చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

మన దేశంలో ఆనవాయితీగా జరిగే  " దినాల " లాగానే, అప్పుడెప్పుడో Water Day  అన్నారు.. ప్రత్యేకంగా నీళ్ళకి కూడా ఒకరోజు పాటించాల్సొచ్చిన దౌర్భాగ్యం.. అంటే ఈ రోజొక్కటీ నీళ్ళని గురించి మాట్టాడేసి, అవేవో మరాథన్లు, వాకాథన్లూ, ఊరేగింపులూ, టీషఱ్టులూ, టోపీలూ పెట్టేసికుని ఫొటోలు తీసేసికోవడంతో సరిపోతుందన్నమాట.. రేపెప్పుడో, తాగడానికి ఓ చుక్క కూడా ఉండకపోతే తెలిసొస్తుంది. అప్పుడు ప్రతీరోజూ  Water Day  పాటిస్తారా? ఈవేళ రోజంతా ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తించేసిన జనాలు,  హోలీ రోజున, నీళ్ళు లేకుండా ఎలా జరుపుకుంటారో కూడా చూద్దాం.. చప్పుళ్ళు లేకుండా దీపవళి, నీళ్ళు లేకుండా హోలీ సాధ్యమేనంటారా? ఏమో ఈనాటి యువతరం చేసి చూపిస్తారేమో చూడాలి.

మా సొసైటీలో ఓ నోటీసు పెట్టారు... హోలీ రోజున నీళ్ళతో ఆడొద్దనిన్నూ, అలాగే  Dry Holi  ఆడి, ఈమధ్యనే  కొత్తగా రంగులేసిన సొసాఇటీ గోడలు పాడిచేయొద్దనిన్నూ.. నవ్వొచ్చింది...  ఏదో చిన్నప్పుడు వినేవాళ్ళం, అక్కడెక్కడో నీటి కరువొచ్చిందని. కానీ ఈరోజుల్లో నీళ్ళనేవి పుష్కలంగా దొరికే ప్రదేశం, మన దేశంలో ఎక్కడైనా ఉందా, అని వెదకాల్సిన పరిస్థితిలో ఉన్నాము. కారణాలు ఎవరికి వారే చెప్తారు. భూగర్భ నీటి వనరులు అనేవి, అప్పుడెప్పుడో అంటే, మరీ ద్వాపర యుగం కాకపోయినా, మేము చదువుకునే రోజులదాకా వినేవాళ్ళం.. ఇళ్ళల్లో  Overhead Tanకులూ , కుళాయిలూ అంటే ఏమిటో తెలియని రోజులు. Tank  అంటే, ఏదో, పెట్రోలూ అవీ రవాణా చేసే సాధనమో, లేక యుధ్ధాల్లో సైన్యం ఉపయోగించే ఒక అస్త్రమో అనే అనుకున్న రోజులు.. మహా అయితే వాహనాల్లో  ఇంధనం నింపే ఓ పెట్టె లాటిదో అనుకున్న రోజులు. ఓ ఇల్లు కట్టుకుంటున్నారంటే, ముందుగా ఓ నుయ్యి.  దాంట్లో పుష్కలంగా, మన అదృష్టాన్ని బట్టి, తీపి నీళ్ళో, ఉప్ప నీళ్ళో.. ఏదైతేనేం, పైకప్పు లేపేవరకూ హాయిగా పనైపోయేది.గోడలు తడుపుకోడానికి నీళ్ళకోసం తడుముకునే అవసరం ఉండేది కాదు. పైగా ఆ ఇంట్లో నూతినీళ్ళు  తియ్యగా ఉన్నట్టైతే,  వీధివీధంతా అక్కణ్ణించే తోడుకోవడం. కాదూ అంటే, ఏ కాలవకో, చెరువుకో వెళ్ళి నీళ్ళు తెచ్చుకుని ఓ రెండు మూడు ఇండుపు గింజలు వేస్తే, హాయిగా ఆ నీళ్ళు స్వఛ్ఛంగా ఉండేవి. పైగా ఆ కాలవనీళ్ళకి అదో రుచి కూడా ఉండేది. ఆ కాలవలూ, చెరువులూ, కాల గర్భంలో ఎప్పుడో కలిసిపోయాయి. . కనీసం  సకాలంలో వర్షాలొచ్చినప్పుడు, ఆ కాలవలూ, నూతులూ, చెరువులూ నిండేవి. కానీ ఈరోజుల్లో వర్షాల్లేవా అంటే అదీ కాదూ, ఏడాదికో నాలుగైదుసార్లు ఏవేవో తుఫాన్లు వస్తూనే ఉన్నాయి, కానీ  భూగర్భంలో ఇంకడానికి, అసలు మట్టంటూ ఉంటే కదా? ఎక్కడ చూసినా కాంక్రీటు యుగమాయె. అసలు మొదటి చినుక్కి ఆ మట్టివాసన ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించారా ఈ తరం వాళ్ళు?

సొసైటీల్లో ఒక్కరోజు నీళ్ళు రాకపోతేనే కకావికలైపోయేవారు, రాబోయే రోజుల్లో , రోజుల తరబడి నీళ్ళే  రాకపోతే ఏం చేస్తారో?  ఈ పరిస్థితి రాత్రికి రాత్రేమీ వచ్చింది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా ,  నీటికొరత సంకేతాలు కనిపిస్తూనే ఉన్నాయి. చూద్దాంలెద్దూ ప్రాణం మీదకొచ్చినప్పుడూ అనే కానీ, మన వంతు మనమూ ఏదో ఒకటి చేయాలీ అనేది మాత్రం ఎవరికీ తట్టదు. " నేనొక్కణ్ణీ చేస్తే ఏమౌతుందండీ... సమాజంలో మార్పు రావాలి కదండీ..." అనేవాళ్ళే ఎక్కువ. మన వంతు మనం ఏం చేస్తున్నామూ అని గుండెలమీద చెయ్యేసికుని ఆలోచించండి... ఈరోజుల్లో ఉండే 2,3, 4  బెడ్ రూమ్ములకి ఏమున్నా లేకపోయినా,  ప్రత్యేక టాయ్లెట్లు ఉండాలే. ఏమైనా అంటే ప్రైవసీ..అందులో ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఒక్కో టాయిలెట్లోనూ, కనీసం రోజుకి నాలుగైదుసార్లు ఫ్లష్ చేసినా ఖర్చయ్యే మూడేసి బకెట్ల నీళ్ళు ఎక్కణ్ణించొస్తాయి? దానికి సాయం మన మోదీ గారి స్వఛ్ఛతా అభియాన్ లో "ఇంటికో టాయిలెట్"నినాదం వినడానికి బాగానే ఉంది. కానీ త్రాగడానికి గుక్కెడు నీళ్ళైనా దొరకని ప్రదేశాల్లో, ఈ ఇంటికో టాయిలెట్లో పోయడానికి నీళ్ళెక్కడా?  సందేశాలూ, నినాదాలూ  వినడానికీ, లెక్కలు చూపించుకోడానికీ దివ్యంగానే ఉంటాయి, కానీ ఆచరణ మాటో?

ఇంక మధ్యమధ్యలో కార్పొరేషను వారు  ఆరోజుకి నీళ్ళవ్వరని ప్రకటించగానే, నీళ్ళొచ్చినప్పుడు, ఇంట్లో ఉండే, బకెట్లూ, బిందెలూ, గ్లాసులూ, ఉధ్ధరిణి లతో సహా నింపేసికుంటారు. పోనీ అవేమైనా వాడుతారా అంటే, మళ్ళీ నీళ్ళొచ్చినరోజు పారపోసేయడమే. ఏమైనా అంటే నిల్వ నీళ్ళు ఎలా వాడతామండీ అంటూ సమర్ధనోటి.

"  Preserve Water "  అని ఇంటికప్పులెక్కి కబుర్లు చెప్పేవాళ్ళందరూ, ముందర అదేదో తాము ఆచరిస్తే  అదే చాలు...

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు