'0' (సున్న) విలువ - నరేష్

'0' (సున్న) విలువ

"0" (సున్న) విలువ :

"0" కి విలువెంత అని "పంతుల్ని" అడిగితే 
"సున్నా" కి విలువేంటి? "శూన్యం" అంటాడు!

"0" లేకుండా 
"పంతులూ" లేడు! ఏ "పండితుడూ" లేడు!

"అంకెల" దరిజేరి అది విలువలను పెంచు!
పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!

"సున్న" ప్రక్కన "0" చేరి "సున్నం" అయ్యె! 
"అన్న" ప్రక్కన "0" చేరి "అన్నం" అయ్యె!  
"ఆంధ్రా" లో "అన్నబియ్యం" కూడా కిలో "రెండు" అయ్యె!

"పది" మధ్యలో దూరి 
"పంది" గా మారె!
"నది" మధ్యలో దూకి 
"నంది" గా మారె!

ప్రతి "కొంప" లోనూ 
అది తిష్ట వేసింది!
"0" లేనట్టి "సంసారమే" లేదు! 

"కాంగి" లోనూ దూరె! 
"దేశం" లోనూ దూరె!
"కమలం" లోనూ దూరే !
అది "రాజకీయం" కూడా నడుపుచుండె!
"పంచాయతీ" నుండి "పార్లమెంటు" వరకూ అది మెంబరై ఉండ!

"గుండుసున్నా" 
అని ఎగతాళి చేయకు 
"గూండా" గా మారి రుబాబు చేయు!

"ఆరంభము" న "0"!  "అంత" మందున "0"!
"జననం" లో "0"! 
"మరణం" లో "0"!
"శూన్యం" లో "0"!  "అనంతము" లో "0"!

"ఇందూ", "అందూ" 
అను సందేహమేల!
"అండ", "పిండ", "బ్రహ్మాండము" లలో "0"!   

"సత్యం", 
"శివం", 
"సుందరం" 
అన్నింటిలోనూ అది అలరారుతోంది!

"0" తోటే ఉంది 
"అందం"!  "ఆనందం"!
"జీవితం" లో  చివరకి మిగిలేది "0" !

"గోవిందా"! "ముకుందా"! "శంభో"! "శంకరా"!
"సున్నాలు" గలవే ఈ భగవన్నామాలు అన్నీ! 
"ఏడుకొండల" వాడా! "వెంకట" రమణా!
నీకు నామాలతో పాటు అందు "సున్నాలు" లేవా!

తిరుపతిలో ఎక్కు ప్రతి "కొండ" లోనూ "0"!
తిరిగి దిగి వచ్చు ప్రతి "గుండు" లోనూ "0"!

ఇంత మహిమ గల "0" - 
మరి "గుడి" లోను లేదని, "బడి" లోను లేదని 
దిగులెందుకన్నా!

"గుడి" లోన జేరి "గుండి" గా,
"బడి" లోన జేరి "బండి" గా మారడం దాని "అభిమతం" కానే కాదన్నా! 
 
కనుక గుడి  "గంట" లో చేరి, బడి "గంట" లోనూ చేరి 
మోత మోగిస్తోందన్నా! 
ఆ మోత "నాదం" లోనూ "0"!

"కాలం" తోటే అది పరుగులిడుతోంది!
ప్రతి "గంట", 
ప్రతి "దినం", 
ప్రతి "వారం",
ప్రతి "పక్షం",  
ప్రతి "మాసం", 
ప్రతి "సంవత్సరం",
అన్నిటా ఉండి "కాలచక్రo" ను అది తిప్పుతోంది!

"వారం", "వర్జ్యం" అంటూ, "గ్రహం" - "గ్రహణం" అంటూ
"పంచాంగం" అంతా "సున్నా" ల మయమే!

"దేహం" తోటే అది అంటిపెట్టుకుని ఉండె!
"కంటి" లోనూ "0"!  
"పంటి" లోనూ "0"!
"కంఠం" లో "0"! 
"కండరం" లో "0"!
"చర్మం" లో "0"!  
"రక్తం" లో "0"!
 
"దాహం" లో "0"! 
"మోహం" లో "0"!
"రాగం" లో "0"! "అనురాగం" లో "0"! 
"సరసం" లో "0"!  
"విరసం" లో "0"!
"కామం" లో "0"!  
"క్రోధం" లో "0"! 
"నరనరం" లో అది "జీర్ణించుకు" ని పోయె!

"రోగం" లో "0" ! దానికి చేసే "వైద్యం" లో "0"!
"అంగాంగము" న "0" అంటిపెట్టుకుని ఉండ
"దేహం" తోటే అది దహనమగుననిపించె! 
తీరా చితా "భస్మం" చూడ అందు కూడ కనిపించె!
మన గతులనే మార్చివేసి అది "గంతు" లేస్తోంది!

ఆంగ్లేయ భాషలో అది ఓ రూపమును దాల్చె!
సున్నాలు ఉంటే "గుడ్",  సున్నాలు లేకుంటే "బాడ్"
అని ఇంగ్లీషు బాబులకు కూడా తెలుసు!

సున్నాలు లేకుంటే వారికి "ఫుడ్" లేదు!
అసలు "GOD" బొడ్డున "0" గడ్డకట్టుకొనుండె!
"సున్నా" కి విలువ లేదనకు బాబూ! 
బాబు మధ్యన దూరి "బాంబు" గా మారు!

పిచ్చి "పంతులు" సున్నాకి విలువ లేదంటే...
రెచ్చిపోయిన "0" విశ్వరూపము దాల్చె!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు