దెయ్యలకీ వారఫలాలున్నాయి - ఈడూరి

devils horoscope

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికతో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించడమే ఈ శీర్షిక వుద్దేశ్యం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడం మాత్రమే ఈ ప్రక్రియ. మొదటగా దయ్యాలాకి వారఫలాలుంటే ఎలా వుంటుంది అన్న కాన్సెప్టుతో మొదలెడదాం.

మేషం:

ఈరాశి దయ్యాలకి ఈ వారం చిన్నచిన్న సమస్యలు తప్పవు కానీ భయపడాల్సిన పనిలేదు సర్దుబాటు కాగలవు. మీరు ఎక్కిన చెట్టు మరో దయ్యం ఆక్రమించుకోడం కారణంగా కాస్త యుధ్ధ వాతావరణం ఏర్పడినా నెమ్మదిగా సర్దుకుంటుంది. చాకచక్యంగా భూతవైద్యుడి భయం చూపిస్తూ సమస్యని చక్కదిద్దుకుంటారు. శని, ఆదివారాల్లో శ్మశానం చుట్టూ 108 ప్రదక్షిణలు చెయ్యండి. ఏదిఏమైనప్పటికీ కొన్ని కొత్త దయ్యాలతో స్నేహం మీకు మంచి ఆనందాన్నిస్తుంది.   

వృషభం:

ఈవారం మీరు ఆవహించినదల్లా బంగారం. ఎంత హీరొనైనా ఆవహించి జీరోని చెయ్యగలరు. రాజకీయ నాయకులని ఆవహించడం ద్వారా సాటి దయ్యాల ముందు మీరు హీరోగా పోజు కొట్టగలరు. అన్ని విధాలుగా మీకు అనుకూలమైన వారం. కాలుతున్న శవం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే ఫలితాలు మరింత బాగుంటాయి.

మిధునం:

అనుకున్న కోర్కెలు నిదానంగా నెరవేరతాయి. ఏనాటినుండో మీ భార్యని ఆవహించాలనుకున్న మీ కల ఈవారం నెరవేరే సూచనలు కనబడుతున్నాయి.  ఇదే సమయంలో మీకు శవఘోష ప్రభావం ఎక్కువగా వున్నందున ఏడు శనివారాలు శనీశ్వరుడి గుడిచుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం వుత్తమం.

కర్కాటకం:

ఈవారం ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ దిగులు పడాల్సిన పనిలేదు. చెండీయాగం చేస్తే ట్రెండీగా వుంటుంది. ఒకటి రెండు బీద దయ్యాలకి రెండేసి లీటర్ల రక్తం దానమివ్వడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు.  

సింహం:

ఎంతసేపూ మీ వెంటే తిరుగుతూ తోటి దయ్యాలకి మీమీద చాడీలు చెప్పే మీ సహచరదయ్యాలు తమ  తప్పు తెలుసుకుని మిమ్మల్ని క్షమించమని కోరతాయి. దయ్యాలలో అతితక్కువగా కనబడే క్షమాగుణం కలిగిన మీరు వెంటనే క్షమిస్తారు, అంతకుమించి మీరు చెయ్యగలిగింది కూడాలేదనుకోండి అది వేరే విషయం. ఈవారం మీరు తలపెట్టిన ఏ కార్యక్రమమైనా ఉత్తరదిక్కు వైపుగా మొదలెడితే మంచి ఫలితాలు కలుగుతాయి.     

కన్య:

ఈవారం మీకు పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త దయ్యాల పరిచయం కలుగుతుంది. కొన్ని మహిళా దయ్యాల నుండి ఇబ్బందులు రావడం బాధ కలిగించినా పురుష దయ్యాల సహకారం మీకు ఆనందాన్నిస్తుంది. ఎన్నాళ్ళుగానో మీ నాయకత్వంలో ఒక సమూహం ఏర్పరుచుకోవాలన్న మీ కోరిక నెరవేరుతుంది. 

తుల:

ఈవారం కొద్ది ఒడిదుడుకులుంటాయి. ఎన్నాళ్ళగానో మీరు ఆవహించిన మనిషి ఒక భూతవైద్యుడిని ఆశ్రయించడంతో మీకు చావుతప్పి కన్ను లొట్టపోయినంత పని అవుతుంది. గత్యంతరంలేని పరిస్థితిలో ఆ మనిషిని విడిచిపెట్టి ఏదో ఒక చెట్టుని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాత ఫ్రెండ్సుని వుపయోగించుకుని మీ ఇబ్బందులని అధిగమిస్తారు. అందరితోనూ కలిసిపోయే మీ మనస్తత్వం కొందరికి కంటకింపుగా వుంటుంది అందుకే చిన్నచిన్న స్పర్ధలొచ్చినా అవి తొలగిపోతాయి. రాత్రులప్పుడు తెల్లనువ్వులు దానమిస్తే మంచిది. 

వృశ్చికం:

అనుకున్న పనులు ఆలశ్యంగా నెరవేరుతాయి. మీరు ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న మీ చిన్ననాటి స్నేహితుడు దయ్యంగా మారి మిమ్మల్ని కలవడంతో మీ మనసు పొంగిపోతుంది. ఈ ఆనందంలో మీ సహచర దయ్యాలకి మీరు గుడ్లగూబ బిర్యానితో విందు చెస్తారు.  

ధనుస్సు:

కొత్త దయ్యాలు వచ్చిచేరడంతో ఒత్తిడి కొద్దిగా ఉంటుంది. సందర్భాన్ని అనుసరించి ప్రవర్తించండి. ప్రముఖులను, ముఖ్యవ్యక్తులను దయ్యాలుగా చూసి మీరు సంబరపడతారు. ఈవారం మీకు శవదృష్టి తగిలే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మెడలో ఎముకలు ధరించడం మంచిది. వీలైతే కాలభైరవ గుడి మెట్లమీద నిద్ర చేస్తే మంచిది.

మకరం:

నిన్నగాక మొన్న దయ్యాలుగా మారినవారే మీకు పోటీ రావడం మీకు చీకాకు పుట్టిస్తుంది.  నిలకడగా అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన దయ్యాలు మీరేంటో తెలుసుకుని మళ్ళీ మీవద్దకే వస్తాయి. మీరు చెయ్యవల్సిందల్లా రెండు బాగా బలిసిన కాకులని బలి ఇవ్వడమే.  

కుంభం:

ఈరాశి దయ్యాలు ఈవారం బాగా జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా మీ అధీనంలో వున్న జూనియర్ దయ్యాలు మీకు ఎదురు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మగదయ్యాలు జాగ్రత్తగా వుండాలి. ఏదిఏమైనా ఈవారం ఈ రాశి దయ్యాలకు కాస్త కష్టకాలమే, జాగ్రత్తగా మెలిగి పరిస్థితులు చక్కదిద్దుకోవాలి. మీ దగ్గరలో శ్మశానంలో శివలింగానికి భస్మాభిషేకం చెయ్యడం ద్వారా కొంత ఉపశమనం కలుగవచ్చు.   

మీనం:

ఈరాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన మంచి పనులు చూసి మిమ్మల్ని తమ నాయకుడిగా వుండమని కొన్ని దయ్యాలు కోరడంతో మీ గొప్పతనం ఇనుమడిస్తుంది. మీ సలహాలు, మీ నిర్ణయాలు సాటి దయ్యాలకి అంగీకారమై, మంచి గుర్తింపు గౌరవాలు పొందుతారు. మీ ఎదుగుదల కొన్ని దయ్యాలకి మింగుడుపడకపోవడంతో మీకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. నాలుగు మంగళవారాలు తెల్లనువ్వులు దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు