విహారయాత్రలు ( మలేషియ ) - కర్రా నాగలక్ష్మి

maleysia tourism

కౌలాలంపూర్

కౌలాలంపూర్ ని గురించి రాయాలని అనుకుంటే యెక్కడనుంచి మొదలుపెట్టాలో తెలీని పరిస్థితి . ఏ విషయం గురించి వ్రాయాలో తేల్చుకోలేని అయోమయం . ఒక్కసారి యెన్నో అనుభవాలు నేను ముందు అంటే నేను ముందు అంటూ బయటకు తోసుకురావాలనే ప్రయత్నం లో యేర్పడ్డ గందరగోళం వల్ల యేర్పడే సూన్యం , ఏం రాయాలో తేల్చుకోలేని స్థితి .

కౌలాలంపూర్ యెన్నో సార్లు వెళ్లేం  ముందుగా మా మొదటిసారి అనుభవాలు మీతో పంచుకుంటా .

మలేషియ దేశం గురించి యెటువంటి అవగాహనా లేనప్పుడు 2002 లో మేం మొదటిసారి రెండురోజుల కోసం మలేషియ వచ్చేం . మలేషియ అంటే ఒక ముస్లిం దేశమనే తెలుసు . ముస్లిం దేశమంటే వున్న భయం , భాష తెలియకపోవడం తో విమానం లోంచి కాలు కింద పెట్టేసరికి అంతా అయోమయం .  పై దేశాలలో యింగ్లీషులో మాట్లాడి పని జరుపుకోవచ్చన్న తలపు తప్పు అని తెలిసేటప్పుడు కలిగిన అయోమయంలో మేము విమానాశ్రయం నుంచి బయట పడ్డాం . మేము మాతో పాటు కశ్మీరీ ముస్లిం దంపతులు వెళ్లేం . టాక్సీ అతనికి మేం యెక్కడకి వెళ్లాలో  బోధపరచే సరికి మాకు నీరసం వచ్చింది . మాకు వచ్చిన యింగ్లీషు డ్రైవరుకి బొధపడలేదు . అతను మాట్లాడే యింగ్లీషులో యింగ్లీషు వెతుక్కునే సరికి ఓ గంటపట్టింది . ఆ డ్రైవరు రూపు రేఖలు పరిశీలిస్తే అతనితో యే భాషలో మాట్లాడాలో నాకర్ధమైంది . ఆ తరువాత మా టీం కి నేను లీడరునై మా వాళ్లని మొత్తం మలేషియా తిప్పేసేను . ఇంతకీ అతనెవరో అర్దమైందా ? వాళ్ల రాష్ట్రం లో వున్న ప్పుడు వారి భాష తప్ప మరేదీ మాట్లాడని , పై రాష్ట్రమొస్తే నిముషాలలో ఆభాష మాట్లాడే ప్రతిభగల మన పొరుగు రాష్ట్రం అబ్బాయి , అదే తమిళ తంబి .

బలవంతంగా నా మీద వీళ్ల భాష రుద్దుతున్నారు  అనుకుంటూ తప్పక నేర్చుకున్న భాష నాకు పై  దేశం లో పనికొచ్చింది . అప్పుడు సమయం లేకపోవడం వల్ల బతుకేవ్స్ , ట్విన్ టవర్స్ , చైనా మార్కెట్టు , లిటిల్ యిండియ వెళ్లేం .ట్విన్ టవర్స్ గురించి కిందటి సంచికలో చదివేం . ఇప్పుడు బతుకేవ్స్ గురించి చదువుదాం .


బతు గుహలు ——

మలేషియ సిటికి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరం లో వున్నాయి యీ ప్రకృతి సహజమైన గుహలు . బస్సు , టాక్సీ సదుపాయాలు వున్నా  యీ మధ్యకాలం లో యీ ప్రదేశం పారిశ్రామిక ప్రదేశంగా మారడం తో యిక్కడ చాలా ట్రాఫిక్ వుండి రోడ్ జామ్ అవుతూ వుంటుంది . పదమూడు కిలోమీటర్ల ప్రయాణం ఆఫీసు సమయాలలో చేరడానికి సుమారు రెండు మూడు గంటలు పట్టడం వల్ల యిక్కడకు వెళ్లే వారికి కంమ్యూటర్ ట్రైను సర్వీసు చాలా ఉపయుక్తంగా వుంటుంది . సిటీ సెంటరు నుంచి కంమ్యూటర్ ట్రైను లో 13 కిలో మీటర్ల ప్రయాణానికి గాను సుమారు 3 రింగెట్లు చెల్లించి ‘ బతుగుహ ‘ స్టేషనులో దిగి నడచి యీ గుహలు చేరుకోవచ్చు .

మలేషియ చూడ్డానికి వెళ్లేవారు MRT , కంమ్యూటరు ట్రైను , మెట్రొ లాంటి సర్వీసులు నగరంలో తిరగడానికి వుపయోగించుకుంటే సమయం , సొమ్ము రెండూ ఆదాఅవుతాయి .

మలయ భాషలో బతు అంటే రాయ అని అర్దం అంటే రాతిగుహలు అని  , కాని యివి సున్నపురాతి గుహలు , వీటికి దగ్గరగా ప్రవహిస్తున్న నదిని ‘ బతు సుంగై ‘ అని అంటారు .

ఈ గుహలు సుమారు 400 మిలియన్ సంవత్సరాల పూర్వం వి అని చరిత్రకారులు అంచనా వేసేరు . సున్నపు రాతికొండలలో నిరంతరంగా నదీ ప్రవాహం వల్ల యేర్పడ్డ గుహలు . 1800 సంవత్సరం వరకు వీటిలో ‘ తెమొన్ ‘ కొండజాతికి చెందిన వారి నివాసాలు వుండేవి . మలయ భాషలో వీరిని ‘ ఒరాంగు అసలి ‘ అంటారు . 1800 లలో వలస వచ్చిన చైనీయులు వ్యవసాయానికి కావలసిన ఒండ్రు మట్టిని యీ ప్రాంతాలనుంచి వారి భూములకు తరలించే క్రమంలో ‘ ఒరాంగు అసలీ ‘ లను తరిమి కొట్టేరు . 1878 లో యీ గుహలను అప్పటి బ్రిటిష్ అధికారి కనుగొన్నాడు . 1892 లో అక్కడి పేరుమోసిన వ్యాపారవేత్త K . తంబుస్వామి పిళ్లై యీ గుహ ముఖద్వారం కుమారస్వామి ఆయుధాన్ని పోలివుండడం చూసి యీ గుహలను కుమారస్వామి గుహలుగా తీర్చి దిద్దాలని తీర్మానించుకొని కుమారస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు జరుపసాగేడు .  అదే సంవత్సరం థైపూసం యాత్ర ప్రారంభించేడు . తరువాత   వంద మీటర్ల యెత్తు గల యీ గుహలను చేరుకోడానికి 272 మెట్లు కర్రతో కట్టేరు తరువాత వీటిని సిమెంటుతో నిర్మించేరు . ఈ గుహలు నేలకి సుమారు 100 మీటర్ల యెత్తున వుంటాయి . ఈ వందమీటర్లు యెక్కేసరికి చాలా ఆయాసం వస్తుంది . గుహలలో కి చేరుకోగానే అతి చల్లగా హాయిగా వుంటుంది . ఈ గుహలను అలాగే వదిలేయక యిందులో విగ్రహాలను ప్రతిష్టించి మందిరాలుగా మలచేరు .

కొండల మీద వున్న పది కుమారస్వామి మందిరాలలో ఆరు భారతదేశం లో వుండగా మిగతా నాలుగు మలేషియాలో వున్నాయి . వాటిలో   కౌలాలంపూరు లో వున్న బతుమలై మురుగన్   , ‘ కల్లుమలై మురుగన్ ‘ ఐపొహ్ , ‘తన్నీరుమలై మురుగన్ ‘ పినాంగ్ , సన్నాసిమలై మురుగన్ మలక్క .

గుహ లోపల వివిధ దేవీదేవతలకు చిన్నచిన్న మందిరాలు నిర్మించేరు . ఈ గుహలలో సహజంగా యేర్పడ్డ ఆకృతులను చూడొచ్చు . ఇప్పటి వరకు మేము చూసిన సహజ గుహలలో యివే యెత్తైనవి . గోడలమీద వివిధ ఆకృతులు అబ్బుర పరుస్తాయి . మెడలు నొప్పులు  పెట్టేంతవరకు చూసి పకృతి యేర్పరచిన వింతను పొగడకుండా వుండలేకపోయేము . ఈ గుహలలో అక్కడక్కడ నీరు స్రవిస్తూనే వుంది .
ఈ గుహలు రెండు కిలో మీటరు పొడవునా విస్తరించి వున్నా చాలా కొద్దిభాగం మాత్రమే పర్యాటకుల రాకపోకలకు అనువుగా వున్నాయి  . మిగతావాటిలో కొన్ని విధ్యార్ధుల అధ్యనంకోసం ఉపయోగిస్తున్నారు . ఈ చీకటి తేమ గుహలు అనేక గబ్బిలాలకు నివాసంగా వున్నాయి . అడవులు దగ్గరగా వుండడం వల్ల కోతులు యిక్కడ యెక్కువగా కనిపిస్తాయి . పేరుతెలియని రకరకాల పువ్వులతో కొండలన్నీ అందంగా కనిపిస్తూ వుంటాయి . అలాంటి కొండలను ‘ తమన్ బతు ‘ అని ‘ బుంగ బతు ( బుంగ అంటే పువ్వు ) ‘ అని వ్యవహరిస్తూ వుంటారు . పెద్ద పెద్ద నల్లని సాలెపురుగులు కూడా యిక్కడ యెక్కువగా వుంటాయి .

మురుగన్ మందిరం గుహాకి పక్కగా వున్న గుహలు ఒకటి మ్యూ జియం , మరొకటి ఆర్ట్ గేలరి . వీటిలో సహజ ఆకృతులతో పాటు కుమారస్వామికి చెందిన కథలను తెలిపే బొమ్మలు , చిత్రాలు వున్నాయి . రామాయణగుహలు చూడదగ్గవి . ఈ గుహలను చూడ్డానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది . వీకెండులలో , పండుగ రోజులలో చాలా రద్దీగా వుంటాయి .

2006 లో 140 అడుగుల యెత్తున్న బంగారు రంగులో మెరుస్తున్న  కుమారస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించేరు . ప్రపంచంలో యీ విగ్రహం రెండవ స్థానంలో వుంది .

చైనా బజారు కి కూడా మెట్రో సర్వీసు వుంది , బజారు చిన్నదే అయినా బట్టలు , బేగులు , ఎలక్ట్రోనిక్స్ ఐటమ్స్ లాంటివి చాలా కొత్తరకాలు దొరకుతాయి , అయితే బాగా బేరాలు ఆడాలి , గాంధీగారి జేబు గడియారాలలాంటివి , రిస్ట్ వాచ్ లు కొత్త రకాలవి దొరుకు తాయి , అయితే యివి యెన్నాళ్లు పనిచేస్తాయంటే మాత్రం దైవాదీనం బస్సు సర్వీసే . పనిచేస్తే చాలా రోజులు పని చేస్తాయి లేదా అంతే పారేయడమే  . లోకలు పళ్లు , నట్స్ కొనుగోలు చేసుకోవచ్చు .

ఇండియన్ మార్కెట్ లేదా లిటిల్ యిండియా లో ముఖ్యంగా లవంగాలు , దాల్చిని చెక్క , యేలకులు తప్పకుండా కొనుక్కోవాలి . చాలా మంచి రకం వి దొరకు తాయి . ఇక్కడ వున్న ‘ మారియమ్మ ‘ కోవెల యెప్పుడూ రద్దీగానే వుంటుంది . ఇక్కడ మనకి కావలసిన అన్ని వస్తువలు , చీరలు , బ్లౌజులు కుట్టే టైలర్స్ లాంటి వన్నీ దొరకుతాయి . అలాగే ఇడ్లీ దోసె అమ్మే రెస్టొరెంట్స్ అడుగడుగునా వుంటాయి .       శుచి శుభ్రానికి మారు పేరులా వుండే మలేషియ చైనా బజారు , యిండియన్ బజారులకి వచ్చేసరికి చెత్త కంపులతో నిండిపోయి కనిపిస్తుంది .

కౌలాలంపూర్ లో యెన్నో పార్కులు , లేక్ పార్కులు , నేషనల్ పార్కులు , బొటానికల్ గార్డెన్స్ , బటర్ ఫ్లై పార్క్ , హెబిస్కస్ పార్క్ వున్నాయి . ఈ పార్కులని చూస్తున్నప్పుడు యెంత చక్కగా వీటిని మెయిన్టెయిన్ చేస్తున్నారో అర్దమౌతుంది . వీక్ డేస్ లో వాకర్స్ తప్ప యెవరూ వుండక పోయినా వీకెండ్స్ లో యీ పార్కులు కళకళ లాడుతూ వుంటాయి . పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో గడిపి రాత్రికి యిళ్లు చేరుతారు .

ఈ పార్క్ లలో ముఖ్యంగా లేక్ పార్క్ గురించి చెప్పుకోవాలి . ఇది సుమారు 92 హెక్టార్లలో నిర్మింప బడింది . దీనిని 1882 లో యీ ప్రాంతాన్ని లేక్ పార్క్ గా తీర్చదిద్దడానికి సుమారు పది సంవత్సరాలు పట్టింది . పార్క్ లో వున్న సరస్సు మానవనిర్మితమైనది , సరస్సు చుట్టూ పూల మొక్కలు క్రోటన్స్ మొక్కలు పెంచేరు .  పార్క్ లో  అప్పటి బ్రిటిష్ అధికారి నివాసం నిర్మించేరు . దీనిని ‘ తమన్ పెర్దాన ‘ ( పెర్దాన అంటే సరస్సు అని , తమన్ అంటే ఉద్యానవనం అని అర్దం ) గా పిలువ సాగేరు . 1963 లో మలేషియ పార్లమెంటు భవనం నిర్మించేరు  . ప్రస్తుతం పార్లమెంటు భవనం పుత్రజయ కి మార్చబడింది . 2011 లో యీ ఉద్యానవనాన్ని ‘ పెర్దాన బొటానికల్ గార్డెన్ ‘ గా మార్చేరు . పెర్దాన అంటె సరస్సు అని అర్దం . ఈ బొటానికల్ గార్డెన్ కి యెలా వెళ్లాలో తెలుసుకుందాం , MRT లో వెడితే కౌలాలంపూర్ సెంట్రల్ స్టేషనుకి అయిదు నిముషాల నడకదూరంలో వుంది , రేపిడ్ కెఎల్  బస్సులో వెళ్లేవారు ‘ పసర్ ( బజారు ) సెని ‘ LRT నుంచి రేపిడ్ బస్సు యెక్కితే నేషనల్ మ్యూజియమ్ స్టాపులో దిగితే పక్కనే వుంటుంది బొటానికల్ గార్డెన్ .

కౌలాలంపూర్ లో చూడదగ్గ ప్రదేశం 1991 లో ప్రారంభించబడ్డ బర్డ్స్ పార్క్ . ఈ పార్క్ లో సుమారు 200 రకాల పక్షిజాతులువున్నాయి . ఈ పార్క్ ప్రపంచంలోనే అతి పెద్ద క్లోజ్డ్ బర్డ్స్ పార్క్ గా పేరు పొందింది .

ఇవి కాక నేషనల్ మోన్యుమెంట్ , నేషనల్ మ్యూజియమ్ , నేషనల్  పాలస్ , సుల్తాన్ అబ్దుల్ సమద్ జమెక్ మసీదు మొదలయినవి కూడా చూడదగ్గవే . చాలా ముస్లిం దేశాలలో ఆడవారిపై చాలా ఆంక్షలు వుంటాయి , ముఖ్యంగా వారి  విద్య గురించి కాని ఈ దేశం లో అలాంటి ఆంక్షలు లేవు , యిక్కడ మగపిల్లలకంటే ఆడపిల్లలే యెక్కువగా చదువులలో రాణిస్తున్నారు .

పై వారం ‘ పుత్రజయ ‘ గురించి చదువుదాం , అంతవరకు శలవు

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు