వైద్యో..వ్యాపారో - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

vaidyo ...vyaapaaro

ఒకప్పుడు బతకలేక బడిపంతులనేవాళ్లు. ఇప్పుడు దర్జాగా జీవించడానికే డాక్టర్లు అనుకోవచ్చు.

పూర్వపు రోజుల్లో వైద్యుడంటే సాక్షాత్ భగవత్ స్వరూపం. రోగాలు తగ్గిస్తాడని, ప్రాణం కాపాడతాడని అందరూ ఎంత గౌరవం చూపించేవారో. అప్పట్లో వైద్యం వృత్తి కాదు. ఎం బీ బీ ఎస్ డాక్టరైనా, ఆర్ ఎం పీ డాక్టర్ అయినా తను నేర్చుకున్న విద్యనీ, అనుభవాన్నీ రంగరించి యమలోకపు ద్వారం దాకా వెళ్లిన రోగుల ప్రాణాలను కూడా వెనక్కు తెచ్చేవారు. అందుకే వైద్యుణ్ని నారాయణుడితో పోల్చారు. అప్పటి రోజుల్లో అది సమంజసం కూడా.

రాన్రాను కాలం మారింది. డాక్టర్లకి డిమాండ్ పెరిగింది. బోలెడంత కర్చుపెట్టి సీటు తెచ్చుకోవడం, చదువుకోవడం వల్ల అది తిరిగి సంపాదించుకునే దాకా మనశ్శాంతి ఉండదు. రోగికి, వైద్యుడికి మధ్య ఆత్మీయ బంధం కరువై, వ్యాపార, ధన బంధంగా మారుతోంది. ‘మా ఫ్యామ్లీ డాక్టర్’ అని ఆప్యాయంగా పిలుచుకునే అభిమానం ఇప్పుడెక్కడుంది? గతంలోలా అన్ని సమస్యలకూ ఒకే డాక్టర్ కాకుండా, శరీరాన్ని ఎన్నో, ఎన్నెన్నో విభాగాలు చేసి విభాగానికో స్పెషలిస్ట్ పుట్టుకొచ్చాడు. ఇంతకు ముందు రోజుల్లో రక్తం, మలం, మూత్రంల పరీక్షలు మాత్రమే సాధారణం, అలాంటిది ఇప్పుడు తామర తంపరగా టెస్ట్ లు. వాటికంటూ పెద్ద పెద్ద డయాగ్నస్టి సెంటర్ లు. ప్రతి టెస్ట్ కి ముందు ‘ఏ రోగం నిర్ధారణ అవుతుందో’ అని పేషేంట్ కి మానసిక ఆందోళన. భయం.

కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లూ, హాస్పిటల్స్ అతి తక్కువ కర్చులో డయాగ్నొసిస్ టెస్ట్ ప్యాకేజెస్, హెల్త్ చెకప్ అని, పబ్లిసిటీ చేస్తుంటాయి. కర్చు తకువే కదా, మన హెల్త్ ఒకసారి టెస్ట్ చేయించుకుందామనుకుని టెస్ట్ చేయించుకున్నామా? ఇహ అంతే సంగతులు. వచ్చే రిజల్ట్స్ తో అనుమానం మన మనసులో ప్రవేశించి పెనుభూతమవుతుంది.

చిన్నరోగం వచ్చినా బెంబేలు పడేంత సీన్లు. ఇల్లూ, ఒళ్లూ గుల్లే!. హాస్పిటల్స్ విషయంలో కూడా హోటల్ లకు ముందు పెట్టేట్టుగా, ”స్టార్’ అనే పదం చేర్చి వైద్య విధానాన్ని ఆకాశంలో నిలబెట్టింది.

విచిత్రమేంటంటే హోమియోపతి, ఆయుర్వేదం, యునానిలాంటి దేశీయ వైద్య విధానాలూ సామాన్య రోగికి అందరానంత దూరమైపోయాయి, బరువైపోయాయి.

అసలే ఇప్పుడు ప్రతి ఇంటినీ బి పీ, సుగరు, థైరాయిడ్ లాంటివి పట్టి పీడిస్తున్నాయి. నెల నెలా వాటిని పరీక్షలతో పర్యవేక్షించుకోవాలి. డాక్టర్లను కలిసి మందులు కంటిన్యూ చేయడమో, మార్పించుకోవడమో చేయాలి. ఇవికాక కిడ్నీలు పాడైతే డయాలసిస్, కాన్సర్ కి కిమోథెరపీ, రేడియేషన్ లాంటివి చుట్టుకున్నాయంటే సాధారణ ఉద్యోగులు, పెన్షన్ లు వచ్చేవాళ్లు తమకొచ్చేది నిత్యావసరాలకు వినియోగించాలో, మందులకూ-డాక్టర్లకూ వెచ్చించాలో అర్థంకాక మానసికంగా మదనపడిపోతుంటారు. కుంగిపోతుంటారు. ఒకవేళ అప్పటికప్పుడు ఏదైనా ఉపద్రవమొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే, రూం రెంట్, నర్సింగ్, స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ, ఆపరేషన్, ఎనస్తీషియా, ఆపరేటస్, మెడిసిన్స్, డిస్పోజబుల్స్, టెస్ట్స్ ...ఇలా వీటికి అంతే ఉండదు. ఓ పేద్ద సమ్మరీ. కొన్నాళ్ల తర్వాత డిస్చార్జ్ అయితే చేతుల్లో బిల్స్ తో బరువైన ఫైల్. బతికి బట్టకట్టినందుకు ఆనందించాలో, బిల్లులు కట్టలేక కుదేలైనందుకు బాధపడాలో తెలియని అయోమయపు స్థితిలో పెదవులపై శుష్కహాసం.

అసలే వ్యాధితో ఒక బాధ, పైనుంచి హాస్పిటల్ కర్చులు. రోగికి పరలోక నరకాన్ని ఇక్కడే చూపిస్తున్నాయి.

మనిషి బతకడానికే ఐనా, కొన్నింటిని డబ్బు సంపాదించే సాధారణ వృత్తుల పరిథిలోకి తీసుకు రాకూడదు. వ్యాపార రంగమూ కాకూడదు. వాటిలో మొదటిది వైద్యం. రెండోది విద్య. మూడోది న్యాయం. నాలుగోది నిత్యావసర పదార్ధాల వ్యాపారం. మానవ సంబంధాలకు, మనుగడకూ ఇవి మూల స్తంభాలు.

ఈ దేశంలో మనిషి జీవితానికి భరోసానిచ్చి, శతాయుష్షుని ప్రసాదించే వైద్యవిధానంగా వైద్యం ఎప్పుడు మారుతుందో అప్పుడు సామాన్యుడు రోగాలకు భయపడడు, ధైర్యంగా ఎదిరిస్తాడు.

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు