ఇలా అయితే పిల్లలకు చదువెలా వస్తుంది? - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

children study

"మమ్మల్ని టీచర్ కొట్టదు. ఒకవేళ కొడితే ప్రిన్స్ పల్ కు చెప్పి తిట్టిస్తాము. ఒక్కోసారి మేడమ్ టీచర్ ను స్కూళ్లో నుంచి తీసేస్తుంది, తెలుసా?" ప్రైవేట్ స్కూళ్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు.

ఆ స్కూల్ మా ఇంటి దగ్గరే, ఒకసారి ఖాలీ దొరికినప్పుడు వెళ్లి ఓ టీచర్ తో మాట్లాడాను. "ఆ పిల్లాడు చెప్పింది నిజమేనండీ, మేము స్కూళ్లో చేరేప్పుడే పిల్లల్ని కొట్టొద్దు, తిట్టకూడదు అని చెబుతారు సార్, అలా అయితే పిల్లలకి చదువెలా వస్తుందండి? ‘మా మీద ప్రిన్సిపల్ మేడం కి ఎక్కడ కంప్లయింట్ ఇస్తారో’ అని భయపడుతూ లెసన్స్ చెప్పాల్సొస్తోంది. పిల్లలు చెబితే టీచర్లనీ ఉద్యోగంలోంచి తీసేశారు"వాపోయాడు.


(పైన రాసిన సంఘటన వాస్తవం)

ఇలా అయితే పిల్లలకు చదువెలా వస్తుంది?

మనిషి మనసు కోతిలాంటిది. మనమే దాన్ని నియంత్రించలేం, పాపం, పిల్లలేం చేయగలరు. వాళ్లలో ఏకాగ్రత కలగడం కోసం కాస్త గురువుగారి భయం ఉండాల్సిందే.

సామ, బేధ, దాన, దండోపాయాలు, నయాన భయాన లాంటివన్నీ విషయాన్ని ఎదుటి వారి మనసులోకి పాదుగొలిపే ప్రక్రియలే! ఇవన్నీ ఎదుటివారిని బానిసలుగా చూడడానికే అని ఎవరైనా అంటే ఏమీ చేయలేం.

పూర్వం పిల్లల్ని తల్లిదండ్రులు విద్యాభ్యాసం కోసం గురుకులాల్లో విడిచి వెళ్లేవాళ్లు. విద్యార్జన పూర్తయి గురువుగారు పంపిస్తేనే పిల్లలు మళ్లీ ఇంటి ముఖం చూసేది. విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా తల్లిదండ్రులు జోక్యం చేసుకునేవారు కాదు. అందరూ చదువుకు అంతటి విశేష ప్రాముఖ్యత నిచ్చేవారు.

మేము చదువుకునేప్పుడు గురువుల పట్ల భయం, భక్తి, గౌరవం ఇత్యాదివి మాకుండేవి. తల్లిదండ్రులు కూడా ‘మా పిల్లాడ్ని తిట్టి, కొట్టయినా నాలుగక్షరముక్కలు నేర్పించండి, వాడి భవిష్యత్తు బాగుండాలి కదా’ అనేవాళ్లు. గురువులు కూడా పిల్లల్ని, తమ పిల్లల్లా సొంతం చేసుకుని చదువు చెప్పేవారు. వాళ్లు, పిల్లలు లెక్కలు సరిగా చెయ్యకపోతే, పాఠం చక్కగా అర్థం చేసుకుని సమాధానాలు చెప్పకపోతే, కంఠస్థం పట్టిన పద్యాలు అప్పజెప్పకపోతే తొడపాశం పెట్టేవారు. గోడకుర్చీ వేయించేవారు, ఎండలో నుంచోబెట్టేవారు, ఒంగోబెట్టేవారు. ఇలాంటి శిక్ష(?)లు అమలు చేసి పసి పిల్లల మీద తమ ప్రతాపం చూపించాలని కాదు. మొక్కగా ఉన్నప్పుడే వంగబెడితే మానై చక్కటి వ్యక్తిత్వంతో సంఘంలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకుంటారని.

పిల్లల చేత ఎక్కాలు పైనుంచి కిందకు, కిందనుంచి పైకి చెప్పించేవారు. తెలుగు వ్యాకరణం, ఇంగ్లీష్ గ్రామరు సులభగ్రాహ్యంగా చెప్పేవారు. ఎవరైనా శతకాలు అడగంగానే చెప్పాల్సిందే. అందుకే విద్య అనేది పిల్లల మెదళ్లలోకి చొచ్చుకుపోయి స్థిరంగా ఉండేది. అందుకే చిన్నప్పటి పాఠాలు ఒంటపట్టి పెద్దయ్యాక ఎంతగానో ఉపయోగపడేవి.

పెద్దలని గౌరవించడం మన సంప్రదాయం. గురువులూ పెద్దలే! పైగా విద్యాదానం చేస్తారు. అజ్ఞానం పారదోలుతారు. ఏం వాళ్లు చిన్నవాళ్లని ఒక మాట అనకూడదా? ఒక దెబ్బ వేయకూడదా? వాళ్లవి మాత్రం మనసులు కాదా? పిల్లా జెల్లా లేరా? ఎక్కడో ఒకళ్లిద్దరు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారని, అందర్నీ అదే కోవన గడితే ఎలా? పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని పైకొస్తే మొదట సంతోషించేది గురువులే! ఎందుకంటే తన శిష్యులని లోకం పొగుడుతోందని.

విద్యావ్యాపారంలో అభ్యాసం కూసువిద్య అనే నానుడి ఉనికిని కోల్పోయింది. మార్కుల ప్రాతిపదికగా సబ్జెక్ట్స్ రుబ్బుడే రుబ్బుడు. సహజాసక్తితో నేర్చుకోవాల్సింది, యాంత్రికతకు దారితీస్తోంది. ఇది చదువుపట్ల పిల్లల్లో ఉన్న ఆసక్తిని చంపేస్తోంది.

విదేశాల్లో తల్లిదండ్రులూ పిల్లల స్వేచ్ఛని హరిస్తూ కొట్టకూడదు. తిట్టకూడదు. అలా జరిగితే వాళ్లు పేరెంట్స్ మీద కంప్లయింట్ చేస్తారట. మనది ఆ సంస్కృతి కాదు. రక్తం పంచుకున్న పిల్లలు తప్పుచేస్తే, చిన్నవాళ్లయితే పిర్రమీద ఒక్కటిస్తాం, పెద్దవాళ్లయితే పరుషమైన పదజాలంతో మనసులో సూటిగా నాటుకునేలా ఒక మాట అని మనిషిని మార్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకు? పిల్లలు బంగారమయితే, వాళ్ల భవిష్యత్తు బాగుంటుందని.

ఇప్పటికే కంప్యూటర్లు వచ్చాక అందులోనూ నెట్ సౌలభ్యం ఉండి, గేమ్స్, ఫేస్ బుక్, వాట్సప్ ఛాటింగ్ ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు. పిల్లల్ని గారాబం చేసేది తల్లిదండ్రులే. ‘కనీసం గురువు భయం అన్నా ఉంటుందా’ అంటే అదీ లేకుండా చేస్తున్నాం. ఇది వాళ్ల వందేళ్ల జీవితాన్ని పాడుచేస్తోందనిపించడం లేదూ. జర సోచియేఁ!

*****

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు