన్న పేపర్లో ఇచ్చారు, నేను చదివానూ, అందుకనే రాత్రే .నీళ్ళుపట్టి పెట్టేసికున్నానూ  అంటాడు. ఆ మాత్రం అందరితో చెప్పడానికేంరోగం?

మనకి తెలిసినది, ఏ విషయమైనా సరే ఇంకో నలుగురితో పంచుకోడంలో ఉన్న ఆనందం, మనమే అనుభవించాలనుకోడం చాలా తప్పు.ప్రతీవారూ పేపరు చదవకపోవచ్చు, న్యూసు చూడకపోవచ్చు, అలాటివారికి ఉపయోగిస్తుందికదా.ఒక్కొక్కప్పుడు, ఊళ్ళో ఏదైనా మంచి కార్యక్రమం జరగబోవచ్చు, దానిగురించి తెలిసినవారందరికీ చెప్తే, దానిమీద ఇష్టం ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చుగా, అంతేకానీ, మనకే తెలుసునుకదా అని మనదారినమనం చూసొచ్చేసి, గొప్పగా అందరితోనూ, 'మేము ఫలానా కార్యక్రమం చూసొచ్చామోచ్' అంటే, చాలా బాధొస్తుంది. నామట్టుకి నాకైతే, తెలిసిన విషయాన్ని నలుగురితోనూ పంచుకుంటాను. ఇష్టమైన వాళ్ళు వింటారు, లేనివాళ్ళు మానేస్తారు. మనకేమీ నష్టంలేదు.లేనిపోనివన్నీ,తెలిసినవీ,తెలియనివీ exaggerate చేయకూడదు.ఒకసారి విన్నా, దాన్లోని నిజా నిజాలు తెలిసిన తరువాత మన మొహం చూడడెవడూ! దీని వలన మనం ఇంకో నలుగురు స్నేహితుల్ని సంపాదించుకుంటాము. కాదూ నన్నుముట్టుకోకు నామాలికాకీ లా ఉందామనుకుంటారా మీఇష్టం.మనం పోయినతరువాత, మన గురించి చెప్పుకునేది వీటిగురించే!

కరెంటు పోయిందంటే, కాళ్ళూ చేతులూ పడిపోతాయి.మన దినచర్యలు దానితో ఎంత పెనవేసుకుపోయాయీ అనేది చూస్తూంటే,కరెంటు లేనిరోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళమా అనిపిస్తూంటుంది.సాయంత్రం అయేసరికి, కొంచెం పెద్ద చిమ్నీ ఉండే, కోడిగుడ్డు ల్యాంపు తీసికుని, ఆ చిమ్నీలో ముగ్గువేసి, క్లీను చేసికుని, వెలిగించడం.ఇంట్లో అందరి భోజనాలూ, అమ్మ వంటిల్లు కడగడం అదీ అయిన తరువాత, సావిట్లో, దానిముందర, కూర్చుని, పుస్తకాల్లోది బట్టీ పడుతూ,మధ్య మధ్యలో జోగుతూ, నాన్న " ఏరా చదువుతున్నావా" అనగానే ఉలిక్కిపడడం, అలా ఉలిక్కిపడి, దీపం మీదికి వంగడం, దాంతో మనమొహం మీదపడే వెంట్రుకలు కొద్దిగా కాలడం, ఆ వాసన తగిలి, నాన్నో, అమ్మో ' చాల్లే చదివింది ఇంక పడుక్కో'అనడం, అబ్బ ఎన్నెన్ని జ్ఞాపకాలో !!

ఇవి కాకుండా, హరికెన్ లాంతర్లని ఉండేవి.పెట్రోమాక్స్ లైట్లకి, అదేదో మాంటిల్ అనేదాన్ని వెలిగించగానే, అది ఓ తమాషా చప్పుడు చేసికుంటూ, బ్రహ్మాండంగా వెలిగేది.సాయంత్రాలవగానే, ఓ నిచ్చేనేసికుని వీధిదీపాలు వెలిగించడానికొచ్చేవారు

పంచాయితీ వాళ్ళు!ఇలా చెప్పుకుంటూ పోతే  ఈరోజుల్లో మనం ప్రతీదానికీ బానిసలయేమనడంలో సందేహం లేదు. గుర్తుందా, కొన్ని సంవత్సరాలక్రితం వరకూ కూడా, మనిళ్ళల్లో కొత్తగా ఏదైనా ఆధునిక సాధనం కొనుక్కున్నా, దానికి సంబంధించిన సాంప్రదాయ సాధనాన్ని కూడా ఇంట్లో ఉంచుకునేవాళ్ళం. ఉదాహరణకి ఏ  Mixie  విషయమో తీసుకోండి, ఆ Mixer  తోపాటు, పాతకాలపు రుబ్బురోలుకి కూడా ఓ జాగా ఇచ్చేవాళ్ళం. ఏ పచ్చడి చేసుకోవడానికో, లేక ఏ ఇడ్లీపిండి రుబ్బుకోడానికో, మధ్యలో ఆ  Mixer  పాడైపోతే, ఆ పాత సాధనాలేకదా, మన ల్ని వీధిన పెట్టకుండా ఉండేదీ? ఈరోజుల్లో చాలామందికి ఇది నచ్చదు.

అలాగే, అకస్మాత్తుగా  Gas  అయిపోతే, పాత కుంపటే కదా మనల్ని కాపాడేదీ? ఇలా చెప్పుకుంటూ పోతే, ఏ విషయం తీసికోండి,, ఆధునిక సాధనాలతోపాటు, పాతవికూడా ఉంచుకోవడం ఎంతైనా మంచిది. అలాగే , చాలామంది ఈరోజుల్లో తమ పాతతరం వారిని తమతో ఉంచుకోడానికి ఇష్టపడ్డం లేదు.. కానీ, ఇంట్లో ఎవరికైనా అకస్మాత్తుగా అనారోగ్యం చేస్తే, డాక్టరు దగ్గరకో, హాస్పిటల్ కో వెళ్ళేలోపల, ప్రధమ చికిత్సలలోని చిట్కాలు ఎన్నో తెలుసుంటాయి పాత తరం వారికి… వాటిని ఉపయోగించుకోవడంలో నష్టం ఏమీ ఉండదు.

అంతదాకా ఎందుకూ, ప్రభుత్వ కార్యాలయాల్లో, పనులన్నీ ఎంతగా కంప్యూటరులోనో చేసికున్నా, కొన్ని ముఖ్యమైన పత్రాలని  Xerox  చేసి జాగ్రత్త పడుతూంటారు. అలాగే ప్రతీదానికీ ఓ  Standby  ఉండడం ఎంతో ముఖ్యం.

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు