చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

ఒకానొకప్పుడు, ఇళ్ళళ్ళొ ఉండే చిన్నపిల్లలు కానీ, చదువుకునే పిల్లలు కానీ, తమ స్నేహితులు చెప్పగా వినో, లేక వారిదగ్గర చూసో, ఆ వస్తువు తమవద్దకూడా ఉండుంటే, ఎంత బావుండేదో అని అనిపించేది..అనుకుంటే సరిపోతుందా, ఆ వస్తువు కొనాలంటే, ముందు అమ్మని ఒప్పించాలి. ఆవిడ భర్తని ఎలాగోలాగ ఒప్పించాలి. ఇంత తతంగం ఉండేది. కారణం, ఇంటికంతటికీ ఉద్యోగం చేసి సంపాదించేవాడు, ఆ ఇంటి మగాడు మాత్రమే. ఇంటావిడ పిల్లల చదువులూ, బాగోగులూ చూసుకునేది… జీతాలు కూడా అంతంతమాత్రంగానే ఉండేవి… ఆ వచ్చేజీతంలోనే, పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ చేయగలిగేవారు. దానికి సాయం పిల్లలుకూడా ఓ క్రమశిక్షణలో పెరిగేవారు… అమ్మదగ్గర చనువున్నా, తండ్రిని ఏదైనా అడగడానికి కొద్దిగా భయపడేవారు.. అలాగని ఆయనేదో కొట్టేస్తాడూ అనికాకపోయినా, అదో రకమైన గౌరవం అంటే బాగుంటుందేమో.. ఆ వచ్చే జీతంలోనే, ఇంట్లోకి సరుకులూ, పండక్కి బట్టలూ, వచ్చేపోయే చుట్టాలకి పెట్టిపోతలూ.. ఇవేకాకుండా ఇంట్లో ఏ పెద్దవారైనా ఉంటే, వాళ్ళ వైద్యం ఖర్చులూ… ఒకటేమిటి, దేని  Priority  దానికుండేది… అలాటప్పుడు ఈ పిల్లల స్వప్నాలు తీరడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. ఇంటి ఇల్లాలికి , తన భర్త పడుతున్న పాట్లన్నీ తెలుసు పాపం, అయినా పిల్లల కోరికల విషయం, ఎప్పుడో ఆయన చెవిన వేస్తుంది.. ఆయనకి మాత్రం ఉండదూ పాపం, అడక్కడక్క పిల్లలు అడిగినవాటిని కొంటే బావుంటుందనీ? కానీ , పరిస్థితులు అనుకూలించొద్దూ? పైఏటికో, లేక ఏదో సందర్భంలోనో చూద్దామనేవారు… అలా ఆ రోజుల్లో, ఈ తరం తల్లితండ్రుల కోరికలూ, కలలూ , కల్లలుగానే మిగిలిపోయాయని , వీరనుకుంటారు ( ఈతరం వారు )..ఏ గొప్ప స్థితిమంతులో తప్ప, నూటికి 90 శాతం , మధ్యతరగతి వారి పరిస్థితులు అలాగే ఉండేవి…

కాలం ఎవరికోసమూ ఆగదుగా.. ఆనాటి పిల్లలూ పెరిగిపెద్దయారు, పెళ్ళిళ్ళు చేసికుని , పిల్లల్ని కన్నారు. తేడా ఏమిటంటే, ఆరోజుల్లో ఎంతమంది పిల్లలుంటే అంత శుభం అనుకునేవారు.. కానీ ఈరోజుల్లో, ఓ పిల్లో పిల్లాడో ఉంటే చాలనుకునే రోజులు.. కారణాలనేకం ఉన్నాయి. ఆ చేసేదేదో ఉన్న ఒక్క పిల్లకో, పిల్లాడికో చేసేయాలనే దృఢనిశ్చయం .నూటికి 70 మందిదాకా ఈరోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి పరిణామమే..మొదటి బిడ్డ పుట్టేలోపలే, అన్ని సదుపాయాలూఉండే ఓ స్వంత  Apartment,  ఆఫీసులకెళ్ళడానికి ఓ కారూ ఏర్పాటు చేసేసికోగలుగుతున్నారు… వాటికి కట్టే  E M I  ల గురించి వద్దు ఇక్కడ,..

చెప్పొచ్చేదేమిటంటే, ఒకానొకప్పుడు ఏ మంత్రసానో పురుడు పోయగా, ఏ పెంకుటింట్లోనో పెరిగిపెద్దయిన , అదే పిల్లో, పిల్లాడో , తాము జన్మనిచ్చే పిల్లలు మాత్రం అన్ని సౌకర్యాలూ అనుభవించేలా చూసుకోగలుగుతున్నారు… ఇదికూడా చాలామంచి పరిణామమే…ఇక్కడ జరుగుతున్నదేమిటంటే ఆ పుట్టిన బిడ్డ ఓ  Silver Spoon  తోనేకదా పుట్టిందీ? చేసుకున్నవాడికి చేసుకున్నంతా అనుకుందాం…  స్తితిగతులను బట్టి ఆ బిడ్డని రోజంతా చూసుకోడానికి ఓ ఆయా, స్నానం చేయించడానికి ఓ ఆయా , సాయంత్రాలు తిప్పడానికి ఓ ఆయా.. ఇలా చెప్పుకూంటూ పోతే,  ఆ బుల్లిప్రాణిని చూసుకోడానికి ఇంటినిండా జనమే. వాడిని కాలుకిందపెట్టనీయరు… కాలికి అడుగూ, నోటికి మాటా రావడం తరవాయి, మొట్టమొదట వాడి చేతికి వచ్చే భూషణాలు—ఓ చేతిలో  TV Remote,  ఇంకోచేతిలో   ఓ  Smart Phone,  చెరోచెవిలోనూ  Ear Phone  లనబడే పువ్వులూ… బయటకు వెళ్ళాలంటే, ఆర్దికస్తోమతని బట్టి కారూ.. చాలా స్కూళ్ళలో స్కూలు బస్సు  Compulsory  కాబట్టి కానీ, లేకపోతే రోడ్లమీదతిరిగే బస్సుల గురించి తెలిసికునే అవసరమే ఉండేది కాదు…వాడి నోటినుండి ఏదైనా అడిగాడంటే, క్షణాల్లో వాటిని తెప్పించేయడం. అది అవసరమా కాదా అన్నది వేరే విషయం… కర్మకాలి ఇంట్లో ఉండే ఏ పెద్దవారో, “ ఎందుకురా ఇప్పణ్ణుంచీ ఇవన్నీ.. “ అని అడిగారా.. చూసుకోండి మాకెలాగూ ఆ అదృష్టం కలగలేదూ, పోనీ మా పిల్లలైనా అనుభవించనీయండి..అని ఓ సమర్ధింపు.

ఈ రోజుల్లో చాలామందిలో చూస్తున్నదేమిటంటే, తమ పిల్లలకి  No . అని చెప్పే ధైర్యం లేకపోవడం. వాళ్ళడిగినదేదైనా సమకూర్చేయడం. ఇవన్నీ తప్పనడం లేదు, మంచిదే.. కానీ ఆ పిల్లలకి ప్రతికూల పరిస్థితులగురించికూడా నేర్పస్తే బావుంటుందేమో.. రోజులన్నీ ఒకేలా ఉండకపోవచ్చు..ఆనాటి బళ్ళు ఈనాటి ఓడలయాయి… కా..నీ.. ఈ ఓడలు రేపు బండిగా మారిపోతే, తట్టుకునే శక్తి ఉంటుందంటారా?

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు