విహారయాత్రలు ( మలేషియ ) - కర్రా నాగలక్ష్మి

maleshiya

కౌలాలంపూర్

కౌల అంటే. రెండు నదులు కలిసిన ప్రదేశం లేక నది సముద్రంలో కలిసిన ప్రదేశాన్ని స్థానిక భాషలో ‘ కౌల ‘ అని అంటారు , ‘ లంపోర్ ‘ అంటే బురద అని అర్దం .

కౌలాలంపూర్ కి ఒక కిలోమీటరు దూరంలో ప్రవహిస్తున్న ‘ లంపూర్ ‘ నది ‘ గోంబర్ ‘ నదిలో కలుస్తోంది . 1857 లో  యీ ప్రాంతం సెలంగోరు సుల్తాను పరిపాలనలో వుండగా  గోంబర్ నది క్లాంగ్ నదీ సంగమ ప్రాంతంలో టిన్ను గనుల త్రవ్వకాలు అప్పటి సుల్తాను పర్యవేక్షణ లో సాగేయి . గనుల త్రవ్వకాలలో నియమించబడ్డ కార్మికుల నివాసాలకు గాను అడవిలో కొంతభాగాన్ని చదును చేసి పాకల నిర్మాణం గావించేరు . గనులపై ఆధిపత్యం కొరకు కార్మికులలో గొడవలు తరచూ జరుగుతూ వుండేవి . ఈ కార్మికులు తరచూ మలేరియా రోగగ్రస్తులవుతూ వుండడం వల్ల చుట్టుపక్కల దేశాలైన చైనా , జావా ల నుంచి కార్మికులను దిగుమతి చేసుకోవలసి వచ్చేది . ఆ పరిస్థితులలోనే 1859 లో మొదటి టిన్నుఖనిజం నది నుంచి సముద్రానికి పడవలలో తరలించి ఓడ ద్వారా యెగుమతి చేసేరు . కార్మికులను నియంత్రించి  వారి పై ఆధిపత్యం వహించేందుకు వారిలో ఒకరిని యెంచుకొని వారికి ‘ కపితన్ సిని ‘ అనే బిరుదు యివ్వసాగేరు అప్పటి సుల్తానులు .

టిన్ను ఖనిజం ఓడలలో యెక్కించేందుకు వీలుగా నదీ తీరాన ‘ పుదు ‘ , ‘ బతు ‘ లలో కార్మికుల నివాసాలు నిర్మమింపబడ్డాయి .

మలేషియ స్వాతంత్రం పొందిన తరువాత యీ చిన్న చిన్న జనావాసాలన్నింటిని కలిపి కౌలాలంపూర్ అని పిలువ సాగేరు .

మలేషియ రాజధానిగా కౌలాలంపూర్ ను యెంచుకొని చుట్టుపక్కల వున్న  గ్రామాలను కలుపుకొని నగరంగా రూపుదిద్దుకోసాగింది . విదేశీ పర్యాటకుల దృష్టిలో ప్రపంచం లో యేడవ స్థానాన్ని సంపాదించుకుందీ నగరం . అలాగే విదేశీ సీనియర్ సిటిజన్లు నివాసయోగ్యంగా యెంచుకున్న నగరాలలో మొదటి స్థానంలో వుంది . మలేషియ స్వతంత్రదేశం గా రూపుదిద్దుకున్న తరువాత  గ్రామంగా వున్న కౌలాలంపూర్ 1970 లలో నగరంగాను 1980 తరువాత మహానగరంగాను రూపుదిద్దుకుంది . పరిపాలనా భవనాలు , విధ్యాలయాలు , కళాశాలలు వ్యాపార సంస్థలు నిర్మింపబడ్డాయి .

కొన్ని యురోపు సంస్థలు యిక్కడి పనివారి వేతనాలు చాలా చవుకగా వుండడం తో వారి సంస్థలను యీ దేశానికి తరలించటంతో ముఖ్యంగా యెలక్ట్రోనిక్స్ కంపెనీలు అవతరించేయి . 1980 లలో యీ దేశంలో చమురు నిక్షేపాలు బయట పడడంతో  , అప్పటికే  వున్న రబ్బరు పరిశ్రమ వల్ల  ప్రపంచ సంపన్నదేశాల దృష్టిలో పడింది . రాజకీయ , సామాజిక స్థిరత్వం వల్ల పర్యాటకులు సురక్షిత పర్యాటక కేద్రంగా గుర్తించేరు . దేశప్రజలు శాంతి కాముకులు కావడంతో దేశం అతి తక్కువ కాలంలో అభివృద్ది వైపు సాగిపోయింది .

ప్రపంచంలో గల అతి పెద్ద పది మాల్స్ లో మూడు కౌలాలంపూర్ లో వున్నాయంటే గొప్పేమరి .

