‘ఇన్‍బాక్స్’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ -సాయి సోమయాజులు
ఓ తమిళ్ ఫీల్మ్ కాంపెటిషన్ షోలో ‘బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ ది వీక్’, మరియూ ‘బెస్ట్ యాక్టర్’ అవార్డ్ (ఫ్యాంటసీ రౌండ్) లో దక్కించుకున్న సైలంట్ షార్ట్ ఫిల్మ్- ‘ఇన్‍బాక్స్’. ప్రేక్షకులనే కాకుండా, క్రిటిక్స్ ని కూడా మెప్పించిన ఈ షార్ట్ ఫిల్మ్ పరిచయం, సమీక్ష... మీ కోసం-
కథ :
ఓ షాపులో టెడ్డీ బేర్ కొన్న ఓ అమ్మాయి దానిని పట్టుకెళ్ళడం కోసం కౌంటర్ దగ్గర అతుక్కునున్న రెండు హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ ను విడదీసి, అందులోని ఓ బ్యాగ్‍లో టెడ్డీ బేర్ నుంచి తీసుకెళుతుంది. తర్వాత అదే షాపులో ఓ అబ్బాయి తనకి కావల్సిన అండర్ గార్మెంట్స్ కొనుక్కుని అవి పట్టుకెళ్ళడం కోసం అదే కౌంటర్ దగ్గర ఉన్న రెండో బ్యాగ్‍లో వాటిని పెట్టుకుని తీసుకెళతాడు. ఇంటికెళ్ళి చూసుకున్న ఆ ఇద్దరికీ ఓ పెద్ద షాక్ తగులుతుంది.. అబ్బాయి బ్యాగ్‍లో ఉండవలసిన అండర్ గార్మెంట్స్ కు బదులు టెడ్డి బేర్, అమ్మాయి బ్యాగ్‍లో ఉండవలసిన టెడ్డీ బేర్ కు బదులు అండర్ గార్మెంట్స్ దొరుకుతాయి. ఆ మాయ బ్యాగ్ ల జతను విడదీసినందుకుగాను మొదటి బ్యాగ్‍లో వేసిన వస్తువులు రెండో బ్యాగ్‍లోకి, రెండో బ్యాగ్‌లో వేసిన వస్తువులు మొదటి బ్యాగ్‍లోకి చేరతాయి. ఆ తర్వాత ఈ విచిత్రం వాళ్లకు ఎలా తెలుస్తుంది? ప్రేమలో ఎలా పడతారు? అనేది కథ. వాళ్లిద్దరూ కళ్ళుద్దామనుకునేలోపు కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ‘ఇన్‍బాక్స్’ ఈ కింది లింకులో చూడాల్సిందే-
https://www.youtube.com/watch?v=75wNgCo-BQM
ప్లస్ పాయింట్స్ :
ఈ షార్ట్ ఫిల్మ్ కి అతి పెద్ద ప్లస్ పాయింట్ కథ. ఓ ఫ్యాంటసీ లవ్ స్టోరీని లఘుచిత్రంగా తియ్యడం మామూలు విషయం కాదు. అలాంటిది, డైలాగ్స్ లేకుండా మూకీగా తియ్యడం అన్న విషయాన్ని మనం అభినందించకుండా ఉండలేము.
ఈ సినిమాలో కనిపించిన ఇద్దరు నటీనటులు చాలా బాగా నటించారు. ప్రత్యేకంగా శ్వేతాగుప్త తన అందచందాలతో.. చక్కని అభినయంతో ఆకట్టుకుంటుంది.
తొమ్మిది నిమిషాల తక్కువ నిడివి కలిగి ఉండడం వల్ల ఈ బుజ్జి సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
చెప్పుకునేంత మైనెస్ పాయింట్సేం లేకపోయినా, కొన్ని షాట్స్ ఇంకా బాగా ఫ్రేమ్ చేసుండవచ్చనిపిస్తుంది. ఆ బ్యాగ్‍తో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ మరింత బాగా చూపించచ్చు.
సాంకేతికంగా :
ఓ సైలంట్ మూవీతో ప్రేక్షకులను మెప్పించాలంటే, అందులోని సంగీతం చాలా బాగుండాలి..ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన బాలమురళి చాలా అద్భుతమైన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. రవి వర్మ కెమరా వర్క్ నీట్‍గా ఉంటుంది. ఎడిటింగ్.. సౌండ్ డిజైన్.. చాలా క్రిస్ప్ గా ఉంటుంది. ఈ కథను రచించి, దర్శకత్వం వహించిన అశ్విన్ గారికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు!
మొత్తంగా చెప్పాలంటే:
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే లఘు చిత్రం!
రేటింగ్: 3.75/5