వారంవారం వారివారి వార ఫలాలు - ఈడూరి

varam varam vari vari phalalu

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికలో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించే ఈ శీర్షికలో ఈ వారం ఎక్కడ ఏమి జరిగినా హడావుడి చేసే మీడియా వారఫలాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడానికి  మాత్రమే ఈ ప్రక్రియ.    
మేషం:
ఈరాశి ఛానళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. ఒకరి తరువాత ఒకరుగా సెలెబ్రిటీలు చనిపోవడంతో మీకు అంతులేని ఆనందంగా వుంటుంది. ఈరాశిలో జన్మించిన ఛానళ్ళకి కూసిందల్లా బంగారమే. అతివుత్సాహానికి గురై తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యకపోతే గనుక మంచి ఫలితాలు సాధ్యం. ఏది ఏమైనప్పటికీ ఈవారం ఈరాశి మీడియాకి మూడు మృత్యువులూ ఆరు అరెస్టులూ అన్నట్టుగా వుంటుంది.
వృషభం:
అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా వుంటుంది ఈరాశికి చెందిన మీడియా వ్యవహారం. అతి తెలివికి పోయి సెలెబ్రిటీల మృత్యువుని వీలైనంత కళాత్మకంగా చూపించాలి అన్న ప్రయత్నంలో కొన్ని ఛానళ్ళు తమ రిపోర్టర్ల మృత్యువుకి కారణమయ్యే ప్రమాదం వుంది. కాబట్టి సమ్యమనంతో వ్యవహరిస్తే మంచిది. ఇది వరకు దేవుళ్ళ మీద చేసిన లేఇపోని తప్పుడు ప్రచారాలు వికటించి కొందరు మీడియా అధినేతలు రాహుకేతువు పూజలు చేయించుకునే పరిస్థితి కూడా లేకపోలేదు  
 
మిధునం:
అందివచ్చిన అవకాశాలని వాడుకోవడంలో మీరు దాఋణంగా దెబ్బతింటారు. ప్రజల సెంటిమెంట్సుని పక్కన బెట్టి పనికి రాని చర్చలు నిర్వహించి అన్ని వర్గాల కోపాన్నీ ఎదుర్కొంటారు. టీయార్పీ రేటింగ్ పడిపోయి బిక్కమొహం పెడతారు. ఏదైనా రాజకీయనాయకుడి చుట్టూ నలభై రోజులు ప్రదక్షిణ చేస్తే ఏదైనా సంచలనవార్త దొరికి మళ్ళీ పూర్వ వైభవం దక్కవచ్చు కాబట్టి ఈరాశి వారు ఆ పని మీద వుండటం మంచిది.

కర్కాటకం:
జీడిపాకంలా సాగే మీ సీరియల్సు ఇంకా కొనసాగనిస్తే మీ ఛానల్ కొనసాగే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ రాశి ఛానల్లో ప్రసారమైన సీరియల్స్ చూసి అత్తగారికి విషం ఇచ్చిన కోడలు పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలంలో ఛానల్ పేరు, సీరియల్ పేరు చెప్పడం వలన చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దోషం తొలగిపోవాలంటే యాభీ కేజీల జీడిపాకం ఏదైనా అమ్మవారి గుడిలో మహిళా భక్తులకి పంచిపెట్టాలి.

సింహం:
ఎవరికీ పనికిరాని చర్చల్ని పెట్టి ఎందుకూ పనికిరాని వాళ్ళని సెలెబ్రిటీలుగా మార్చే ఈరాశి ఛానల్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే పని మానుకోకపోతే ఈవారం ఇంటికెళ్ళకతప్పదు. గ్రహాల పరిస్థితులు అస్సలు బాగోలేదు. మీ ఛానల్లో ప్రకటనలు ఇచ్చే ధనలక్ష్మి యంత్రాలని టోకున కొనుక్కుని మీ దగ్గర పనిచేసేవారందరికీ కట్టినా ఈ నెల వారికి జీతాలు అందే అవకాశాలు కనిపించట్లేదు. ఈలోపులో మంచి బ్లాక్ మెయిల్ అవకాశం దొరికితే నారదవ్రతం ఆచరించి స్టూడియోలో ప్రత్యేక పూజలు చేయించాలి.  

కన్య:
ఈరాశిలో కామెడీ ఛానల్సే ఎక్కువగా వుంటుంటాయి, చాలా సీరియసుగా మీ కామెడీలు చూసే ప్రేక్షకులు వుండటం మీ అదృష్టం. వేసిన కామెడీ క్లిప్పులే మళ్ళీ మళ్ళీ వేసినా ఇంట్లో పెళ్ళాం వంటకి అలవాటుపడిపోయిన భర్తల్లా మీ ప్రేక్షకులు కూడా ఆ కామెడీ చూడటానికి అలవాటు పడిపోవడం మీకు సంతోషం కలిగిస్తుంది. పదేళ్ళుగా డిగ్రీ చదువుతున్న అనుభవజ్ఞులైన కుర్ర యాంకర్లు మీ ఛానల్ టియార్పీ రేట్లు బడ్జెట్ మర్నాడు పతనమైన సెన్సెక్స్ సూచీల్లా మారుస్తారు.    
తుల:
ఈరాశిలోని ఒకానొక ఛానల్ పడకగదికే పరిమితమైన బూతుని పక్కనున్న హాల్లోకి తెచ్చిన ఘనత ఎప్పుడో సాధించేసింది. పరమ గబ్బు కొట్టే హాస్యసన్నివేశాలతో నెట్టుకొస్తున్న ఈ కార్యక్రమంలోని జోకులన్నీ నెట్టులో కొట్టుకొస్తున్నవే అనే విషయం వాళ్ళకి తప్ప ప్రపంచం మొత్తానికీ తెలుసు. కుళ్ళుజోకులేసే సోదిగాళ్ళకి పెట్టింది పేరైన ఈ కార్యక్రమం త్వరలోనే ఆపకపోతే ఆ ఛానల్ని ఆపాల్సిరావొచ్చు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాల్సిందే. ఈ కార్యక్రమంలో స్కిట్లకన్నా ఆ స్కిట్ల తరువాత జడ్జీలు ఇచ్చే కామెంట్లే ప్రేక్షకులని ఎక్కువగా నవ్విస్తుంటాయి. జడ్జీలని ఎన్నుకోవడంలో వీరు చూపిన ప్రతిభ వీరి గొప్పతనాన్ని చాటుతుంది.   
వృశ్చికం:
పేరుకి తగ్గట్టే ఈరాశి ఛానళ్ళు ఎవరో ఒకరిని కుట్టకుండా వదలవు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు తన్నుకుంటుంటే చూస్తూ ఆనందించడం వీటికి నిత్యకృత్యం. త్వరలో రామనవమి వుంది కాబట్టి ఇద్దరు పండితుల్ని కూచోబెట్టి నవమి అష్టమి నాడు చేసుకోవాలా దశమి నాడు చేసుకోవాలా అని రసవత్తరమైన చర్చకి తెర లేపండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో మీ ఛానల్ని ఎన్ని బూతులు తిడితే మీకంత పబ్లిసిటీ అనే విషయం మీకు బాగా తెలిసినదే.     

ధనుస్సు:
వంటల ప్రోగ్రాములకే పరిమితమైన మీ కార్యక్రమాలు మంచి పేరు సంపాదిస్తాయి. భర్తలు వంట చెయ్యకతప్పని ఈరోజుల్లో వంటల ప్రోగ్రాములంత సేఫ్ మరొకటి లేదన్న విషయం మీరు ఇతరులకన్నా త్వరగా గ్రహించారు కనుకనే మీకు ఈ విజయం దక్కింది. మిమ్మల్ని చూసి మరికొన్ని ఛానళ్ళు పోటీకి సిధ్ధమవుతాయి కాబట్టి మీ సృజన ఉపయోగించి ఇంకా మంచి ప్రోగ్రాములు డిజైన్ చెయ్యండి. వంట చేస్తూ సగం వస్తువులు తినేసే యాంకర్లని మారిస్తే మంచిది.

మకరం:
ఎక్కువగా తీర్ధయాత్రల కార్యక్రమాలు ప్రసారం చేసుకోవడం ద్వారా మీకు ఈవారం బాగా కలిసివస్తుంది. హాయిగా ఇలాగే కంటిన్యూ ఐపోదాం ఇకనుండీ అనుకుంటారు. ఏ కాంట్రవర్సీలూ లేకుండా గుళ్ళూ గోపురాలూ చూపించుకుంటూ అగరవత్తులు, రుధ్రాక్షలు, పూజాసామగ్రి ప్రకటనలు వేసుకోవడం ఉత్తమం అనే గొప్ప వ్యాపార సూత్రం గ్రహిస్తారు. త్వరలో దీపోత్సవాల సందడి కూడా చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి

కుంభం:
ఈరాశి ఛానళ్ళకి యిది గడ్డుకాలమే. చీరలు పంచే కార్యక్రమంలో మీరు అందిస్తున్న చీరలు మరీ నాశిరకంగా వుంటున్నాయని మహిళాలోకం కోడై కూసి మిమ్మల్ని పలావ్ చేస్తుంది. సినిమా గాసిప్పులతో నింపేసి మీరు ప్రసారం చేసే సినిమా వాతలు జనానికి అస్సలు నచ్చవు ఎందుకంటే ఆ గాసిప్పులన్నీ వాళ్ళు మార్నింగ్ కాఫీతోటే సిప్పు చేసెసారు కాబట్టి. ఏదిఏమైనా వినాయకుడు ఇడ్లీ తింటున్నాడు లాంటి సంచలన వార్తలు ప్రసారం చేస్తే తప్ప మీకు మనుగడ చెరుకు గడే అవుతుంది.  

మీనం:

ఫిట్నెస్ కార్యక్రమాలకి పేరుగాంచిన ఛానళ్ళు ఎక్కువగా కలిగిన రాశి యిది. బాందేవ్ బాబా తన బ్రాండ్ ప్రమోషన్లో బిజీగా వుండటం వల్ల మరో మంచి యోగా గురు కోసం మీరు చేసే ప్రయత్నాలు బలుపా షెట్టీ ఒప్పుకోవడంతో సఫలమౌతాయి. అన్నివిధాలా కలిసొచ్చే వారం.

మరిన్ని వ్యాసాలు