అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో 'కార్డియాక్ అరెస్ట్' అనే మాట బాగా పాపులర్ అయిపోయింది. ఈ మాట చుట్టూ పలు చర్చలు కూడా జరిగిపోయాయి. ఆమె మరణం సంగతి అటుంచితే, గుండెకి సంబంధించిన ఈ కార్డియాక్ అరెస్ట్ అనే మాటని అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. వయసు పరంగా చూస్తే 54 సంవత్సరాల వయసున్న శ్రీదేవిని ఓల్డ్ ఏజ్ లిస్టులో పడేయలేము. అలాంటిది ఆ ఏజ్‌లో కార్టియాక్ అరెస్ట్ కారణంగా ఆమె చనిపోయిందంటే అంత చిన్న విషయం కాదు. ఈ వయసు ఇప్పటి రోజుల్లో పెద్ద వయసుగా పరిగణించలేం. ఆమె మరణానికి సంబంధించి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నప్పటికీ, ఈ కార్డియాక్ అరెస్ట్ ప్రభావం నేటి జీవన శైలిపై కొంతైనా ఉండొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మన లైఫ్ స్టైల్‌లో వస్తున్న మార్పుల కారణంగా మన ఆరోగ్య పరిస్థితులపై ఇలాంటి ఎటాక్స్ ప్రభావం చాలా చిన్న విషయం అయిపోయింది. ఇదివరకటి రోజుల్లో హార్ట్ ఎటాక్స్ అంటే ఏదో వయసు మళ్లిన వారిలోనే అంటే 80లు 90లు దాటిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. 15 ఏళ్ల పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్ ప్రోబ్లమ్స్ వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ విషయంలో చిన్న చూపు తగదు.
ముఖ్యంగా యవ్వన దశలోంచే శారీరక ఆరోగ్య పరిస్థితులపై సరైన అవగాహన పెంపొందించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఉరుకుల పరుగుల జీవితంలో ముఖ్యంగా శారీరక కష్టాన్ని పక్కన పెట్టేస్తున్నారు నేటి యువత. ముఖ్యంగా అన్ని సమస్యలకు కారణం ముందుగా ఇంటి నుండే మొదలవుతోంది. నాటి రోజుల్లో ఇళ్లు విశాలంగా ఉండేవి. దాంతో శారీరకంగా ఇంట్లోనే శరీరానికి సరిపడా వ్యాయామం అందేది. కానీ ఇప్పుడు ఇళ్లు ఇరుకైపోయాయి. దాంతో పాటు ప్రపంచం చిన్నదైపోయింది. అంటే, అరచేతిలోనే ప్రపంచం. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ రూపంలోనన్నమాట. వీటికి కేటాయిస్తున్న టైంని శారీరక శ్రమ కోసం కేటాయించలేకపోతున్నారు నేటి జనం. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్‌తో సమయమే తెలిసి రావడం లేదు. దాంతో శరీరానికి అస్సలు శ్రమ కల్గించలేకపోతున్నారు. మరో కారణం ఏంటంటే, తీసుకునే ఫుడ్. ఆ ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ తక్కువైపోయి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోతోంది. ముఖ్యంగా బయట తినే ఫ్రైడ్ ఐటెమ్స్ హార్ట్‌కి చాలా కీడు చేస్తాయి. ఎవరెంతగా హెచ్చరించినా ఈ దురలవాటును మానుకోలేకపోతున్నాం.
ఇటీవల కాలంలో ఒత్తిడి అత్యంత తీవ్రమైన అంశంగా మారిపోయింది ఇటీవల కాలంలో. ఈ ఒత్తిడికి కారణాలు అనేకం. చిన్న పిల్లల విషయానికి వస్తే, ఐదారు తరగతుల నుండే చదువుల ఒత్తిడి చిన్ని గుండెల్ని చిదిమేస్తోంది. యుక్త వయసు వచ్చాక ఉన్నత చదువుల టెన్షన్, దాంతో పాటుగా స్నేహాల్లో తలెత్తే వివాదాలు, ప్రేమ వ్యవహారాలు యువతను చిత్తు చేస్తున్నాయి. ఇలాంటివన్నీ మొదటగా గుండె మీదనే ఒత్తిడి పెంచుతాయి. ఆ ఒత్తిడిని తగ్గించుకోలేక చిత్తయిపోవాల్సి వస్తోంది. అందుకే ముందుగా ప్రతీ ఒక్కరూ గుండె అవసరాన్ని తెలుసుకోవాలి. పరుగెత్తేటప్పుడు హార్ట్ రేట్‌పై అవగాహన తప్పనిసరి. ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె స్పందనలు అర్ధం చేసుకోవాలి. తల్లితండ్రులు ఈ విషయంపై తమ పిల్లలకు సరైన అవగాహన కల్పించాలి. అవసరమైతే వైద్య నిపుణులచే తగు సూచనలు సలహాలు అందించాలి. ఏది ఏమైనా ఎవరైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. 'లవ్ యువర్ హార్ట్ ఫస్ట్'. పిల్లలికైనా, పెద్దలకైనా ఇదే మాట వర్తిస్తుంది.