మగువకు చీరకట్టు, మగడికి పంచెకట్టు, ఊరికి మాటకట్టు, ఇదే మన పూర్వీకుల సంస్కృతి గుట్టు...! అంటారు. వీటిల్లో మన చీరకట్టంటే విదేశీయులకూ ఎంతో మోజు. చీరకట్టి బొట్టుపెట్టి తెగ మురిసిపోయే విదేశీ వనితలను పర్యాటక ప్రదేశాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో రంగు రంగుల డిజైన్లలో మనసును దోచేవి చీరలే. చీరను ఎప్పుడూ ఒకే తరహాలో కట్టుకోవాలని లేదు. సందర్భాన్ని బట్టి స్టైల్‌ని మార్చేందుకు ప్రయత్నించండి. మెర్మేయిడ్, ఫిష్, బాలీవుడ్.. ఇలా రకరకాల తరహాల్లో ప్రయత్నించండి. ఆకట్టుకునేలా కనిపిస్తారు.చీరలు కాస్త ఖరీదు ఎక్కువే అయినా అందుకు తగిన హుందాతనం కూడా కనిపిస్తుంది. చూడగానే జిగేల్ మనేలా పార్టీ, ఫంక్షన్లలో ఎక్కడికెళ్లినా సరే...తమ ప్రత్యేకతను చాటుకునేలా చీరలుంటాయి.
అలాంటివి సెలెక్ట్ చేసుకుని కట్టుకుంటే మగువలు చాలా అందంగా కనపడతారనడంలో అతిశయోక్తి లేదు. దీంతోపాటు ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి చాలామంది మోడ్రన్ డ్రస్సులనే వాడుతున్నారు. అలాంటి వారు దేశీయ అందమైన చీరలను ధరిస్తే మరింత అందంగా కనపడతారు. పైగా విదేశీయురాళ్ళు భారతదేశానికి వచ్చి చీరలనే ధరించేందుకు చాలా ఇష్టపడుతున్నారు. కాని మన దేశంలో పుట్టిన సంస్కృతిని మనం మరిచిపోతున్నాము. ఇప్పటికైనా మహిళలు చీరల్లో దర్శనమిస్తారని అనుకుందాం...