జయజయదేవం - డా. ఎస్. జయదేవ్ బాబు

 

ప్రథమ భటుడు:  మీకీ విషయం తెలుసా? రాణివాసానికొచ్చిన ఒక అందమైన పల్లెపిల్లతో మన రాజుగారు లేచిపోయారు!!
మహా మంత్రి: తెలుసు, తెలుసు!!
ప్రథమ భటుడు: మరైతే ఈ రాజ్యాన్ని పరిపాలించబోయేదెవరు?
మహామంత్రి: నేను!!
ప్రధమభటుడు: మహారాణిగారిందుకు ఒప్పుకున్నారా?
మహామంత్రి: ఒప్పుకోక ఏం చేస్తారు పాపం?
ప్రధమభటుడు: మహారాణిగారెక్కడున్నారు?
మహామంత్రి: కారాగారం లో!!

**************

 

వంకర శర్మ: నీ సంగీత సాధనకి మెచ్చి, నీకు రాజుగారు గండపెండేరం తొడిగారుగా? దిగులుగా వున్నావేం?
టింకర శర్మ: ఆ గండపెండేరాన్ని తాకట్టు పెట్టి, పిల్ల పెళ్ళి చేశాను!     
వంకర శర్మ: భారం తగ్గిందిగా?
టింకర శర్మ: ఆ గండపెండేరాన్ని తనకిస్తే గాని , పెళ్ళాన్ని  ఏలుకోనని అమ్మాయిని ఇంటికి పంపించేసాడు అల్లుడు!!

 

 

**************
 

 

సేవకులు: అమ్మా... అజేయుడు, అభేద్యుడు, చండశాసనుడని పేరు గడించిన మా అయ్యగారిని కలవాలి...!
భార్యామణి: దొడ్లో అంట్లు తోముతున్నారు, కలిసి తగలడండి!! పక్కన గొందిలోంచి పోండి!!

 

 

 

**************

 

 

రాజ గురువు: పనీపాటల్లేవని, మంత్రికీ, సేనాధిపతికీ స్వర్ణ కరచాలనం చేసి పంపించేశావు... ఇక నీకెందుకు దిగులు రాజా?
రాజు: నాకు మీరు స్వర్ణకరచాలనం చేసి పంపించేస్తే, పొలం దున్నుకుని, హాయిగా బతికిపోతాను రాజ గురువా!! మంత్రినీ, సేనాధిపతినీ చూస్తే అసూయగా వుంది!!

 

 

 

**************
 

పరిచారిక: మయూర పించ వింజామర మీద మామూలు పన్నీరు గాక, అత్తరు జల్లి, వీచాను!
ఇంకోపరిచారిక: రాజుగారు మెచ్చుకున్నారా?
పరిచారిక: మెచ్చుకోవడమే గాక, నన్ను చూసి కన్నుకొట్టారు!
ఇంకోపరిచారిక: అదృష్టవంతురాలివి!!
పరిచారిక: అదృష్టమా, పిండా కూడా, రాణిగారు చూసేసింది!!
ఇంకోపరిచారిక: బాబోయ్... తర్వాత ఏం జరిగింది?
పరిచారిక: నా చెంప మీద, రాణిగారి ఐదువేళ్ళ గుర్తులు నువ్వు గమణించ లేదా??

**************


 

మంత్రి: రాజ్యం లో వయోవృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది మహారాజా! పైగా వాళ్ళకి జబ్బులు కూడా!!
మహారాజు: మన రాజ వైద్యుడిని నియమించి, వాళ్ళని ఉచిత వైద్యం, మందులు అందించవలసిందిగా ఆదేశిస్తున్నాను!!
మంత్రి: మన రాజవైద్యుడినా... ఆయన చేతి మాత్ర వైకుంఠ యాత్ర కదా!!
మహారాజు: మరి... వయోవృద్ధుల సంఖ్య తగ్గేదెలా??

 

 

**************

ఒక పౌరుడు: నల్లటి కోడె తాచులాంటి జడను చూసి ముచ్చట పడి ఆ పిల్లను పట్టుపట్టి చేసుకున్నాడు, మంత్రి గారి కుమారుడు! ఏం జరిగిందో తెలుసా?
ఇంకోపౌరుడు: నేను చెబుతాను... శోభనం రాత్రిన మంత్రి కుమారుడు మరణించాడు!!
ఒక పౌరుడు: అదే..! నిజంగానే... పెళ్ళికూతురు జడ కోడి త్రాచట!!

 

 

**************

 

సేవకుడు: మంత్రిగారు తాగి తందనాలాడుతున్నారు! రాజు గారికి ఫిర్యాదు చేయ్యాలి... నన్ను లోనికి అనుమతించు!
భటుడు: ఇప్పుడు వీలు కాదు! లోపల రాజుగారు, తాగి తందనాలాడుతున్నారు!!

 

 

 

**************
 

సేవకుడు114: గాలిలో ఎగిరే ప్రయత్నం మీద, యువరాజు గారు, కొండ శిఖరాగ్రం నుంచి లోయలోకి దూకారటగా? ఏమయ్యారూ?
సేవకుడు 203: ఆయన గారి ఎముకలేరడానికే కదా, మనం ఈ లోయలో తిరుగుతున్నది?! మాట్లాడక , పనిచూడు!

 

 

 

**************
 

ఉపమంత్రి: రాజు గారు గెడ్డం పెంచుతున్నారు... రాణిగారు గర్భం దాల్చారా?
మంత్రి: (రహస్యంగా) రాజు గారి ఉంపుడు గత్తె బిడ్డ తల్లట!!


 

 

 

.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి