పెంటయ్య: నువ్వు రాజు గారికి వియ్యంకుడివయ్యావా? ఎలా ఆశ్చర్యం గా వుందే?
కోటయ్య: మా అమ్మాయి, మహారాణి గారి పరిచారిక, తెల్సుగా?
పెంటయ్య: ఔను! రెండేళ్ళుగా ఆ ఉద్యోగం లో వున్నట్లు తెల్సు!
కోటయ్య: ఆ ఉద్యోగం లో వుండి, మహారాజు గార్ని వల్లో వేసుకుంది! మహారాణి గార్ని వెడలగొట్టింది!!
కోడి పిల్ల: అమ్మా నా మీద డేగ కన్ను పడిందమ్మా!
తల్లికోడి : వేగంగా వచ్చి, నా రెక్కల కింద దాక్కో!!
కోడి పిల్ల: నేను ఆకాశానికి ఎగురుతున్నానమ్మా!!
ఒక తాబేలు: నేను ఆరవమెట్టు తాబేలు. మరి నువ్వో?
ఇంకో తాబేలు: నేను పదవమెట్టు తాబేలు
ఒక తొండ: ఆ తాబేళ్ళ మాటలు విన్నావా?
రెండో తొండ: విన్నాం! అవి దిగుడు బావి తాబేళ్ళు!
మూడో తొండ: ఈ రోజుల్లో దిగుడు బావులేవీ? పూడి పోయాయిగా?
రెండో తొండ: పాత స్మృతులు గుర్తుకు తెచ్చుకుంటున్నాయిలే!!
రాణి: అమ్మా... నేను మహారాజు గారి పక్కన పడుకుని నిద్రపోలేకపోతున్నానమ్మా!
రాణిగారి తల్లి: అల్లుడు గారు గురకపెడుతారా?
రాణి: పడకగది చుట్టూ కుక్కలు చేరి మొరుగుతాయమ్మా!
రాణి గారి తల్లి: కుక్కలా?
రాణి: ఔనమ్మా! మీ అల్లుడు గారు పెట్టేది గురక కాదు... పిల్లి కూతలు!!
దండనాయకుడు: మహారాజా, పొరుగు రాజ్యం లో " భారీ భూసేకరణ పథకం" ప్రవేశపెట్టారని వార్త వచ్చింది!
రాజు: దానివల్ల మనకేం ప్రయోజనం?
దండనాయకుడు: ప్రయోజనం కాదు, భారీ నష్టం వాటిల్లనుంది!
రాజు: ఎలా?
దండనాయకుడు: ఆ పథకం కింద, మన భూములు, మన గ్రామాలూ, మన కోటలు, మన అంత:పురాలు, చివరికి తమరి సిం హాసం కూడా పొరుగు రాజ్యం వశం కానుంది!!
పేరయ్య: ఇది భస్మాసురిడి బూడిద అని నిక్కచ్చి గా ఎలా చెప్పగలిగావ్?
వీరయ్య: ఈ బూడిదతో పళ్ళు తోముకున్నాను. నోరు కంపుకొట్టి, పళ్ళూడి పోయాయ్!!
నారదుడు: నమో నారాయణా... అమ్మా! తండ్రి గారు ఎక్కడికో బయల్దేరుతున్నట్లున్నారు!
మహాలక్ష్మి: భూలోకానికి వెళ్తున్నారు నారదా! అక్కడ గణేశ నవరాత్రులు జరుగుతున్నాయిగా, గణేషుడ్ని చూడ ముచ్చట పడ్డారు!
నారదుడు: ఐతే సుదర్శన చక్రం దాచిపెట్టి వెళ్ళమనండమ్మా! వినాయకుడి కంటపడితే ఆయన మింగేస్తాడు!!
సుబ్బన్న: ఈ ఏడు పోలేరమ్మకి, మేకపోతు బలిచ్చి, కూరొండి నైవేద్యం పెట్టారుగా?
ఎల్లమ్మ: పెట్టాం! ఉల్లిధర పెరిగి, తక్కువ ఉల్లి, కూరలో వేశాం! పోలేరమ్మకి కోపమొచ్చి, ఈ ఏడు ఊరుని వరదల్లో ముంచేసింది!!
"నావి ఏడే రంగులు ఒక వరుస క్రమం లో వుంటాయి. ఎప్పటికీ మారవు!"
" నావెన్నోరంగులు. ఒక క్రమం లో వుండవు. మారుతూ వుంటాయి!"
ఒక పక్షి: ఆ మాట్లాడుకునే వాళ్ళెవ్వరూ?
ఇంకోపక్షి: ఒకటి ఇంద్ర ధనుస్సు! మరొకటి ఊసరవెల్లి!!
మూషికం: తల వొంచకు నందీశ్వరా?
నంది: ఏం?
మూషికం: మీ చెవిలో భక్తుల రహస్య కోరికలున్నాయి! అవి కిందికి రాలిపోతాయి జాగ్రత్త!!