విహారయాత్రలు ( మలేషియ ) - కర్రా నాగలక్ష్మి

maleshiya

అన్నలక్ష్మి

జెంటింగ్ హైలెండ్స్ కి వీడ్కోలు పలికి దిగువకి వచ్చే దారిలో కేబుల్ కారు స్టేషను వుంటుంది . మా యింటికి వచ్చిన మలేషియ పర్యాటకులకు మేం మలేషియాలో తప్పక చూడదగ్గ కాదు కాదు అనుభవింప దగ్గదిగా చెప్పేవాళ్లం . జెంటింగ్ లో యే రైడ్ యెక్కకపోయినా యిది మాత్రం యెక్కి తీరవలసిందే . యెందుకంటే యిది దక్షిణ ఆసియా దేశాలలో అతి యెత్తైన , అతి త్వరగా నడిచే కేబుల్ కారు అనేది ఒక కారణమయితే మబ్బులలో ప్రయాణంచే ఆ అనుభవం మరపురానిది , మరెక్కడా కూడా మబ్బులను చీల్చుకొని వెళ్లే కేబుల్ కారులు లేకపోవడం మరో కారణం .

జెంటింగ్  హైలేండ్స్ లో మరో ఆకర్షణగా 1997 లో యీ కేబుల్ కారు నిర్మాణం జరిపేరు . పటిష్టమైన భద్రతలతో యీ ప్రయాణం వుండేది . ఆటో మేటిక్ తలుపులు , ప్రయాణ సమయంలో అహ్లాదకరమైన సంగీతం వినిపిస్తూ మధ్యమధ్య కేబుల్ కారును గురించిన సమాచారం చెప్తూ మనం యెంత యెత్తున ప్రయాణిస్తున్నదీ చెప్తూ వుంటారు . కేబుల్ కారు నిర్మించినప్పుడు యిద్దరు మనుషులచొప్పున ప్రయాణంచే వీలును కల్పించేరు . తరువాత యీ యంత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో ప్రతీ వాహనం లోనూ 8 మందిని తీసుకువెళ్లే సమర్ధత కలిగిన యంత్రాలను అమర్చారు . ప్రస్తుతం మోనో కేబుల్ కారు సిస్టమ్ ని అమర్చేరు . ఇది ప్రపంచం లోనే అతి వేగంగా నడిచే మోనో  కారుగా గుర్తింపబడింది . ఇది సుమారు గంటకు 22 కిలో వేగంతో నడుస్తోంది . ఇది సుమారు 3.38 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది .

అతి యెత్తైన ప్రదేశానికి చేరిన తరువాత యీ కేబులుకారు కొద్ది నిముషాలు ఆపుతారు . అక్కడనుంచి ప్రకృతి రమణీయతను ఆస్వాదించమని కాని ఆ యెత్తుకి కింద కనిపిస్తున్న దృశ్యాలు మనోహరంగా కన్పించడం బదులు మనకు భయాన్ని కలుగ చేస్తాయి . ఆ యెత్తున వ్రేలాడుతున్నామనే భావన కి గుండెగొంతుకలో కొట్టుకుంటుంది . ఆ కొద్దినిముషాలు మైకులో వినిపిస్తున్న వేవీ మన చెవులకు సోకవు . తిరిగి మొనోకారు కదిలే వరకు అదే పరిస్థితి . ప్రయాణం తరువాత ఆ అనుభవం తలుచుకుంటే యిప్పటికీ యేదో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది . అందుకే జెంటింగ్ వెళ్లేవారు యీ మోనో కారు యెక్కడం మరచిపోకండి .

శిఖరాగ్రానికి చేరి కాస్సేపు అక్కడి పరిసరాలు చూసుకొని తిరిగి కేబుల్ కారులో వెనక్కి వచ్చేం .

పినాంగ్ కి ప్రయాణమయేం .

తిరిగి మనం పినాంగ్ కి వస్తే పినాంగ్ లో వున్న భారతీయ సంతతికి చెందిన వారి గురించి చెప్పుకోవాలి . భారతీయ సంతతికి చెందిన వారు యిక్కడ చాలా వాణిజ్య సంస్థలు నడుపుతున్నారు . ముఖ్యంగా యిండియన్ మార్కెట్లో వున్న బంగారు నగల షాపుల దగ్గర నుంచి పువ్వులు అమ్ముకొనే వారి వరకు అన్ని చిన్న పెద్ద షాపులు భరతీయులవే . అలాగే మలేషియ ప్రభుత్వరంగం లో రాజకీయరంగంలో కూడా భారతీయ సంతతికి చెందిన వారున్నారు . పోలీసు మిలిటరీ శాఖలలో వున్నత పదవులలో కూడా వీరు కనిపిస్తారు . ప్రజలచే యెన్నుకోబడి మంత్రిత్వ శాఖలను  నిర్వర్తిస్తున్నారు .

పినాంగ్ లో గురుద్వారా , రాధాకృష్ణ మందిరాలు వున్నాయి . ఇక్కడ ఆదివారం మద్యాహ్నం భజనలు పూజలు వగైరాలనంతరం భక్తులకు వుచిత భోజన సౌకర్యం వుంది .

పినాంగ్ లో సంగీతం , నాట్యం , భారతీయ భాషలను వుచితంగా నేర్పు సంస్థలు వున్నాయి .

మలేషియ లో వున్న మరో సేవ సంస్థ గురించి యిక్కడ మీకు తెలియజేస్తాను . భారతీయ సంతతికి చెందిన కొందరు కోటీశ్వరుల ద్వారా నడపబడుతున్న ' అన్నలక్ష్మి '  లాభాపేక్షలేని గొలుసు హోటల్స్ గురించి విన్నారా? , వాటి గురించి యీ వారం మీకు పరిచయం చేస్తాను     లాభాపేక్షలేని హోటల్స్ యెప్పుడూ వినలేదుకదా ? వివరాలు చదివేయండి మరి .

మలేషియలో వున్న భారతీయులకు పూర్తి శాఖాహార భోజనం పరిచయం చెయ్యాలనే వుద్దేశంతో యిక్కడివారు  ' స్వామి '  అని పిలుచుకొనే అతను అక్కడి స్త్రీలను వారివారి ప్రాంతాల ఆహారాలను వారి యింటికే పరిమితం చేయకుండా మరికాస్త యెక్కువగా వండి మిగతా వారికి రుచి చూపించి శాఖాహారపు అలవాట్లను పెంపొందించే వుద్దేశంతో 1984 లో మొదలు పెట్టబడింది . అలా మొదలయిన శాఖాహారపు వుచిత భోజన శాల . శాఖాహార ప్రియుల చొరవతో మరింతగా విస్తరించి యివాళ మలేషియలోని అన్ని ప్రధాననగరాలతో పాటు సింగపూర్ లో కూడా నడపబడపతోంది . ప్రతీ రోజు ప్రొద్దుట 11-30 నుంచి మూడు వరకు తిరిగి 6-30 నుంచి రాత్రి 10 వరకు తీసివుంటాయి . ప్రతీ సోమవారం శలవు దినం అయితే తెరచి వుంచే వేళలు ఆయా నగరాలలో మారుతూ వుంటాయి అవి ముందుగా తెలుసుకొని వెళితే మంచిది .   అన్నలక్ష్మి  కి అనుబంధంగా టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే సంస్థను కూడా నడుపుతున్నారు . ఇందులో నృత్యం సంగీతం నేర్పుతూ వుంటారు .

అన్నలక్ష్మిని యెలా నడుపుతారో తెలుసుకుందాం . పెద్దపెద్దవ్యాపారవేత్తలు ధనసహాయమే కాక శ్రమదానంకూడా చేసి యీ హోటల్స్ సేవకు యెటువంటి అంతరాయం కలుగకుండా చూసుకుంటున్నారు . అన్నలక్ష్మిలో మనకి మెన్ కార్డ్ యిస్తారు , అందులో ఐటమ్ మాత్రమే రాసి వుంటాయి కాని వాటి ధరవరల పట్టిక మాత్రం వుండదు . కొన్ని చోట్ల చాలా తక్కువ ధర వేసివుంటుంది . మీకు కావలసినవి తిన్న తరువాత  కొన్ని చోట్ల బిల్లు వేసి యిస్తారు , కొన్ని చోట్ల బిల్లు పెట్టే కవరు మాత్రం యిస్తారు . మీరు తిన్నవాటికి యింత అని మీరేధర కట్టి యివ్వాలి , యివ్వకపోయినా వారు అడగరు . ఈ సదుపాయం విదేశీ విద్యార్ధులు భోజనం కొరకు యిబ్బందులు పడకుండా వుండేందుకు , పర్యాటకుల యేదైనా కారణాలవల్ల తమ సొమ్ములు పోగొట్టుకొన్నవారు  , దిక్కులేనివారు , ఆర్జన లేని ముసలి , వికలాంగులకు ఆకలితో వుండకుండా వుండాలనే వుద్దేశంతో యీ అన్నలక్ష్మి ప్రారంభించబడింది . ఈ సంస్థ దాతల వద్దనుంచి విరాళాలు తీసుకుంటుంది . మా అబ్బాయి ఎమ్బియ్యె చేసేటప్పుడు పదేసి కేజీల బియ్యం విరాళంగా యిచ్చేవాడు . చాలా మంది స్టూడెంట్స్ ప్రతీరోజూ యిక్కడ ఫ్రీ గా భోజనం చేస్తూవుంటారని వాడి వల్ల మాకు తెలిసింది .

మేం కూడా ధనసహాయం అందజేసేవారం . ఓ సారి డబ్బులు యివ్వకుండా తిని వారు అడుగుతారేమో అని యెదురు చూసేను వారేమీ అడుగలేదు . అప్పుడు కుతూహలంతో ఆసంస్థను గురించి అడిగేం . మలేషియలో స్వామిజి అని పిలుచుకొనే వ్యక్తి చొరవ వల్ల ప్రారంభించబడింది . ఓ హోటల్ నడపాలంటే వంటవాళ్లు , క్లీనర్స్ , పాత్రసామానులు తోమేవారు వుండాలికదా ? విదేశాలలో లేబరు దొరకడం చాలా కష్టం అందుకే వారిలో కొందరు వంటచెయ్యగా మరికొందరు క్లీనర్ అవతారం యెత్తి పాత్రలు శుభ్రపరిచేవారు . యెవరికి వీలయినపుడు వారు వచ్చి సేవలందించసాగేరు . డబ్బు యివ్వడం ఒక యెత్తు యెంగిలి పాత్రలు కడగడం మరొక యెత్తు . మనిషి యిగోని విడిచిపెడితే కాని అది సాధ్యంకాదు , మనయింట్లోనే మనం తిన్న పాత్రలను కడగడమే పరమ నీచమైన పనిగా భావించేమనం మరొకరు తినేవాటిని కడగడం అనేది వూహించలేము అలాంటిది కోటీశ్వరులు అలాచేస్తారంటే నమ్మగలమా ? నాకళ్లతో నేను చూసేను కాబట్టి నమ్మేను లేకపోతే కట్టుకథ అని కొట్టిపారేసి వుందును .

అప్పుడు అక్కడ ఫుడ్ సర్వ చేసే అతనిని ఆ సంస్థను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాం . ఆ సంస్థలోని ప్రతీ సభ్యుడు వారానికి అవుసరాన్ని బట్టి ఒకటినుంచి వారం రోజుల వరకు వచ్చి యిలాంటి సేవలను అందిస్తున్నారని తెలిపింది . సాధారణంగా పాత్రలు కడగడానికి మనిషిని పెట్టకుంటారు వారు రానపుడు సభ్యులు ఆ పనులు చెయ్యడా కి వెనుకాడరు . వంటలు చేసేది కూడా సభ్యులే కావడం వల్ల అన్నలక్ష్మిలో ఛాయిస్ చాలా తక్కువగా వుంటుంది . విదేశాలలో వుండే సభ్యులు వారం పదిరోజులు యిక్కడే వుండి అన్నలక్ష్మి పనులు చూసుకుంటారు .

అన్నలక్ష్మి సింగపూర్ లో కూడా వుంది . మలేషియలో దక్షిణ భారత భోజన హోటల్స్ లెక్కకు మించి వున్నా అన్నలక్ష్మి కూడా బాగా నడుపబడుతోంది . మేము అన్నలక్షమిని వెతుక్కొని వెళుతూ వుంటాం .

కౌలాలంపూర్ లో సిటిసెంటర్ లోని మెగామాల్ లో వెనుకవైపున గ్రౌండ్ ఫ్లోర్ లో వుంది అన్నలక్ష్మి .

మన భారతీయులను తప్పుగా అంచనా వేసుకున్న మలేషియ తమిళ వ్యాపారులు యీ సంస్థను మనదేశంలో కూడా విస్తరింపజెయ్యాలని చెన్నైలో మొదలుపెట్టేరు . హాలు ఫుల్లు ఆదాయం నిల్లు అవగా ఓ రెండు నెలలు నడిపి తరువాత మూసి వేసేరు .

కావలసినంత తినండి , తోచినంత యివ్వండి అని వారి మెనూకార్డ్ లో రాస్తారు . 

గురుద్వారాలలో , అమర్ నాధ్ యాత్రీకుల కొరకు లంగరు సేవలు అందించడం తెలుసుకాని యిలా ప్రతీ రోజు మనకు కావలసిన రకరకాల వంటలను యిలా అందించే సేవాసంస్థ యిదొక్కటేనేమొ ? పోనీ నాకు తెలిసినంతలో అనుకుందాం . మలేషియ వెళ్లేవారు ఒక్కసారైనా యిక్కడకు వెళ్లి అన్నలక్ష్మి లో భోజనంచేసి ఆ అనుభూతిని ఆస్వాదించండి . 

పై సంచికలో మనం కౌలాలంపూరు గురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు