మలేషియ లో వున్నది రెండు సంవత్సరాలే అయినా ఆ దేశం తో యేదో తెలియని అనుబంధం యేర్పడింది , అలాగే యెన్నో జ్ఞాపకాలు కూడా , అలాంటి ఓ జ్ఞాపకం మీతో పంచుకొని తరువాత థాయ్ లాండ్ గురించి మీకు తెలియ జేస్తాను .
ప్రతీ రోజూ యేదో ఓ మాల్ కి వెళ్లడం మాకు అలవాటుగా మారింది . అలా ఓ మాల్ లో పళ్లు కాయగూరల సెక్షన్లు లో ఓ సేల్స్ మేన్ పాటలు పాడుతూ కాయగూరల వల్ల లాభాలను వివరిస్తూ వుండే వాడు . అతను ఓ రోజు పళ్లు యెంచుకుంచున్న నాదగ్గరకు వచ్చి పరిచయం చేసుకొని నాకు తమిళం వచ్చని తెలుసుకొని తమిళంలో మాట్లాడుతూ వుండేవాడు . అలా మాట్లాడేటప్పుడు ఓ సారి జీవితంలో ఒక్కసారైనా భారతదేశం వెళ్లాలనేవాడు . యెందుకు అంటే తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలి అనేవాడు . మేం ప్రతీ మూడు నెలలకు పదిరోజులకోసం మనదేశం వచ్చేవారం . అదే విషయం అతనికి చెప్పాను . వెంటనే అతను రెండుచేతులూ జోడించి తిరుపతి నుంచి లడ్డూ ప్రసాదం తెమ్మని చెప్పేడు . సరే అన్నాను గాని యెక్కడ ఢిల్లీ , యెక్కడి తిరుపతి ఆ ట్రిప్పులో వెళ్లాలని అనుకోలేదు , తప్పకుండా అని మాటయిచ్చేను . వేంకటేశ్వరుడు మాకు దర్శనం యిస్తాడో లేదో తెలీదు . ఢిల్లి చేరేక తిరుపతి కి ట్రైను టికెట్లకోసం ప్రయత్నిస్తే దొరికేయి . మలేషియ వెళ్లేటప్పుడు లడ్డు ప్రసాదం మరచిపోకుండా తీసుకువెళ్లేం .
ఆ మాల్ కి వెళ్లడం అవక కొన్నాళ్లు , ప్రసాదం తీసుకు వెళ్లడం మరచిపోవడం వల్ల కొన్నాళ్లు అలా ఓ నెల గడచిపోయింది తరువాత నా పర్స్ లో ప్రసాదం వుంచుకొని తరుగసాగేను . మాల్ లో అతనికోసం వెతుకుతే యెక్కడా కనబడలేదు . అతనిని ట్రాన్సఫర్ చేసేరేమో అనుకున్నాను , యెవరినైనా అడుగుదామంటే అతని పేరు తెలీదు , మరేం చేసే దారి లేక అతనికి ప్రసాదం ప్రాప్తంలేదను కున్నాం . మరో రెండురోజుల తరువాత మళ్లా అదే మాల్ కి వెళ్లేం వుండబట్టలేక పళ్ల సెక్షన్లోవున్నతనిని అడిగితే పేరు చెప్పమన్నాడు . తెలీదు అని పాటలుపాడేవాడు అదీ యిది అని చెప్పగా నాకుతెలీదు నేను కొత్తగా వచ్చేను అని మరో అతనిని పిలచి నన్ను వొప్పచెప్పేడు . రెడ్డొచ్చేడు మొదలాటం అని మళ్లా అతని గురించి గుర్తులు చెప్తే అతనికి ఆక్సిడెంట్ అయింది , చావుబతుకులలో వున్నాడు పదిహేను రోజులబట్టి ICU లో వున్నాడు అని చెప్పేడు . ఎందుకు అతని గురించి అడుగుతున్నావు అన్నాడు . తిరుపతి ప్రసాదం గురించి చెప్పేను . అతనికి యిమ్మని లడ్డు యిచ్చేను . అతను అడ్రసు కాయితం నా చేతిలో పెట్టి నువ్వేవెళ్లి యియ్యి అని చెప్పేడు . మరునాడు ఆఎడ్రసు పట్టుకొని బయలుదేరేం , నాలుగు గంటలు తిరిగినా యిల్లు కనుక్కోలేక వెనుతిరిగేం . నాలుగు రోజుల తరువాత మాల్ కి వెళ్లేం . జరిగింది అతనికి చెప్పి ప్రసాదం యెలాగైనా యివ్వమని చెప్పేం . నీ ప్రసాదం వాళ్లవాళ్లకి యిస్తాను గాని అతను తినగలడని అనుకోను , ఈ క్షణమో మరుక్షణమో అన్నట్లు వున్నాడు అని చెప్పాడు . ఓ యేడాది కాలం గడిచి పోయింది మేము మలేషియ నుంచి థాయ్ లాండు కి వెళ్లిపోయేం . మరో ఆరునెలలు గడిచి పోయిన తరువాత తిరిగి మలేషియ కంపెనీలో యేదో ప్రోబ్లమ్ వస్తే మలేషియ పదిహేను రోజులకోసం వచ్చేం . ఏ దేశం వెళ్లినా వండుకోడం తినడం తప్పదుకదా ? వంటసామానులు కొనడానికి మాల్ కి వెళ్లేం , కూరలు పళ్లు కొంటూ వుంటే కాస్త లావుగా వున్నతను నా కాళ్లు పట్టుకొని వెక్కి వెక్కి యేడుస్తున్నాడు . తర్వాత తెలిసినది యేమిటంటే నేను ప్రసాదం యిచ్చినది అతనికేనని , నేను పంపిన పద్మావతి కుంకుమ అతనికి పెట్టిన తర్వాత కళ్లు తెరిచేడట , లడ్డు ప్రసాదం నోట్లో వేసినప్పటినుండి కాస్తకాస్త గా కోలుకున్నాడట . మొత్తం యిరవై సర్జరీల తరువాత యేడాదికి కోలుకొని తిరిగి మాల్ లో వుద్యోగానికి వచ్చేడు . నన్ను అతనే గుర్తుపట్టి వేంకటేశ్వరు ని కృప వల్ల బతికి బయట పడ్డాను . అని యెన్ని సార్లో ధన్యవాదాలు చెప్పేడు . తిరుపతి వెళ్లి నపుడు తన తరఫున దేవుడికి ధన్యవాదాలు చెప్పమన్నాడు . మాకైతే చాలా ఆనందం అనిపించింది .
మలేషియ నుంచి మా వారిని థాయ్ లాండ్ పంపించేరు . థాయ్ ల్యాండ్లో ' పట్టయ ' నగరం లో వుండవలసి వచ్చింది . అక్కడి ఓ యేడాది అనుభవం ప్రపంచం యెలా వుంటుందో , యాభైయేళ్ల జీవితంలో నాకు తెలీని యెన్నో చీకటి నిజాలు తెలియజేసింది . నా అనుభవాలు తరువాత , ముందు థాయ్ లాండ్ గురించి తెలుసుకుందాం .
చరిత్రకారుల ప్రకారం సుమారు 40 వేల సంవత్సరాలకి ముందు నుంచి యీ దేశం లో మనుష సంచారం వుండేదని అంటారు . ఇప్పటికీ రాజరికం అమలులో వున్న చాలా కొద్ది దేశాలలో యిది వొకటి . పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలనా బాధ్యతలు ప్రజలచే యెన్నుకోబడ్డ మంత్రుల అధీనంలో వున్నా అధికారం మాత్రం పట్టాభిషిక్తుడైన రాజుదే .
ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు మన ఆచార వ్యవహారాలను పోలివుంటాయి . దీనికి కారణం ఈ దేశం కొన్ని వేల సంవత్సరాలు హిందూ చక్రవర్తుల పరిపాలనలో వుండడం కూడా ఓ కారణం గా చెప్తారు .
ఉత్తరాన మైనమార్ , లావోస్ దేశాలు , తూర్పు లావోస్ , కంబోడియ దేశాలు , దక్షిణాన గల్ఫ్ ఆఫ్ థాయ్ లాండు , మలేషియ , పశ్చిమాన అండమాన్ సముద్రం , మలేషియ దేశాలు సరిహద్దులుగా వున్నాయి . సుమారు 5 లక్షల 13 వేల చదరపు కిలోమీటర్ల నేలను ఆక్రమించుకొని వుందీ దేశం .
మౌర్యులు , గుప్తులు , ఖమేరులు , ద్వారావతిలు , శ్రీవిజయ , పల్లవుల పాలనలో వున్నట్లు చారిత్రక ప్రమాణాలు వున్నాయి . హిందూ రాజ్యం నుండి విడిపోయాక చాలా కాలం అంతఃర్యుధ్దాలతో అతలాకుతలమైంది . మైన్మార్ , లావోస్ ల పాలనలో వుండేది . థాయ్లాండ్ 1238 నుంచి 1448 వరకు సుఖోతాయి రాజ్యాంగాను , 1767 వరకు అయోథియ రాజ్యాంగాను 1768 నుంచి 1782 వరకు థోనుబురి రాజ్యాంగాను , 1782 నుంచి రత్నకోశిని రాజ్యాంగాను గుర్తింపబడింది . 16 వ శతాబ్దం లో థాయ్ లాండు లో యురోపియన్ల పాలన ప్రవేశించింది . 1804 లో రామ -4 ' అయోథియ ' రాజధానిగా చేసుకొని పట్టాభిషిక్తుడయ్యాడు . ముందుగా థాయ్ ల్యాండ్ లోని రాజ్యాలైన జ్ఞోనియాంగ్ , సుకోథాయి , ఛియాంగ్ మై , లాన్ న లను గెలిచి థాయ్ లాండు సామ్రాజ్యాన్ని నిర్మించేడు . తరచు మైన్మార్ తో జరుగుతున్న యుధ్దాలను దృష్టిలో పెట్టుకొని రాజధానిని అయోథ్యనుంచి బేంకాక్ కి మార్చారు .1932 లో రాజ్యాంగ బధ్దమైన సామ్రాజ్యంగా ప్రకటించుకున్నారు .
థాయ్ లాండుని ' సియామి 'దేశం అనికూడా అంటారు . 1939 లో సియామ్ అని పిలువబడే యీ రాజ్యాన్ని థాయ్ లాండ్ గా మార్చారు . తిరిగి 1946 నుంచి 1948 వరకు తిరిగి సియామ్ గా మార్చేరు . ప్రస్తుతం థాయ్ లాండ్ గాన పిలువ బడుతోంది .
ఖమేర్ రాజుల కాలంలో నిర్మ్ంపబడ్డ అతి పెద్ద హిందూ దేవాలయమైన ' అంకోర్ వాట్ ' లో దొరికి శిలా శాసనాల ప్రకారం థాయ్ లాండ్ ని ' శ్యామ ' దేశంగా పిలిచేవారని లిఖించి వుంది . తరువాత వలస చైనీయులు యీ దేశాన్ని ' ఝియాంగ్ ' అని పిలిచేవారు . అదే కాలక్రమేణా సియామ్ గా మారి వుంటుందనేది చరిత్రకారుల అభిప్రాయం .
దేశం ప్రజలు బౌద్దులైనా రాజులకు మాత్రం రామాయణం ఆదర్శం . పట్టాభిషిక్తుడైన రాజుకి ' రామ ' అనే బిరుదు నిచ్చి పిలువడం యిక్కడి ఆచారం . ప్రస్తుతం వున్న రాజు రామ -9 .
నాలుగు రోడ్ల జంక్షన్లలో హనుమంతుడు , వినాయకుడు బొమ్మలు , చాలా భవంతుల ముందు మూడు తలల బ్రహ్మ విగ్రహాలు మనకి ఆశ్చర్యాన్ని కలుగ చేస్తాయి . హనుమంతుడిని మంకి గాడ్ అని వినాయకుడిని ' హిందూ బుద్ద ' లేక ఎలిఫెంటు హెడ్ గాడ్ అని అంటారు . పై వారం మరిన్ని వివరాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ శలవు .