1999 వరకు మలేషియ రాజధానిగా వున్న కౌలంపూర్ లో జననివాసాలు పెరిగి పోవడంతో పాలకులు పుత్రజయ కు పరిపాలనా భవనాలను తరలించి దానిని దేశరాజధానిని చేసేరు .

కౌలాలంపూర్ మహానగరంలో పర్యాటకుల సౌకర్యార్దం MRT ( మాస్ రేపిడ్ ట్రాన్సిట్ ) , లైట్ మెట్రొ , మోనొ రైలు , కంమ్యూటర్ రైల్ , ఎయిర్ పోర్ట్ లింక్ , యెలివేటెడ్ బస్ మొదలైనవి అందుబాటులో వున్నాయి .

కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో దిగితే సిటీ సెంటరువరకు  ఎయిర్ పోర్టు లింక్ లో సులువుగా చేరుకోవచ్చు . సిటీ లో తిరగడానికి పైన వుదహరించిన యే సేవనైనా మనం ఉపయోగించుకోవచ్చు . సైట్ సీయింగ్ కి చాలా సంస్థలు టూరిస్ట్ సర్వీసులను నడుపుతున్నాయి . ‘ బండరాయ ‘ బస్టాండు నుంచి సైటుసీయింగు బస్సులు దొరుకుతాయి .

మేము మొదటిమారు 2001 లో మలేషియా వెళ్లినపుడు యింత చిన్న దేశం సాధించిన అభివృద్ది చూస్తే ఆశ్చర్యాన్ని కలుగ జేసింది . మనదేశంలో అప్పటికి మెట్రో ఒక్క కలకత్తాలోనే వుండేది . కలకత్తా తెలుసుగా మహానగరాలలో చెత్తా చెదారం , కుళ్లు కంపులలో మొదటిస్థానంలో వుంటుంది . మలేషియాలో నీటుగా వున్న రోడ్లు చూసి యెంతబాగున్నాయో అనుకున్నాం , సింగపూర్ అంతకన్నా నీటుగా వుండేది . కౌలాలంపూర్ లో మూడు నాలుగు ప్రదేశాలలో శరవన భవన్  , ఆనంద్ భవన్ వారి రెస్ట్రాంట్స్ వున్నాయి . లిటిల్ యిండియ లో స్థానిక తమిళ తంబిలచే నడపబడుతున్న అనేక దోశ యిడ్లీల బళ్లు దర్శనమిస్తాయి . ఇక్కడ దొరికే ఐటమ్స్ చవుకగా వుంటాయి .

మలేషియ వారు మనదేశస్థులను ‘ నాసి కంధార్ ‘ అని అంటారు . దీని వెనుక కథేంటంటే పూర్వం రాజులకాలంలో మనదేశపు వ్యాపారస్థులు బియ్యం మలేషియా తీసుకు వెళ్లి కావిళ్లు వేసుకొని అమ్మేవారుట , ‘ నాసి ‘ అంటె బియ్యం ‘ కంధార్ ‘ అంటే బుజం మీద మోసేది అంటే కావిడ అన్నమాట , అలా యిప్పటికీ  వీరు భారతీయులను ‘ నాసికంధార్ ‘ లు అంటూవుంటారు .

కౌలాలంపూర్ లో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం .  డౌన్ టౌనులో అలా తిరిగి అన్ని భవంతులనూ చూడడం ఓ అధ్భుతం . సిటిసెంటరు మాల్ కి MRT లో వెళ్లి విండోషాపింగ్ చేసుకొని అక్కడ వున్న అన్నలక్ష్మి లో లంచ్ చెయ్యడం ఓ అనుభూతి .

వీటికి తోడు ‘ పుసత్ భండార్ ‘ ( సిటీ సెంటరు ) లో వున్న కవలభవంతులు అదే ట్విన్ టవర్స్ , వాటి కెదురుగా వున్న కెయెల్ టవర్ రివాల్వింగ్ రెస్ట్రాంటు కౌలాలంపూర్ కి అదనపు ఆకర్షణలు .

ముందుగా మనం కవలభవంతుల గురించి తెలుసుకుందాం .

ప్రపంచంలో అతియెత్తైన భవనంగా ప్రశంసలందుకుంటున్న యీ భవంతుల నిర్మాణం 1993 లో మొదలుపెట్టబడింది . 88 అంతస్తుల భవన నిర్మాణానికి  సుమారు 3,95,000 చదరపు అడుగుల భూమి కావలసిరాగా ఫార్ములా కార్ రేసింగ్ మైదానాన్ని యీ భవన నిర్మాణానికి తీసుకున్నారు . ఈ భవనాలకు పునాది సుమారు 66 మీటర్ల నుంచి 114 మీటర్ల లోతు త్రవ్వేరు . ఇదికూడా ప్రపంచ రికార్డనే చెప్పాలి . 1996 లో యీ భవంతులు పూర్తి చెయ్యడినా 1997 లో ‘ పెట్రొనాస్ ‘ సంస్థ మొదటి విడత పనివారిని తరలించింది . 1999 ఆగష్టు 1 వ తేదీన అప్పటి మలేషియ ప్రధాన మంత్రి యీ భవంతులను జాతికి అంకితం చేసేరు . ఈ భవంతులలో చాలా భాగం మలేషియ దేశానికి చెందిన పెట్రొనాస్ ఆఫీసులు వున్నాయి . దేశవిదేశీ ప్రతిష్ఠాత్మకమైన అనేక వాణిజ్య సంస్థలు వున్నాయి .

ఈ భవంతుల పైకి వెళ్లడానికి రోజుకి వెయ్యమందిని మాత్రమే అనుమతిస్తారు . సోమవారం శలవు , మేం వెళ్లినది సోమవారం కావడంతో పైకి వెళ్లే అవకాశం లేకపోయింది , తరవాత మూడునాలుగుసార్లు వెళ్లినా మాకు ఆరోజుకి టికెట్లు అయిపోయనేవారు . అప్పట్లో ఆన్ లైన్  బుకింగ్ చేసుకునే అవకాశం లేదు . అందుకని పైకి యెక్కలేకపోయేం . కిందనుంచి తలెత్తి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయా ? అన్నట్లున్నాయి . అందులో ఓ టవరు కాస్త వంగి వుండడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యేం . అలా నిజంగా వంగి వుందా లేక మన కి అలా కనిపిస్తోందో తెలీలేదు . ఫొటోలలో కూడా పడమటి భవంతిగా పిలువబడే ఒకటవ భవంతి తూర్పు వైపుకి కాస్త వాలి వుండడం చూడొచ్చు .

62 వ అంతస్థు పూర్తయేసరికి అక్కడి నిర్మాణం లో పనిచేస్తున్న వారు భవంతి 25 మిల్లీమీటర్లు పక్కకి ఒరిగినట్లు గమనించేరు . వేరేదారి లేక ఒరిగిన అంతస్థులపైన మిగతా 16 పదహారు అంతస్థలనిర్మాణం జరిగింది . అందుకే ఈ భవంతులలో పడమటి భవంతి కాస్త రెండవ భవంతి వైపు ఒరిగి కనిపిస్తుంది . ఈ భవంతులు 88 అంతస్థలు భూమి పైన 5 అంతస్థులు భూమి లోపల వున్నాయి .

ఈ రెండు భవంతులను కలుపుతూ 41 , 42 అంతస్థులలో  రెండస్థుల స్కై బ్రిడ్జ్ నిర్మాణం చేసేరు . ఈ స్కై బ్రిడ్జ్ పై నడుస్తూ వుంటే ఆకాశంలో నడుస్తున్న అనుభూతి కలగడం ఒకకారణమైతే , భవన నిర్మాణాన్ని పటిష్టం చెయ్యడం మరోకారణం .

ఈ బ్రిడ్జ్ సుమారు 170 మీటర్ల యెత్తున సుమారు 58.4 మీటర్ల పొడవు వుండి సుమారు 750 టన్నుల బరువుండి ప్రపంచంలో అతి యెత్తున వున్న రెండతస్థుల స్కై బ్రిడ్జ్ గా పేరుపొందింది . కవల భవంతులను సందర్శించేవారు యిక్కడే ఒక భవంతినుంచి మరొక భవంతికి లిఫ్ట్ కోసం మారవలసి వుంటుంది . చుట్టూరా గాజు అద్దాలు బిగించి వున్న దీని మీద నడిచేటప్పుడు నేల , చుట్టూ వున్న భవంతులు , ఆకాశం కనిపిస్తూ వింతైన అనుభూతినిస్తుంది యీ స్కై బ్రిడ్జ్ వీద నడక .

ఈ భవంతులలో ఒక్కో భవంతికి 40 చొప్పున లిఫ్టులున్నాయి . కొన్ని బేసి అంతస్థుకు తీసుకు వెళ్లేవి మరికొన్ని సరి అంతస్థులకి తీసుకువెళ్లేవి వున్నాయి . వీటి నిర్మాణం రెండంతస్థలలో వుంటుంది . మొత్తం కిందా పైనా కలిపి 52 మందిని  తీసుకెళ్లే సమర్ధతను కలిగివుంచాయి .

ఈ భవంతుల క్రింది అంతస్థులలో మలేషియ లోని అతి పెద్ద మాల్ గా చెప్పబడే ‘ సురియ KLCC ‘ వుంది.

ఈ మాల్ పెద్దదే కాదు లోపల అలంకరణ , అద్దంలా మెరిసి పోయే నేల , పైన అద్దాలు కళ్లు తిప్పుకోనివ్వవు . ఇందులో దేశవిదేశాల బ్రాండెడ్ షాపులు వున్నాయి . కాళ్లు నొప్పులు పెట్టేంత వరకు తిరగడం , అలసట అనిపించగానే అక్కడ వుండే బెంచీలమీద కూర్చోవడం , రోజంతా తిరిగినా పూర్తిగా చూడలేదేమో అని అని పించింది . ఈ మల్ లో షాపులేకాక పెద్ద లైవ్ షో లు జరిగే ఆడిటోరియం , అక్వేరియం , ఆర్ట్ గేలర్ వున్నాయి . మాల్ కి అనుబంధంగా వున్న పార్కికి గాను 17 యెకరాల భూమిని వాడేరు . ఇందులో పిల్లలు ఆడుకోడానికి కావలసిన అన్ని సదుపాయాలు వున్నాయి . వాకింగ్ ట్రాక్ లతో పాటు సేదతీరటానికి నీడను కల్పించి బెంచీలు వేసేరు . మొక్కలు , లాన్ పెంచుతున్నతీరు ప్రతీ వారినీ ఆకట్టుకుంటుంది .

ఈ భవంతులకు 2006 లో మరమ్మత్తులు జరిపేరు . ప్రపంచంలో యెక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా యీ భవంతులలోకి పర్యాటకుల  ప్రవేశం నిషేధిస్తారు .

మలెషియ వెళ్లదలచుకున్నావరు ముందుగా యీ భవంతులపైకి వెళ్లగలిగే టికెట్స్ తీసుకొని వెళితే అక్కడిదాకా వెళ్లేక భవంతి పైకి వెళ్లలేకపోయామే అనే నిరాశ తప్పుతుంది .

ఈ భవంతుల చుట్టూరా వున్న  పెద్ద భవంతులు ఆకట్టుకుంటాయి . వాటిలో పబ్లిక్ బ్యాంక్ భవంతి ప్రత్యేకంగా కనబడుతుంది .

ఈ ప్రదేశంలో మరో భవంతి పర్యాటకులను ఆకర్షిస్తూ వుంటుంది . అది వాటర్ టాంకు ఆకారం లో వుంటుంది . దీనిని KL Tower అని అంటారు . మలేషియ టెలికమ్యూనికేషన్స కోసం నిర్మించిన టవరు , ప్రపంచం లోని టెలికమ్యూనికేషన్స్ టవర్స్ లలో యేడవస్థానంలో వుంది . 22 అంతస్థులు నాలుగు లిఫ్ట్లు , 2058 మెట్లు వున్నాయి . ఈ టవరు నిర్మాణంలో అడ్డుగా వున్న ‘ జెలుటోంగ్ ‘ వృక్షానికి యెటువంటి నష్టం వాటిల్లకుండా నిర్మించేటప్పుడు 4,30,000 రింగెట్స్ ( 1 రింగెట్  సుమారు 12 రూపాయలకు సమానం )  నష్టాన్ని భరించి నిర్మించేరు . ఇందులో టెలికమ్యూనికేషన్స్ వారి ఆఫీసులతో పాటు అబ్జర్వేటరి , రివాల్వింగ్ రెస్టొరంట్ వున్నాయి . ట్విన్ టవర్స్ టూర్ తో పాటు కెయెల్ టవరు , రివాల్వింగ్ రెస్టొరాంట్ లో డిన్నరు కలిపి అన్ని పెద్ద చిన్న టూరు ఆపరేటర్లు ఒకరోజు ట్రిప్పుగా యిస్తున్నారు . రివాల్వింగ్ రెస్టొరెంట్ లో భోజనం తీసుకొనే వారు నాలుగు నుంచి ఆరు గంటలు అక్కడ గడపొచ్చు . కాని యిక్కడ ఆహార పదార్ధాల వెల చాలా యెక్కువగా వుంటుంది , మంసాహారంలో అన్ని రకాల పదార్ధాలు వుంటాయి . శాఖాహార పదార్ధాలు వుండవు .

రాత్రి పూట ట్విన్ టవర్స్ KL టవరు చూడడం ఓ అనుభవం , చీకటి పడేవరకు అక్కడ వుండి దీపాల వెలుగులో ఆకాన్నంటే భవంతులను చూడ్డం మాటలలో వర్ణించలేని అనుభూతి .

వచ్చేవారం కౌలాలంపూర్ ని గురించిన మరికొన్ని విశేషాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ శలవు .

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి