చదువు' ఎక్కువైతే ఉన్న 'మతి' పోతుందా? - ..

is too much 'educate'?

ఎగ్జామ్స్‌ సీజన్‌ మొదలైంది. పిలల్లో టెన్షన్‌ స్టార్ట్‌ అయ్యింది. పిల్లల్లోనే కాదు, పెద్దలకూ టెన్షనే. అయితే టెన్షన్‌ పడి సాధించేది లేదు. కూల్‌గా ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకుని మంచి మార్కులు ఎలా సంపాదించాలో గమనిస్తే మంచిది. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవకుండా, ఎగ్జామ్స్‌కి సరిగ్గా వారం ముందు బుక్స్‌ తిరిగేసి, ఆల్‌ సబ్జెక్ట్స్‌ ఒకదాని తర్వాత ఒకటిగా, విత్‌ అవుట్‌ రెస్ట్‌ చదివేస్తే ఏమౌతుంది? ఉన్న మతి కూడా పోతుంది అని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఏకధాటిగా చదువు కోసం టైమంతా కేటాయించేస్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలు. కానీ అది మంచి పద్ధతి కాదంటున్నారు వైద్యులు. చదువుకోవాలి. కానీ అంతకన్నా ముందు నిద్రపై ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్స్‌ టైంలో ఎక్కువగా పిల్లలు మర్చిపోయేది ఆ నిద్రనే. కానీ ఎంత చదివినా సరిపడా నిద్ర లేకపోతే ఆ చదివిన చదువంతా వృధా అంటున్నారు వైద్యులు. పరీక్షల సమయంలో 70 శాతం మంది విద్యార్థులు కనీసం 7 గంటల సమయం కూడా నిద్రపోవడం లేదనీ అధ్యయనాల ద్వారా వెల్లడైంది. కొంతమంది పిల్లలైతే కనీసం మూడు నుండి నాలుగు గంటలు కూడా నిద్రపోవడం లేదట. ఇలా చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండలేక, తదుపరి పరీక్షపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేయలేక తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనీ వైద్యులు చెబుతున్నారు. అలాగే ఎగ్జామ్‌ హాల్‌లో తాము చదివిందంతా మర్చిపోయి రిజల్ట్‌ చూసుకుని బెంబేలెత్తుతున్నారు.

రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే, చదివిన ప్రతీ విషయం గుర్తుండి, ఎగ్జామ్‌ హాలులో ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం రాయాలంటే ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్‌ టైంలో ప్రతీ విద్యార్ధి గమనించాల్సిన విషయం కనీసం 7 నుండి 8 గంటల కంటి నిండా నిద్ర. ఇలా చేయడం వల్లే శరీరానికి సరైన విశ్రాంతి లభించి, మెదడుకు సరైన రీఛార్జ్‌ అందుతుంది. అప్పుడే మెదడు చురుకుగా పని చేస్తుంది. ఏడాది కాలంలో కొంచెం కొంచెంగా చదవాల్సిందంతా, ఎగ్జామ్‌ ముందురోజే ఒక్కసారిగా చదివేయొచ్చు కదా అనుకున్న విద్యార్ధులు తీరా ఆ రోజు వచ్చేసరికి అది కాస్తా ఫలించక అనవసర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తీవ్ర ఒత్తిడి కారణంగా పరీక్షల్లో సరైన మార్కులు సాధించలేకపోతున్నారు. అందుకే పరీక్షలు సమీపిస్తున్న కొద్ది నెలల ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళికను ఏమాత్రం రాజీ పడకుండా, కొద్ది కొద్దిగా పూర్తి చేసుకుంటేనే అసలు సిసలు రిజల్ట్‌ని దక్కించుకోగలుగుతారు.

అంతేకానీ ఆ రోజుకారోజు ఎగ్జామ్స్‌ ఉన్న ఆ పది రోజులే కదా, నిద్రకు టాటా బైబై చెప్పేస్తే పోలా.! అంటే కుదరు. ఈ ఒత్తిడితో అనవసరపు సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ముఖ్యంగా తల్లితండ్రులు, తమ పిల్లలు నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వహించాలి. వేళకి నిద్రపోయేలా వారిని ప్రోత్సహించడం, టైం టు టైం సరైన పోషక విలువలున్న ఆహారాన్ని అందించడం వంటి జాగ్రత్తలు వహించాలి. అలాగే చదువుతున్న సమయంలో ప్రతీ రెండు గంటలకోసారి విరామం ఇచ్చేలా చూడాలి. ఆ విరామ సమయంలో ఇతరత్రా వ్యాపకాలు వారికి కల్పించాలి. అంటే ఏవైనా ఆటలు, పాటలు, మ్యూజిక్‌ వినడంలాంటివి చేయాలి. అప్పుడే మన మెదడుకి జ్ఞాపకశక్తి పెరిగి, చదివిన ప్రతీ విషయాన్ని గుర్తుంచుకునే సామర్ధ్యం పొందుతుంది. లేదు మేం కంటిన్యూస్‌గా చదువుతూనే ఉంటామంటారా? అంతే సంగతి. చదువు ఎక్కువైందంటే ఉన్న మతి కూడా పోతుంది. అంటే చదివిందంతా మర్చిపోతారన్నమాట. అందుకే మై డియర్‌ స్టూడెంట్స్‌ ఈ కొన్ని జాగ్రత్తలు పాఠించండి. పరీక్షల్లో బోలెడన్ని మార్కులు కొట్టేయండి. 

మరిన్ని వ్యాసాలు